Take a fresh look at your lifestyle.

దివ్యాంగులకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లలో 5 శాతం

  • అమలుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు
  • ఎల్బీ స్టేడియంలో ఉపకరణాల పంపిణీ సందర్భంగా మంత్రి కెటిఆర్‌

సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్‌ ‌తమకు ఎప్పుడూ చెప్తుంటారని, పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్‌ ఉద్ఘాటించారు. వారి ముఖాల్లో చిరునవ్వును చూసిప్పుడే తమకు సంతోషంగా ఉంటుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ..దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రూ. 24 కోట్ల 38 లక్షలతో 16,600 మంది దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణీ చేయడం సంతోషాన్నిస్తుందన్నారు. నాలుగైదు నెలల కిందట దివ్యాంగుల సమస్యల పట్ల సమావేశం నిర్వహించి కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని చాలెంజ్‌ ‌చేయడం జరిగిందని, అందులోని ఆవిష్కరణలను కొన్నింటిని ఇవాళ దివ్యాంగులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రీ మెట్రిక్‌, ‌పోస్టు మెట్రిక్‌ ‌స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామని చెప్పారు. నైపుణ్యా శిక్షణా కేంద్రాలను దివ్యాంగుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు.

గతంలో దివ్యాంగులకు పెన్షన్ల కింద రూ. 500 ఇస్తే..టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 3016 ఇస్తున్నామని పేర్కొన్నారు. డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లలో కూడా 5 శాతం ఇండ్లను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ నిబంధన అన్ని జిల్లాల్లో అమలయ్యే విధంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లను దివ్యాంగుల కోసం అమలు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ‌కింద దివ్యాంగుల వివాహాలకు రూ. 1,25,145 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు వికలాంగులశాఖ డైరెక్టర్‌ ‌శైలజ పాల్గొన్నారు.

Leave a Reply