Take a fresh look at your lifestyle.

నాటి ఐలమ్మలోని పోరాట పటిమ నేడేదీ ?

“‌సామాన్య కుటుంబం, అతి సాధారణ మహిళ అయినా అసామాన్య పోరాటం చేసిన చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెలంగాణ సతా చూపిన ధైర్యశాలి.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఐలమ్మది కీలక అధ్యాయం. ‘‘అయ్యా.. నీ బాంచెన్‌ (‌బానిసను) కాల్మొక్కుత’’ అంటూ వెట్టి చేసిన బతుకుల విముక్తి కోసం తిరగబడ్డ తెగువ ఐలమ్మది. అనాదిగా చేస్తున్న వెట్టిని వ్యతిరేకించిన ఐలమ్మపై దొరల పెత్తనం, అణచివేత కూడా అలాగే సాగింది. సనాతన సాంప్రదాయ జీవితాన్ని వ్యతిరేకించి స్వాభిమాన జీవితాన్ని గడపాలనుకున్న ఐలమ్మ భూస్వాములు, దొరలపై పెద్ద యుద్ధమే చేసింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి దొరల రాజ్యాన్ని కూల్చడంలో కీలకపాత్ర వహించిన ఆ వీరురాలి స్ఫూర్తి నేడేమైంది.”

1940 నాటి తెలంగాణ ప్రజా పోరాటం విశిష్టమైంది. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం భూమి కోసం, భుక్తి కోసమో సాగిందికాదు. దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి విముక్తికి, స్వాభిమాన జీవితానికి ప్రతీకగా గడీల పాలన స్థానంలో ప్రజాపాలన స్థాపించేందుకు సాగింది. అటువంటి తిరుగుబాటు చేసిన నిప్పు కణిక ఐలమ్మ. చాకిరి కులంలో పుట్టి వెట్టిని ఎదిరించిన ధీరురాలు ఆమె. సామాన్య కుటుంబం, అతి సాధారణ మహిళ అయినా అసామాన్య పోరాటం చేసిన చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెలంగాణ సతా చూపిన ధైర్యశాలి.. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఐలమ్మది కీలక అధ్యాయం. ‘‘అయ్యా.. నీ బాంచెన్‌ (‌బానిసను) కాల్మొక్కుత’’ అంటూ వెట్టి చేసిన బతుకుల విముక్తి కోసం తిరగబడ్డ తెగువ ఐలమ్మది. అనాదిగా చేస్తున్న వెట్టిని వ్యతిరేకించిన ఐలమ్మపై దొరల పెత్తనం, అణచివేత కూడా అలాగే సాగింది. సనాతన సాంప్రదాయ జీవితాన్ని వ్యతిరేకించి స్వాభిమాన జీవితాన్ని గడపాలనుకున్న ఐలమ్మ భూస్వాములు, దొరలపై పెద్ద యుద్ధమే చేసింది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి దొరల రాజ్యాన్ని కూల్చడంలో కీలకపాత్ర వహించిన ఆ వీరురాలి స్ఫూర్తి నేడేమైంది. పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామం ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు 1919 లో సద్దుల బతుకమ్మ నాడు జన్మించిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10 ‌న అంతిమ శ్వాస వదిలింది.

ఒకనాటి నిజాం సంస్థానంలో భాగమైన నేటి తెలంగాణ ప్రాంతంలో 1940 లలో దొరలు, దేశ్‌ ‌ముఖ్‌ ‌లు, దేశ్‌ ‌పాండేలు, భూస్వాములు, పెత్తందార్లు, నిజాంకు కప్పం కడుతూ గ్రామాలపై అధికారం చెలాయిస్తూ, ప్రజలను పన్నులతో పీడించడమే కాకుండా వారితో నిర్బంధ వెట్టి చేయించుకునేవారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత, నీరటికాడు, మాదిగ తదితర వృత్తి కులాల బ్రతుకులు వెట్టిలోనే తెల్లారేవి. అస్తిత్వం, స్వాభిమానం గురుంచి మాట్లాడే ధైర్యం లేని ఆ రోజుల్లో దొర ముందుకు వెళ్ళాలంటే నెత్తిన రుమాలు, కాళ్ళ చెప్పులు చేతుల్లోకి తీసుకొని వంగి నడవాల్సిందే. మహిళల సంగతి మరీ దారుణం. దేవాదాసి, దాసీల వ్యవస్థ తో జరిగిన అఘాయిత్యాలు మహిళలు పడిన బాధలు వర్ణనాతీతం.

