Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో ఏడాది కాలంలో 32 వేల మరణాలు

  • కొరోనా మరణాలపై ఆర్టీఐ దిమ్మతిరిగే సమాధానాలు
  • స్వచ్ఛంద సంస్థ సేకరించిన వివరాలు వెలుగులోకి

తెలంగాణలో కొరోనా ఉధృతి లేనేలేదని, మరణాలు తక్కువేనన్న భ్రుత్వ శాఖలు వెల్లడించిన వివరాలకు పొంతన లేకుండా దిమ్మతిరిగేలా ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం విస్తుగొలిపే నిజాలు వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చిచూస్తే తెలంగాణ మెరుగ్గా ఉందని అధికారులు, మంత్రులు పదేపదే చెబుతూ వొచ్చారు. పాజిటివ్‌ ‌రేట్‌ ‌చాలా తక్కువగా ఉందని, మరణాల శాతంలో కూడా మనం చాలా బెటర్‌గా ఉన్నామని అంటూ..కోవిడ్‌ ‌మరణాలపై సర్కార్‌ ఇం‌తకాలం చెప్తున్న మాటలన్నీ కల్లబొల్లి మాటలే అని తేలిపోయాయి. రైట్‌ ‌టూ ఇన్ఫర్మేషన్‌ ‌యాక్ట్ ‌ద్వారా ఓ స్వచ్ఛంద సంస్థ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. గడిచిన ఏడాది కాలంగా హైదరాబాద్‌ ‌మహనగరంలో మునిసిపల్‌ ‌శాఖ ద్వారా జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాల సంఖ్యను చూస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏడాది కాలంలో 32 వేల మంది చనిపోయారంటూ వొచ్చిన వివరాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. దీంతో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం అవుతున్నది.

ఏప్రిల్‌ 2020 ‌నుంచి మే 2021 వరకు హైదరాబాద్‌లో 32,752 డెత్‌ ‌సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆర్టీఐ లెక్కలు చెప్తున్నాయి. ఏప్రిల్‌ 1 ‌నుంచి తెలంగాణలో కోవిడ్‌ ‌వేవ్‌ ‌ప్రారంభమయ్యింది. దాదాపు మూడు నెలల పాటూ రాష్ట్రంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఈ ఏడాది మే 31 వరకు అంటే రాష్ట్రంలో మొదటి వేవ్‌.. ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రంగా ప్రభావం చూపిన సమయం ఇది. ఈ ఏడాది కాలంలో ఒక్క హైదరాబాద్‌లోనే 32వేల మంది చనిపోయారంటే నగరం నిజంగా శవాల దిబ్బగా మారిందని స్వచ్ఛంద సంస్థ సభ్యులు అంటున్నారు.

2020 ఏప్రిల్‌ ‌నుంచి డిసెంబర్‌ ‌మధ్య సంభవించిన మరణాల సంఖ్య 18,420 ఉండగా… ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు సంభవించిన మరణాల సంఖ్య 14,332. ఈ మరణాలన్నీ కోవిడ్‌ ‌మరణాలనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా కోవిడ్‌తో చనిపోయిన వారి సంఖ్య కేవలం 3257 మాత్రమే ఉందని వైద్యారోగ్యశాఖ నివేదికలు చెప్తున్నాయి. కాని ఏడాది కాలంగా సర్కార్‌ ‌జారీ చేసిన డెత్‌ ‌సర్టిఫికెట్లు 32 వేలకుపైగా ఉంటే మరి మిగతా మరణాలు ఎలా సంభవించాయి? మొత్తం డెత్‌ ‌సర్టిఫికెట్లలో కేవలం 10శాతం మాత్రమే కోవిడ్‌ ‌మరణాలు ఉంటే మిగతా 30వేల మంది ఎలా చనిపోయారన్న దానికి సమాధానం రావాల్సి ఉంది.

Leave a Reply