Take a fresh look at your lifestyle.

తెలంగాణలో 44కు చేరిన కేసులు

  • భార్యాభర్తలైన వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ
  • ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్ష
  • గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కొరోనా హాస్పిటల్‌గా వినియోగించాలని ఆదేశం

తెలంగాణలో కొరోనా వైరస్‌ ‌కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మరో ముగ్గురికి కొరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 44కు చేరింది. తొలిసారిగా రాష్ట్రంలో ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి పాజిటిగా నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. ఇతను ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన కొరోనా లక్షణాలు కలిగిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందువల్లనే ఆయనకూ పాజిటివ్‌ ‌వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, హైదరాబాద్‌‌దోమ)గూడ ప్రాంతంలో నివసిస్తున్న భార్యాభర్తలైన వైద్యులకు పరీక్షలు నిర్వహించగా, ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు.

నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న 43 ఏళ్ల వైద్యుని నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకు సైతం సోకింది. దీంతో వైరస్‌ ‌సోకిన వారి నుంచి ఇతరులకు నమోదైన కేసులు (ప్రైమరీ కాంటాక్ట్) ‌సంఖ్య 9కి చేరింది. ఇదిలా ఉండగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌గురువారం బీఆర్కే భవన్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి మూడవ దశకు చేరకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశంలో చర్చించారు. గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కొరోనా హాస్పిటల్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవులు ఇవ్వవద్దనీ, కావల్సిన పరికరా)న్నీ సమీకరించుకోవాలని ఆదేశించారు. కొరోనా వైరస్‌ ‌నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కితాబిచ్చారని వెల్లడించారు.

26 గురువారం మధ్యాహ్నం నాటికి రాష్ట్రంలో కొరోనా బాధితుల సంఖ్య 44కు చేరిందనీ, ఒక్కరు డిశ్చార్జి కాగా మిగతా వారు కోలుకుంటున్నారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి పట్ట జాగ్రత్తగా ఉండాలనీ, ఎక్కడ పనిచేసే ఆశా వర్కర్లను అక్కడే వినియోగించుకోవాలని ఆదేశించారు. అవసరం ఉన్న చోట సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అలాగే, ప్రైవేటు ఆసుపత్రుల సేవలు వినియోగించుకునేందుకు కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ రోగుల సంఖ్య పెరిగిన పక్షంలో ముందుగా అవసరమయ్యే పర్సనల్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కిట్లు సాధ్యమైనన్ని కొనిపెట్టుకోవాలనీ, మూడవ దశలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply