- అత్యధికంగా ఆర్సిపురంలో 67.71 శాతం నమోదు
- వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలలో 46.55 శాతం వోటింగ్ నమోదైంది. 2016లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఈసారి స్వల్పంగా వోటింగ్ శాతం పెరిగింది. ఈమేరకు బుధవారం జీహెచ్ఎంసి ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. మంగళవారం జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికలకు సంబంధించి 149 డివిజన్లలో జరిగిన ఎన్నికల శాతం వివరాలన వెల్లడించారు.
ఇందులో అత్యధికంగా ఆర్సిపురం డివిజన్లో 67.71, అత్యల్పంగా యూసుఫ్‌గూడ దివిజన్‌లో 32.09 శాతం వోటింగ్ జరిగిందని తెలిపారు. కాగా, సిపిఐ, సిపిఎం పార్టీల గుర్తులు తారుమారు కావడంతో వాయిదా పడ్డ ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌కు గురువారం తిరిగి పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం డివిజన్ పరిధిలో 69 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. రీపోలింగ్ దృష్ట్యా డివిజన్ పరిధిలోని అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినుట్ల హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి వెల్లడించారు. సెలవును అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల అధిపతులు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వోట్ల లెక్కింపుకు పర్యవేక్షకుల నియామకం
జీహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఫలితాల వెల్లడికి సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిమగ్నమైంది. శుక్రవారం జరుగనున్న కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులను నియమించింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి వోట్ల లెక్కింపు సందర్బంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 31 మంది పర్యవేక్షకులుగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే వీరంతా వోట్ల లెక్కింపు ప్రక్రియలో క్రమశిక్షణ పాటించడం, గొడవలు కాకుండా నియంత్రించడం వంటి చర్యలు చేపడతారు. వోట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా నియమితులైన వారితో ఎన్నికల కమిషనర్ గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వోట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వారి విధులను, బాధ్యతలకు సంబంధించిన అంశాలను వివరించనున్నారు.