Take a fresh look at your lifestyle.

పూసుకుంట గిరిజన గ్రామాభివృద్ధికి 44.32 లక్షలు

  • దత్తత గ్రామంగా అభివృద్ధి
  • ఆదివాసీలను కలుసుకోవడం ఆనందదాయకం
  • వారికి మౌలిక సదుపాయాలు అందాలి
  • పూసుకుంట గ్రామ సందర్శనలో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌

దమ్మపేట, ఏప్రిల్‌ 12(‌ప్రజాతంత్ర విలేఖరి) : భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన దత్తత గ్రామానికి గవర్నర్‌ ‌నిధులు నుండి 44.32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తెలిపారు. మంగళవారం దమ్మపేట మండలం, పూసుకుంట గ్రామంలో పర్యటించి మంచినీటి నల్లాలు, ఉచిత వైద్య సేవల విభాగం, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషణ లోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలు, గవర్నర్‌ ‌నిధులతో నిర్మించనున్న కమ్యూనిటి హాలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి, గోగులపూడి గ్రామంలో నిర్మించనున్న కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు పోషణలోపాన్ని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేసేందుకు పెడుతున్న ఆహార పదార్థాలను అడిగి తెలుసుకుని, చిన్నారులతో ఉల్లాసంగా గడిపారు.

పూసుకుంట గ్రామానికి చేరుకున్న గవర్నర్‌కు కొమ్ముకోయ నృత్యంతో గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఉన్నం నారాయణమ్మ గృహాన్ని సందర్శించి వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. నివాసం ఉంటున్న ఇల్లు వర్షాలు పడ్డప్పుడు కురుస్తున్నదని, తమకు పక్కా ఇల్లు మంజూరు చేయించాలని, అలాగే గ్రామం ప్రక్కనే ఉన్న కొండ నుండి వొస్తున్న వరదతో గ్రామంలోకి నీరు చేరుతున్నదని, దానికి రక్షణ కల్పించాలని, రహదారి సౌకర్యం కల్పించాలని చేసిన విజ్ఞప్తిని విన్న గవర్నర్‌ ‌తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా నారాయణమ్మ గవర్నరుకు రాజశ్రీ కోడిని బహుకరించారు. ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి గిరిజనులకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు, స్కానింగ్‌ ‌నిర్వహించారు. వ్యాధి లక్షణాలున్న వ్యక్తులను హైదరాబాదులో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

గ్రేస్‌ ‌కాన్సర్‌ ‌ఫౌండేషన్‌ ‌ద్వారా క్యాన్సర్‌ ‌పరీక్షల నిర్వహణ, మొబైల్‌ ‌పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గవర్నర్‌ ‌మాట్లాడుతూ పూసుకుంట, గోగులపూడి గ్రామాలు అభివృద్ధి సాధించాలని అన్నారు. కొండకోనల్లో నివసిస్తున్న ఆదివాసి గ్రామ ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. కొండరెడ్లు అడవుల నుండి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు ఆదివాసీలకు అందాలని అన్నారు. అడవి బిడ్డలకు అండగా ఉంటానని, జరిగిన అభివృద్ధిని పరిశీలించేందుకు మళ్లీ వొస్తానని చెప్పారు. తాను జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలో పర్యటించినపుడు గిరిజనులు పోషణలోపంతో బాధపడుతున్నట్లు గమనించానని, అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కూడా గమనించినట్లు చెప్పారు.

త్వరలో ఈ రెండు గ్రామాలను పైలెట్‌ ‌ప్రాజెక్టులుగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఆదివాసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు గవర్నర్‌ ‌నిధులు నుండి మంజూరు చేసిన 44.32 లక్షల రూపాయలను సభాప్రాంగణంలోనే అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లుకు అందచేశారు. పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు విప్పపూలతో చేసిన లడ్డూలు ఎంతో పోషకాలను అందిస్తాయని చెప్పారు. గిరిజనల్లో పోషణలోపాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను ఆమె అభినందించారు. ప్రజా ప్రతినిధులను, రెడ్‌ ‌క్రాస్‌ ‌సభ్యులను గవర్నర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ‌దుర్గ, గవర్నర్‌ ‌కార్యదర్శి సురేంద్రమోహన్‌, అదనపు కలెక్టర్‌ ‌వెంకటేశ్వర్లు, ఐటిడిఏ ఏపిఓ జనరల్‌ ‌డేవిజు, గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, మిషన్‌ ‌బగీరథ ఈఈ తిరుమలేష్‌, ‌జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ‌దయానందస్వామి, డిఆర్డిఓ మధుసూదన్‌ ‌రాజు, డిపిఓ రమాకాంత్‌, ‌ర.భ ఈఈ భీమ్లా, జడ్పీ సిఈఓ విద్యాలత, రెడ్‌ ‌క్రాస్‌ ‌కో ఆర్డికేటర్‌ అజమ్మిశ్రా, ఎంపిపి సోయం ప్రసాద్‌ ,‌గవర్నర్‌ ‌జాయింట్‌ అనదర్శి భవాని శంకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply