- ఆ లెక్కన ఇప్పటికి 2.5 లక్షల ఉద్యోగాలు రావాలి
- కేబినేట్లో ఉద్యోగాలపై చర్చించారా?
- ఏడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు
- ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- ఎఐసిసి అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ డిమాండ్
రాష్ట్రంలో ఎక్కడ లేనంతగా రెండు రోజులు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది కానీ నిరుద్యోగ సమస్యపై కనీసం చర్చ జరగక పోవడం శోచనీయమని ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో శ్రవణ్ మాట్లాడుతూ దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, మండలి ఎన్నికలు, నాగార్జున సాగర్ ఎన్నికల సమయంలో కెసిఆర్, వారి పార్టీ నేతలు ప్రతీసారి కూడా 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నాంటూ ప్రగల్భాలు పలికారని, అలా అయితే ఇప్పటి వరకు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ కావల్సిందని, కానీ 7 ఏళ్ల కాలంలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇంత ఘోరంగా ఎక్కడా లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానంటే వారు 3016 రూపాయలు ఇస్తామన్నారని కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని, ఎందుకు ఇవ్వలేదని శ్రవణ్ ప్రశించారు. నిరుద్యోగులు టిఆర్ఎస్ నాయకుల గల్లా పట్టుకొని అడగాలాని పిలుపునిచ్చారు.
ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రణాళికలు లేవని, ఉద్యోగ కాలెండర్ ప్రకటించాలని మొదటి నుంచి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొత్తం 4.91 లక్షల ఉద్యోగాలు ఉండగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇన్ని ఖాళీలు ఉన్నా ఎందుకు నింపడం లేదని అన్నారు. 1.12 లక్షల ఉద్యోగాలు 2014లో ఖాళీ ఉన్నాయని, బిస్వాల్ కమిటి 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిందని, జిల్లాల సంఖ్య 33 జిల్లాలకు పెంచినా కూడా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదని, 1.91 లక్షల పోస్ట్‌లు ఖాళీగా ఉంటే 50 వేల పోస్టులు నింపుతామని ఎందుకు అంటున్నారని శ్రవణ్ ప్రశించారు. ఒకవైపు ఉద్యోగుల మీద పని భారం..మరోవైపు ఖాళీలు ఎందుకు ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. 2018, ఆగస్టు 30న, 124 జిఓ ఇచ్చినపుడే 36 నెలల్లో అన్ని ఖాళీలు పూర్తి చేయాలని ఇచ్చారని, ఇంతవరకు ఎందుకు నింపలేదో యువకులు టిఆర్ఎస్ నాయకులను నిలదీయాలన్నారు.
క్లియర్‌గా ఖాళీ ఉన్న పోస్ట్‌లను ఎందుకు నింపడం లేదని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పాలకులకు కనికరం లేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఉద్యమాలతో వొచ్చిన తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా.. అయినా వాళ్లపై ఎందుకు ప్రేమ లేదని ప్రశించారు. ఇప్పటికైనా ఉద్యోగ ఖాళీల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో కూడా మోసం చేస్తున్నారని, టీఎస్ ఇపాస్లో కూడా ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ మోసం చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు.