Take a fresh look at your lifestyle.

ఉపాధి కూలీల వేతనాల చెల్లింపుల్లో.. జాప్యం జరగొద్దు

  • నర్సరీ నిర్వహణ చేయని గ్రామాలపై చర్యలు తప్పవు
  • ఉపాధి పనులు జరిగే సైట్స్ ‌సందర్శించి కూలీలను ప్రోత్సహించాలని ఎంపిడివోలకు ఆదేశం
  • ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధి కూలీలతో ముచ్చటిస్తా
  • ఉపాధి పనుల కూలీలకు వేతనాల చెల్లింపులపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రి హరీష్‌ ‌టెలీ కాన్ఫరెన్స్

కొరోనా నేపథ్యంలో ఉపాధి హామీ పనులు చాలా విలువైనవనీ, కూలీలకు పని దినాలు పెంచి పనులు కల్పించాలని ఎంపిడివోలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో ఉపాధి హామీ పనులు పెంచేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు, మండలాల వారీగా ఎంపిపిలు, జడ్పిటిసిలు, ఎంపిడివోలు, ఏపివోలు, టెక్నీకల్‌ అసిస్టెంట్స్, ‌డీఆర్డీఏ పీడీ గోపాల్‌ ‌రావు, డీపీవో సురేష్‌, ఇతర జిల్లా సిబ్బంది మొత్తం 108 మందితో మంత్రి హరీష్‌రావు టెలీ కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… లాక్‌డౌన్‌ ‌కారణంగా పనులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతో మంది దినసరి వృత్తిలో జీవనం గడిపే వారైన ఆటో డ్రైవర్లకు, హామాలీలకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు, వృత్తి కళాకారులకు 24 గంటల్లో ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని, వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి హరీష్‌ ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు పెంచండి, జిల్లాలో లక్ష మందితో పనులు చేపట్టి సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచిందని, జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఉపాధి హామీలో కూలీలు పెరగకపోవడానికి ప్రధాన కారణం కూలీల వేతనాలు చెల్లింపులు చేయకపోవడమేననీ, ఎంపిడివో, ఏపివో, టెక్నీకల్‌ అసిస్టెంట్స్ ‌పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యాయని అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు జరిగే చోట పొద్దున్నే సైట్స్ ‌వద్దకు వెళ్లి ఉపాధి కూలీలను ప్రోత్సహించాలని ఎంపిడివోలను, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి ఆదేశించారు.

ఉపాధి పని చేసినప్పటికీ కూలీలకు వేతనాలు చెల్లింపులు జరగడం లేదని కూలీలు అసంతృప్తితో ఉన్నారనీ, కూలీల సంఖ్య పెంపుతో పాటు కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం జరగొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు. కూలీల వేతనాల చెల్లింపులపై పలు సాంకేతిక సమస్యలు పరిష్కరించక పోవడంతో రెండు వారాలు కూలీల వేతనాల పంపకాలు జరపడం ఆలస్యమైందనీ, ఈజీఎస్‌ ‌కూలీలకు రూ.2.65 కోట్లు నిధులు విడుదల చేయించినట్లు, పోస్టాఫీసు ద్వారా తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఎంపిడివోలు, ఏపివోలు సమన్వయంతో కూలీలకు రెండు వారాల వేతనాలు చెల్లింపులు చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు క్లియరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, కొరోనా నేపథ్యంలో పల్లె, పట్టణాలలో పారిశుద్ధ్యం బాగుండాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులు విడుదల చేసినట్లు ఇందుకోసం ముందుగా పల్లె, పట్టణ ప్రగతి నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేయవచ్చనే అంశాలను అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామాల్లో నర్సరీ నిర్వహణ సరిగ్గా చేయని గ్రామాల వారీగా జాబితా సిద్ధం చేసి, ఆయా గ్రామాలపై చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ, డీపీవోను, అధికారిక వర్గాలకు మంత్రి ఆదేశించారు. మెదక్‌ ‌జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామ నర్సరీ సందర్శించి, అక్కడి నర్సరీ తరహాలో సిద్ధిపేట జిల్లాలో నర్సరీలు తీర్చిదిద్దాలని ఎంపిడివోలు, ఎంపిపిలు, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. జిల్లాలోని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌తో ఆయా నియోజకవర్గ పరిధిలో లాక్‌డౌన్‌ ‌సడలింపుపై ప్రజల స్పందన ఎలా ఉందనీ, ధాన్యం కొనుగోళ్ల విషయంపై చర్చించారు. జిల్లాలోని హుస్నాబాద్‌, ‌దుబ్బాక, గజ్వేల్‌, ‌జగదేవ్‌పూర్‌, ‌కొమురవెళ్లి, చేర్యాల, మద్దూర్‌, ‌సిద్ధిపేట అర్బన్‌, ‌సిద్ధిపేట రూరల్‌, ‌చిన్నకోడూర్‌ ‌తదితర మండలాల వారీగా పలువురు ప్రజాప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల పనితీరుపై అక్కడి క్షేత్ర స్థాయి సమస్యలపై మంత్రి హరీష్‌రావు ఆరా తీశారు.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!