నాటి నల్లగొండ, వరంగల్‌ ‌జిల్లాల్లోని దేశ్‌ ‌ముఖ్‌ ‌లలో విస్నూరు రామచంద్రారెడ్డి ఒకరు. జనగామ తాలూకాలో 40 గ్రామాల్లో సుమారు నలభై వేల ఎకరాల భూమి కలిగిన దేశ్‌ ‌ముఖ్‌. ఆయన సామాన్యులు తలెత్తుకొని తిరిగాలంటే వణకేవారు. అలాంటి రాక్షసుని ఎదిరించిన మొదటి వనిత మన ఐలమ్మ. తాను చాకిరి చేస్తూనే, ఊర్లో అడుకొచ్చిన బువ్వను కమ్యూనిస్టు నాయకులకు పెట్టి నిత్య నిర్బంధంలో కమ్యూనిస్టులకు నీడకల్పిస్తూ నిలువడమే కాకుండా తానూ ఉద్యమంలో పాల్గొంది. ఆరుగురు సంతానమున్న ఐలమ్మ, వెట్టి చాకిరి బతుకు నుండి బయటకు వచ్చి స్వాభిమానంగా బతకాలని తనకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసినా కుటుంబం గడవడం కష్తమై సమీపంలోని కొండలరావు దొర భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేది..

సాయుధ పోరాటంలో బాగమవుతున్న ఐలమ్మను ఎన్నో విధాలుగా అణచివేయాలని పండించిన పంటను బలవంతంగా తీసుకెళ్లాలనుకున్న విస్నూరు దొరను సాహసంతో, తెగువతో తిప్పికొట్టింది. ఆ సాహసం, తెగువ వీర తెలంగాణ రైతాంగ విప్లవోద్యమానికి ఎంతో బలమిచ్చింది. ఐలమ్మ తిరుగుబాటును గమనించిన ఆనాటి కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, చకిలం యాదగిరి తదితరులు పాలకుర్తిని కేంద్రంగా ఉద్యమాలు సాగించారు. ఐలమ్మ దంపతుల నాయకత్వంలో ఏర్పాటు చేసిన గుతుపల సంఘాన్ని అణచివేయాలని అప్పటి దొర, పోలీసులు ఎన్ని కుయుక్తులు పన్నినా తిప్పి కొట్టారు. భర్తను, కొడుకులను జైలులో నిర్బంధించినా ఐలమ్మ భూపోరాటంలో వెనుకడుగు వేయలేదు. పాలకుర్తికి వెళ్లిన కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనేత కామ్రేడ్‌ ‌పుచ్చలపల్లి సుందరయ్య ఐలమ్మ ఇంటిపై రెండు సార్లు అరుణ పతాకం ఎగురవేశారు. ‘‘తెలంగాణ రైతుబిడ్డ కోసం జరిపిన పోరాటపు తొలిదశకు ఆమె చిహ్నం’’ అని ఐలమ్మను అభివర్ణించారు.

ఊరంతటినీ ఏకం చేసి తిరగబడేలా చేస్తున్నదన్న అక్కసుతో విస్నూరు దొర ఐలమ్మను పిలిచి నిలదీసాడు. కాలుస్తానని తుపాకీ గురిపెట్టి బెదిరించినా, తనను కాలిస్తే ఏమి కాదని తనకు నాలుగెకరాల భూముందని, ఐదుగురు కొడుకులున్నారని.. కానీ దొరకు ఒక్కడే కొడుకు వేల ఎకరాల భూమి ఉందని ఎదిరించి మాట్లాడింది. ‘‘నన్ను చంపితే సంఘపోల్లు వస్తారు, జనం తిరగబడతారు, భూములు పంచి గడీని కూలుస్తారనీ, గడీలో గడ్డి మొలుస్తుందని గళమెత్తి హెచ్చరించిన ధిక్కార స్వరం ఐలమ్మది. ఐలమ్మ మాటలు నిజమయ్యాయి దొర అధికారం పోవడమే కాకుండా గడీల పాలన అంతమైంది. ఐలమ్మ వంటివారి పోరాటాలతో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు కానీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడక పోగా మరింత బానిసత్వంలోకి పోతున్నాయి. కుల వృత్తులు కోల్పోయి ఆకలితో, ఆత్మహత్యలతో, అనారోగ్యంతో మరణిస్తున్నారు. నక్సలైట్లుగా మారి తిరుగుబాటు చేస్తున్నారు. నిమ్న కులాలను, ఉత్పత్తి కులాలను ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ నిర్మాణంలో భాగస్వాములు చేయాల్సిన పాలకులు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. బర్రెలు, గొర్రెలు, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి, 17 కులాలను బి.సి జాబితాలో చేర్చుతూ పాలకులు వెట్టిని ఆధునీకరిస్తుంటే వారు అదే భ్రమలో బతికితే సాధించేదీ ఉండదు. ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తి, ధైర్యానికి ప్రతీక, సాయుధ పోరాటంలో వేగుచుక్క నేటి తరం ప్రజలు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని దోపిడీ పాలనపై పోరుచేయడమే ఐలమ్మకు నిజమైన నివాళి.

saini narendhar
సాయిని నరేందర్‌, 9701916091

Leave a Reply