అర్బన్ జిల్లా పరిధిలో గర్బిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అర్బన్ జిల్లా డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ లలితాదేవి వైద్య సిబ్బందికి సూచించారు. నగర పరిధిలో ఉన్న కాంటైన్మెంట్ జోన్లో ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణిల ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొరోనా నేపథ్యంలో నగర పరిధిలో ఉన్న అన్ని ఏరియాలతో పాటు ప్రత్యేకంగా కాంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన హై రిస్క్ ఏరియాలలో కూడా గర్బిణిలు, శిశువుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంటైన్మెంట్ జోన్లలో ఉన్న గర్బిణిలకు తప్పనిసరిగా కొరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అర్బన్ జిల్లా పరిధిలో ఈ నెలాఖరు వరకు ప్రసవానికి సిద్ధంగా ఉన్న 1088 మంది గర్భిణిలను గుర్తించడం జరిగిందని అందులో కాంటైన్మెంట్ జోన్లుగా ఉన్న చార్బౌలి, పూరిగుట్ట, ఎర్రబెల్లి తండాతో పాటు హన్మకొండ సుబేదారి ప్రాంతాల్లో 372 మంది సిబ్బందిని గుర్తించడం జరిగిందని వీరందరికి వరంగల్ సికెఎం ఆసుపత్రితో పాటు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులలో నెలవారి పరీక్షలు నిర్వహిస్తూనే ప్రసవానికి
సిద్ధంగా ఉన్న గర్భిణిలకు కొరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎంఅండ్హెచ్ఓ తెలిపారు. రాష్ట్రంలో కొరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పుట్టబోయే శిశువులకు కూడా కొరోనా సోకిఉంటుందనే అనుమానంతో గర్బిణిలకు కొరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు
అర్బన్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 27 కొరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు డిఎంఅండ్హెచ్ఓ లలితాదేవి తెలిపారు. అందులో మంగళవారం 25 మంది చికిత్స అనంతరం కొలుకొని డిశ్చార్జి కాగా మరో ఇద్దరు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సోమవారం నమోదైన పూరిగుట్ట ప్రాంతానికి చెందిన కొరోనా 10 ఏళ్ళ బాలిక తల్లికి పాజిటివ్ కేసు నమోదు కాగా, ఆమె కూతురుతో పాటు గత 15 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో పాజిటివ్‌గా గుర్తించడం జరిగింది.