Take a fresh look at your lifestyle.

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.‌కృష్ణయ్య డిమాండ్‌
  • ‌పార్లమెంట్‌ ‌ముట్టడికి ప్రయత్నం

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.‌కృష్ణయ్య డిమాండ్‌ ‌చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, రెండు లక్షల కోట్ల బడ్జెట్‌ ‌కేటాయించాలని ఆయన డిమాండ్‌ ‌చేసారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ దాదాపు 120 మంది బీసీ నేతలు సోమవారం పార్లమెంట్‌ ‌ముట్టడికి యత్నించారు. వీరందరిని పోలీసులు అరెస్ట్ ‌చేసి, మందిర్‌ ‌మార్గ్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతర తెలంగాణ భవన్‌లో ఆర్‌ ‌కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లుపై వివిధ పార్టీలకు చెందిన దాదాపు 120 మంది బీసీ ఎంపిలు పార్టీలకతీతంగా 15 రోజులు పార్లమెంటును వాకౌట్‌ ‌చేస్తే కేంద్రం దిగి వొస్తుందన్నారు. బిసిల కోసం పోరాడాల్సిన బాధ్యత బీసీ ఎంపీలపై ఉందని గుర్తు చేశారు. పార్లమెంటులో బిసి బిల్లును పెట్టకపోతే ఆ ఎంపీలతో పాటూ, కేంద్ర మంత్రులను దేశంలో తిరుగనివ్వమని హెచ్చరించారు.

బిసిలకు ఇచ్చేది బిక్షం కాదని, రాజ్యాంగ బద్ధమైన హక్కు అని అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలోకి 27 బిసిలకు చోటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయితే, 70 కోట్ల మంది బిసి ప్రజల అభివృద్ధికి ఏమి చేయకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. వెనకబడిన వర్గాల అభివృద్ధి వలన మాత్రమే దేశం అఖండ భారత్‌గా తయరవుతుందన్నారు. అత్మ గౌరవం కోసం తెగించి పోరాడే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. కానీ, 55 శాతం ఉన్న బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా అణచిపెట్టారని ఆరోపించారు. బిసి బిల్లుపై పార్లమెంటులో ఇప్పటి వరకు 14 పార్టీలు సుముఖత వ్యక్తం చేశాయన్నారు. బిజెపి పార్టీ అంగీకరిస్తే ఒక్కరోజులోనే బిల్లు పాస్‌ అవుతుందని చెప్పారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బిసి కులాల ఆధారంగా జనాభా గణన చేసి, కేంద్ర స్థాయిలో స్కాలర్‌షిప్‌ ‌స్కీమ్‌, ‌ఫీజు రియంబర్స్ ‌మెంట్‌ ‌ప్రవేశపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఏపి, తెలంగాణకు చెందిన వందలాది మంది బీసీలు పాల్గొన్నారు.

Leave a Reply