
– క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షణ
– 520 మంది విద్యార్థులు సిబ్బంది కి పరీక్షలు
– ముత్తంగి గురుకుల వసతిగృహంలో ఘటన
పటాన్చెరు,ప్రజాతంత్ర విలేకరి,నవంబర్ 29 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ లైన్ ద్వారా విద్యా బోధన జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పాఠశాలలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి పూర్తిగా అంతం కాకముందే పాఠశాలలను తెరవడంతో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పింది. ఫలితంగా పటాన్చెరు మండలం ముత్తంగి శివారులోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో భారీ సంఖ్యలో విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. సమాచారం అందుకున్న వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మల్లప్ప బట్ట, సంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ గాయత్రి దేవి తో పాటు జిల్లా ఉన్నత అధికారులు హుటాహుటిన వసతి గృహానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగి లో గల మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలలో కలిపి 520 మంది విద్యార్థులు, 20 మంది ఉపా ధ్యాయులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. కాగా గత మూడు రోజుల క్రితం ఒక విద్యార్థికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు తీసుకు వెళ్లి పోయారు. ఆ విద్యార్థికి పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో వసతి గృహంలో ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు గురైంది. సోమవారం ఉదయం మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల రాష్ట్ర సెక్రటరి మల్లప్ప బట్ట, డీఎంహెచ్ఓ గాయత్రి, ఆర్డీఓ నాగేష్, తహశీల్దార్ మహిపాల్ రెడ్డి లు పాఠశాలకు చేరుకొని వైద్యుల పర్యవేక్షణలో కొరోనా పరీక్షలు నిర్వహించారు. 520 మంది విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా అందులో 47 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలి కి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. వసతి గృహంలోనే రూమ్ కి ఐదు మంది చొప్పున క్వారంటైన్లో ఉంచి, విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు.కొరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గురుకుల వసతి గృహంలో ఒక్కసారిగా ఇంతమంది కొరోనా బారిన పడడంతో పారిశ్రామికవాడ ఒక్కసారిగా ఉలిక్కిపటుకు గురైంది.