Take a fresh look at your lifestyle.

నేడు మాతృదినోత్సవం అమ్మ ప్రేమకు సాటి లేదు

అమ్మ ప్రేమ అమృతధార. అమ్మ ప్రేమ కమ్మనిది. శిశువుకు తొలిగురువు అమ్మే. శ్వాస, ధ్యాస అమ్మ. ప్రేమను పంచేది అమ్మే. మాతృ దేవోభవ అనే మాటకు నిజమైన అర్దం అమ్మే. సృష్టిలో ప్రతీ  ప్రాణికి మూలం అమ్మే. అమ్మ ప్రేమలో కల్తీ లేదు. అమ్మ అనే పేరులో కమ్మని దనం ఉన్నది..కరుణ ఉంది..జాలి ఉంది..త్యాగం ఉంది..నిస్వార్థం ఉంది..నిజమైన ప్రేమ ఉంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ప్రేమ మూర్తి అమ్మ. చనుబాలు తాగించి, గోరు ముద్దలు తినిపించి ప్రేమతో లాలించే ప్రేమమూర్తి అమ్మే. అందుకే మాతృదేవోభవ అంటారు. అంటే తల్లిని మించిన దైవం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. పొద్దంతా గొడ్డుచాకిరి చేస్తుంది. విసుగు చెందదు..విరామం ఉండదు. తన పిల్లలు ద్వేషించినా, దూషించినా తొనకని నిండుకుండ అమ్మ. తాను ఉపవాసం ఉండి తన పిల్లలకు కడుపునిండా అన్నం పేట్టే మాతృమూర్తి అమ్మ. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవం అంటారు. అన్ని రుణాలను తీర్చవచ్చును గాని అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. అందుకే అమ్మ రుణం తీరేది కాదంటారు. డిల్లికి రాజైనా తల్లికి కొడుకేనని సామెత ప్రసిద్ది కెక్కింది.

ఎవరు రాయగలరు అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం, అమ్మేగా..అమ్మేగా తొలిపలుకు నేర్పుతున్న భాషకి అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పాడిన పాట ప్రసిద్ధికెక్కింది. అంగట్లో అమ్మ ప్రేమ దొరకదు, అమ్మ మనసు అమృత ధార, అమ్మ కడుపు చూస్తుంది..ఆలు జేబు చూస్తుంది, అమ్మ ప్రాణం పోసేది..అమ్మ ప్రాణిని మోసేది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడట. నడకే కాదు అమ్మ నాగరికతను నేర్పుతుంది. దారి తప్పిన వాళ్లకి జ్ఞానబోధ చేస్తుంది. అమ్మకు కుట్రలు, కుతంత్రాలు ఉండవు. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరే మాతృమూర్తి. అమ్మ పునర్జన్మను ఎత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. శిశువు ఏడిస్తేపాలిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తుంది.బువ్వ పెడుతుంది. లాలిపాట, జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది. పదాలు తెలియని పెదవులకు అమృతం ఇస్తుంది. అమ్మ ఒడి చల్లగా ఉంటుంది. ఈ జన్మ మహిళగా నీ త్యాగం ఎప్పటికి మరువలేమమ్మ అంటూ శిశువు ఆనందపడతాడు. ద్వేశించిన వారిని ప్రేమిస్తుంది. అమ్మ మంచితనం, అమ్మ మాటకారితనం అమ్మ కష్టం, అమ్మ కన్నీళ్లు ఎంత చెప్పినా తరగనిది. అమ్మ చేసిన సేవలకు గుర్తింపుగా పుత్రులు తల్లిని బంగారు పళ్లెంలో పెట్టి పోషించవలసి ఉంటుంది. కాని అల్లారు ముద్దుగా అమ్మ ప్రేమను పొందిన నేటి కొడుకులు తల్లులను వృద్ధాశ్రమంలో వేయడం దురదృష్టకరమైన పరిణామం.

తల్లులను కొట్టి హింసించే పాపాత్ములు కూడా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వృద్ధులను పోషించని కుమారులు, కోడళ్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేసింది. శిశుమందిరాల వంటి సంస్థలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల గొప్పతనం తెలపడానికి తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాలు నిర్వహించి జ్ఞానోపదేశం చేస్తున్నాయి. భారతం, రామాయణం, భారతం, భాగవతం వంటి పురాణ ఇతిహాసాలు సైతం మాతృమూర్తి గొప్పతనాన్ని వివరించాయి. మనసు విప్పి తల్లితో సంతోషంగా, ఆప్యాయంగా మాట్లాడుదాం. అమ్మ నీవు లేకుంటే ఈ సృష్టి లేనే లేదు. నీ త్యాగం, నీ ఓపిక, నీ సహనం వెలకట్టలేనివి. కుటుంబాన్ని, పిల్లలను కనుపాపలా చూసుకొని ఆత్మీయ అనురాగాలను పంచి, పెంచి తల్లి అహర్నిషలు శ్రమిస్తుంది. పిల్లల బంగారు భవిష్యత్‌ ‌కోసం, కుటుంబాన్ని నందనవనం చేయడం కోసం పిల్లల కోసం కంటిపాపల చూసుకొని వారికి బంగారు భవిష్యత్‌ ఇస్తున్న అమ్మకు పాదాభివందనం. జన్మనిచ్చిన మాతృమూర్తికి ప్రపంచ చరిత్రలో గొప్ప పేరు ఉంది. ప్రపంచంలో అమ్మ గొప్పతనాన్ని గుర్తించడానికి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని మొదటిసారిగా గ్రీసు దేశస్తులు నిర్ణయించారు.17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌ ‌దేశంలో కన్నతల్లుల సేవలకు గౌరవంగా ‘‘మదరింగ్‌ ‌సండే’’ మొదటిసారిగా ప్రారంభమై 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంబిం చారు.1914లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రోవిల్సన్‌ ‌మే నెలలోని 2వ ఆదివారాన్ని అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీచేయడంతో ప్రపంచమంతటా ప్రతీ యేటా మే నెల 2వ ఆదివారం మాతృదినోత్సవంగా జరుపుకుంటున్నాం. హ్యాపీ మదర్స్‌డే.. కొడుకుల్లారా అమ్మలను వృద్ధాశ్రమాలో వేయకండి..

image.png

రావుల రాజేశం,
లెక్చరర్‌
7780185674

Leave a Reply