కోవిడ్-19 నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ, వ్యక్తుల తీరులో మార్పు వచ్చింది. ఆర్థిక రంగంలో వ్యవహరణ తీరులో కూడా మార్పు వస్తుంది. మూడో సారి లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో ఎటువంటి ప్రయోజనాలు కలగలేదన్న అభిప్రాయం జనంలో ఉంది. అంతేకాక, మళ్ళీ వ్యాపిస్తుందేమోనన్న భయం కూడా ఉంది. ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేస్తే జనం వీధుల్లోకి గుంపులుగా వచ్చే అవకాశం ఉంది. మద్యం దుకాణాలను తెరిచినప్పుడు ఒక్కొక్క దుకాణం వద్ద చాంతాండంత క్యూలను చూస్తున్నాం. వ్యక్తుల ప్రవర్తనల్లో వచ్చి మార్పు ఇది. అలాగే ప్రభుత్వాలు, వ్యక్తులు, వ్యాపారస్తుల తీరు తెన్నులను కూడా చూస్తున్నాం. ఈ మార్పులు భారత ఆర్థిక వ్యవస్థకు పునరాకృతిని కలిగిస్తాయా? భద్రతా ప్రమాణాలు పాటిస్తే కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. సురక్షితమైన కార్యక్రమాల్లో నిబంధనల మేరకు కార్యకలాపాల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరగవచ్చు. సరైన విధానాలతోనే ఇది సాధ్యం. ముఖ్యంగా, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి. భారత ఆర్థిక వ్యవస్థకు అదే పెద్ద బలం.
కొరోనాకు వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇప్పడు సంభవించిన మరణాల కన్నా అధిక సంఖ్యలో మరణాలు సంభవించవచ్చని భావించారు. అలాగే, ఇంకా ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడవచ్చని కూడా అంచనా వేశారు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాల్లో, మనుషుల్లో పరివర్తన వస్తుందని ఆర్థిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
జాన్ కోచ్రానే ప్రవర్తనా ఎస్ఐఆర్ మోడల్ ను ప్రకటించారు. అంటువ్యాధుల నివారణ వ్యక్తుల అలవాట్లు, అనుసరించే పద్దతులను బట్టి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల అనేక ప్రభుత్వాల వైఖరుల్లో మార్పు వచ్చింది. విధానపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వ్యక్తుల వ్యవహరణ తీరులో మార్పు వచ్చింది. ముఖానికి గుడ్డ కట్టుకోవడం, లేదా మాస్క్లు ధరించడం తప్పనిసరి చేయడం వల్ల ప్రజలకు అది అలవాటుగా మారింది. అలాగే, భౌతిక దూరాన్ని పాటించడం అనేది జీవన విధానంలో భాగమైంది. వ్యక్తులే కాదు, ప్రభుత్వాలు సైతం కొరోనా పట్ల జాగ్రత్తలను సీరియస్గా తీసుకోవడం ప్రారంభించారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తదితరులు కొరోనా పట్ల ముందు ప్రదర్శించిన వైఖరిలోనూ, తర్వాత వైఖరిలోనూ చాలా తేడా ఉంది. వ్యాక్సిన్ రాకపోయినా చాలా దేశాల్లో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో మూత పడిన పరిశ్రమలను తెరిచేందుకు సిద్దం చేస్తున్నారు. అయితే, ఉత్పత్తి పడిపోవచ్చనీ, పూర్వం మాదిరిగా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చని, లే ఆఫ్లు తప్పవేమోనన్న వార్తలు వస్తున్నాయి. నిరుద్యోగం, ఆకలి వంటి మాటలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ప్రభావం ప్రభుత్వ రాబడిపైనా కూడా పడింది. మతపరమైన సమావేశాలకు దూరంగా ఉండటానికి అలవాటు పడ్డారు. జనసమర్దంగా ఉన్న ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటించడం కష్టమే. 2011 జనాభా లెక్కల ప్రకారం 30 శాతం ఇళ్ళల్లో 60 ఏళ్ళ వారు కనీసం ఒకరు ఉన్నట్టు తేలింది. వారి విషయంలో శ్రద్ధ తీసుకోవల్సిన అవసరం ఉంది. లాక్ డౌన్ ద్వారా జనంలో చైతన్యం కలిగించిన మాట నిజమే., లాక్ డౌన్ సమయంలో పాటించిన నియమ నిబంధనలను ఆ తర్వాత కూడా జనం పాటిస్తేనే ప్రజల్లో చైతన్యం వచ్చినట్టు లెక్క. లాక్ డౌన్ సమయాల్లో జనం ఇళ్ళకే పరిమితం కావడం వల్ల ఖర్చులు తగ్గాయి. పొదుపు అలవాటైంది. ఆ తర్వాత కూడా దానిని పాటిస్తేనే సార్ధకమైనట్టు. గ్రామీణ వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైతులు పండించిన పంటను గ్రామీణ మార్కెట్లకు తరలించడంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడటానికి అనుసరించిన పద్దతులను పాటించాలి. మన దేశంలో అలాంటి వాతావరణం ఉన్న దృష్ట్యా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మన ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది ఉండదని భావించవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మన బలం.
– ‘ద ప్రింట్’ సౌజన్యంతో..