- గోదావరి జలాలతో రెండు పంటలు
- పండించే శుభ ఘడియలొచ్చాయి..
మంత్రి హరీష్‌రావుకు బోనాలతో స్వాగతం పలికిన లక్ష్మీదేవిపల్లి, కోదండరావుపల్లి గ్రామస్థులు
లక్ష్మీదేవిపల్లిలో హనుమంతుడి విగ్రహానికి గోదావరి జలాలతో అభిషేకం చేసిన హరీష్
సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లెలో రంగనాయక సాగర్ ప్రధాన ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలతో గ్రామాల్లోని చెరువులు నిండాయి. ఈ మేరకు ఆయా గ్రామస్తులు మంగళహారతులు, బోనాలు, డప్పు చప్పుళ్లతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మంత్రిపై పూల వర్షం కురిపించారు. అనంతరం గ్రామాల్లోని ప్రజలంతా కట్ట మైసమ్మ, పోచమ్మకు బోనాలు తీస్తూ.. గ్రామ శివారులోని కాలువ వద్ద మంత్రి హరీష్‌రావుతో కలిసి గంగమ్మకు జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. బొంబాయి, దుబాయ్ పోవుడు వద్దు.. బాయి కాడికే పోయి.. గుంటేడు పొలం ఉన్నా పని చేసుకుందామని రైతులకు మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.
సిఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం జలాలతో ఆంజనేయ స్వామి విగ్రహానికి బిందెడు నీళ్లతో అభిషేకం చేయడంతో నా జన్మ ధన్యమైందనీ, గోదావరి జలాలతో పంటలు పండించే శుభ గడియలు ఇవాళ్టితో ప్రారంభమయ్యాయన్నారు. కాళేశ్వరం నీళ్లతో ప్రతి ఎకరం బంగారంలా పంటలు పండిస్తేనే బంగారు తెలంగాణ అవుతుందన్నారు. ప్రతి పంట పండటం, చేతి నిండా పని దొరకడమే బంగారు తెలంగాణ అన్నారు. ఇక నుంచి రైతులు రంది పడొద్దు. కాళేశ్వరం జలాలతో కాలంతో, కరెంటుతో సంబంధం లేకుండా సంవత్సరానికి రెండు పంటలు తీయొచ్చనీ, ఎనుకటికి లక్ష్మీదేవిపల్లె మిరపతోనే తొక్కులు పెట్టేవారు. గత వైభవాన్ని తిరిగి చాటి చెప్పేలా మిరప పంటలు పండించి లక్ష్మీతో.. కళకళలాడే లక్ష్మీదేవిపల్లె కావాలి. ఇదంతా మీ గ్రామ యువత చేతుల్లోనే ఉందన్నారు. లక్ష్మీదేవిపల్లె అమ్మ కుంట.. ఇక నుంచి నిండు కుండలా 365 రోజులు నీళ్లతో కలకళలాడుతుందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.