వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు నిరవధికంగా సాగిస్తున్న ఆందోళన వల్ల రోజుకు 3,500 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లుతోందని అసోచెమ్ తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొండి వైఖరి వల్లనే ఆందోళన కొనసాగించాల్సి వొస్తోందని రైతులూ, వారి కుటుంబాల వారూ ఆరోపిస్తున్నారు. మరో వంక రైతులను ప్రతిపక్షాలు పెడతోవ పట్టిస్తున్నాయంటూ మోడీ ధ్వజమెత్తారు. ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు..మధ్యలో ప్రజలు నష్టపోతున్నారు. పంజాబ్, హర్యానాల్లోనే కాకుండా హిమాచల్ ప్రదేశ్, జమ్మకాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలపై ఈ ఆందోళన ప్రభావం తీవ్రంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి మోడీ తాను తెచ్చిన చట్టాల్లో ప్రతిపక్షాలు ఇంతకాలం కోరుతూ వొస్తున్న అంశాలనే పొందు పర్చినట్టు చెబుతున్నారు. గుజరాత్ పర్యటన సందర్భంగా మంగళవారం కొందరు రైతు ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వీరిలో ఎక్కువ మంది సిక్కునాయకులు ఉండటం గమనార్హం.
తమ ఉద్యమాన్ని చీల్చేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్న నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళన వల్ల ఇతర రంగాలపై కూడా ప్రభావం తీవ్రంగా ఉంది. వాటిల్లో పంజాబ్ ఆటోమొబైల్ పరిశ్రమలో కూడా ముందుంది. అక్కడ ఆందోళన ఉధృతం కావడంతో ఆ పరిశ్రమ కూడా మూలబడింది. పంజాబ్‌లో ఆందోళనలో పాల్గొంటున్న రైతుల కుటుంబాల్లో చిత్తస్థయిర్యం ఏమాత్రం దెబ్బతినలేదు. ఐదేళ్ళ పిల్లలనుంచి 80 ఏళ్ళ వృద్ధుల వరకూ ఈ మూడు చట్టాల రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారు. చట్టాల గురించి పిల్లలకు తెలియకపోవొచ్చు. కానీ, తమ తండ్రి, తాత జరుపుతున్న ఆందోళనలో న్యాయముందని వారు చెబుతున్నారు. అలాగే, పంజాబ్‌లో ప్రతి కుటుంబంలో ఒక పురుషుడు సైనికుని మాదిరిగా ఉద్యమంలో పాల్గొంటుండగా, వారి ఇంట్లో ఆడవారు కుటుంబ పోషణ బాధ్యతను స్వీకరించి ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. రైతు కుటుంబాల్లో వ్యవసాయం తప్ప మరో వ్యాపకం లేనప్పుడు సహజంగానే ఇంట్లో వారంతా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నం కావడం పరిపాటి. పంజాబ్‌లో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
మహిళలు, బాలికలు, అన్ని వర్గాల ప్రజలు తమ కుటుంబ పెద్దకు అండగా నిలుస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులలో ఇప్పటికే 60 వేల మంది రైతులు ఉన్నందున కొత్తగా ఎవరినీ అనుమతించరాదని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైతులు శాంతియుతంగా ఆందోళన సాగిస్తుండటం వల్ల పోలీసులను తోసుకుని రావడం లేదు. రైతులు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరకుండా పంజాబ్, హర్యానాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఆందోళనలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రైతులు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దృష్టిలో ఉంచుకుని విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన అంశాలనే ఈ చట్టాల్లో చేర్చామని ప్రధానమంత్రి స్పష్టం చేస్తున్నారు. రైతులు తాము పండించిన పంటను న్యాయమైన ధరకు అమ్ముకోవొచ్చనీ, వారికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రధాని అంటున్నారు. ప్రైవేటు కంపెనీలు రంగంలో ప్రవేశించినప్పుడు రైతులు కోరుకున్న ధర వచ్చే అవకాశమే లేదు. ప్రైవేటు సంస్థల ప్రవేశం వల్ల రైతుల స్వేచ్ఛ పోతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, హర్యానాకి చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు రైతు ఉద్యమ సెగ తగులుతోంది.
రైతుల సమస్యలను పరిష్కరించకపోతే గ్రామాల్లో తిరగలేమని హర్యానా ప్రజా ప్రతినిధులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిపిన భేటీలో స్పష్టం చేసినట్టు వార్తలు వొచ్చాయి. అలాగే, ఈ చట్టాలు చేసే ముందు రైతు సంఘాల ప్రతినిధులను సంప్రదించకపోవడం తప్పేనని ఆయన అంగీకరించినట్టు రైతు సంఘాల ప్రతినిధి ఒకరు తెలిపారు. పంజాబ్‌లో జాతీయ వార్తా సంస్థల ప్రతినిధులు జరిపిన పర్యటనలో అన్ని వర్గాల ప్రజలు మరో మాట లేకుండా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ వినిపించింది. అందువల్ల ప్రతిపక్షాలు రెచ్చగొడితే రైతులు ఆందోళన చేస్తున్నారని ప్రధానమంత్రి అనడంలో ఔచిత్యం లేదని పిస్తోంది. ఆయనకు ఇంటిలిజెన్స్ సంస్థలు ఎన్నో ఉన్నాయి..వాటి ద్వారా సమాచారం అందుతుంది. అది కాకుండా స్వంత పార్టీ వారే సమాచారాన్ని మోసుకొస్తున్నారు. కేవలం ప్రతిష్ట కోసమే రైతుల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని అనుసరిస్తోందనిపిస్తోంది. తమ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా రైతులకు ఈ చట్టాల ద్వారా మేలు చేయబోతోందని మోడీ అంటుండగా, చైనా, పాక్ కవ్వింపులతోనే రైతులు ఆందోళన సాగిస్తున్నారంటూ అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరం.
ప్రభుత్వానికి సమాచారం అందే యంత్రాంగం పటిష్ఠంగా ఉన్నప్పుడు పార్టీ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు తలోరీతిలో ప్రకటనలు చేయడాన్ని ప్రధాని నివారించలేకపోవడం దురదృష్టకరం. ఆయనకు తెలిసే కింది వారు తలో రీతిలో మాట్లాడుతున్నారు. వారిని నివారించలేకపోతే అందుకు ఆయనదే బాధ్యత అవుతుందని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. కనీస మద్దతుధరను- ఎంఎస్పి- ని చట్టంలో చేర్చాల్సిన అవసరం లేదని గుజరాత్‌కి చెందిన నాయకుడు, కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రకటించడం కేంద్ర మంత్రుల ప్రకటనల్లో పొంతనలేనితనాన్ని సూచిస్తోంది. ప్రభుత్వం రైతుల ఉద్యమం ఇంత తీవ్ర స్థాయిలో సాగుతుందని ఊహించలేదు. ఇప్పుడు దీనిని ఎలా తగ్గించాలో పాలుబోక మంత్రుల చేత తలో రీతిలో ప్రకటనలు చేయిస్తోందని జనం ఇప్పటికే అనుకుంటున్నారు. మోడీ ప్రతిష్టకు పోతున్నా, ఆయన ఈ చట్టాల ద్వారా ఉన్న ప్రతిష్టను పోగొట్టుకుంటున్నారు.