- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
- దేశంలో ఒక్క రోజులోనే 23 కొత్త కేసుల గుర్తింపు
- ఢిల్లీ, తెలంగాణలలో ప్రత్యేక దవాఖానలు
చైనాలో మొదలై 30కి పైగా దేశాలకు సోకిన కరోనా మహమ్మారి ఇప్పుడు ఇండియాను వణికిస్తున్నది.భారత్‌లో ఇప్పటివరకు 28 మందికి కరోనా వైరస్) సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరోనాను వ్యాప్తిని అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల్లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఢిల్లీలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, అతడి నుంచి ఆగ్రాలో ఉన్న అతడి కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి సోకిందని చెప్పారు.మన దేశంలో పర్యటిస్తున్న 21 మంది ఇటలీ జాతీయుల్లో 16 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని వారిని చావ్లాలో ఉన్న ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు క్వారంటైన్‌కు తరలించామని మంత్రి పేర్కొన్నారు. ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందిలో ఈ వైరస్ ఉన్నట్టు తాజాగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయుడు మిగతావారు ఇటలీ దేశస్థులు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటివరకు 5,89,000 మందికి ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ నిర్వహించామని , అదే విధంగా నేపాల్ సరిహద్దులో సైతం స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు.
ఇప్పటి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి స్క్రీనింగ్ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు.అంతర్జాతీయ విమాన ప్రయాణీకులందరూ ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు. వీరందరినీ ఎయిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉండి కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న భారత పౌరుల గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ, ఇరాన్ గనుక సహకరించినట్లయితే వైద్యపరీక్షల కోసం అక్కడే ల్యాబ్ ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయించిన అనంతరం వారిని భారత్‌కు రప్పించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కరోనావ్యాప్తి నేపథ్యంలో మాస్కుల ధర పెంచితే కఠినచర్యలు తప్పవని వ్యాపాలరును ఆయన హెచ్చరించారు.
భారత పర్యటనకు వచ్చిన 16 మంది ఇటలీ దేశస్థులకు కరోనా లక్షణాలు ఉండడంతో వీరి రక్తనమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపించారు. ఈ పదిహేను మందికి కరోనా సోకినట్లు పుణె ల్యాబ్ నిర్ధ్దారించింది. దీంతో పర్యాటకులను ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ కేంద్రానికి తరలించారు. వీరిని 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు. భారత పర్యటన కోసం ఇటలీ నుంచి మొత్తం 23 మంది పర్యాటకులు గత నెలలో రాజస్థాన్‌కు వచ్చారు. అయితే మొదట ఒకరికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. ఆ తర్వాత ఆయన భార్యతో పాటు మిగతా వారికి ఈ వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
అంతటా భయాందోళనలు..
చైనాలో పుట్టి ఇతర దేశాలకు విస్తరించిన కరోనాదాదాపు నెల క్రితం భారత్‌లో మొదట కేరళలో ప్రవేశించింది. అక్కడ ముగ్గురికి ఈ వ్యాధి సోకింది. మూడు రోజుల క్రితం ఇటలీ, దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వల్ల ఢిల్లీ, తెలంగాణలకు విస్తర్తించింది. తెలంగాణలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ వైరస్ సోకగా గాంధీ దవాఖానలో చికిత్స చేస్తున్నారు. బెంగుళూరులో పనిచేసే ఈ టెకీ దుబాయ్‌కి వెళ్లినపుడు వైరస్ బారిన పడ్డాడు. తరువాత హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. గత మూడు రోజుల్లోనే 23కి పైగా కొత్త కేసులు గుర్తించడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఇటలీ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ నివాసి ఏర్పాటు చేసిన పార్టీకి కొంతమంది విద్యార్థులు హాజరైనందున నోయిడాలో వారు చదివే రెండు పాఠశాలల్ని మూసివేయించారు. అయితే అక్కడ ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది.
- చైనాలో 80 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య
- వివిధ దేశాల్లో 3000 మందికి పైగా మృతి
చైనాలో కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 80,270 కు చేరుకుంది. ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య మార్చి 3 నాటికి చైనాలో 2,981కి, ఇటలీలో 79కి చేరింది. కరో• దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, అమెరికా సహా ఇతర దేశాలలో కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇరాన్లో కరోనా వైరస్ కేసులు సుమారు 2300 దాటాయి. ఆ దేశంలో దాదాపు 77 మంది మరణించారు. ఇరాన్‌కు చెందిన చట్టసభ ప్రతినిధుల్లో సుమారు 8 శాతం మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కిక్కిరిసిన జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆ దేశం 54 వేల మంది ఖైదీలను రిలీజ్ చేసింది. కోవిడ్19 పరీక్షలో నెగటివ్‌గా తేలిన ఖైదీలను జైలు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఆ దేశ న్యాయప్రతినిధి గోలమ్•సన్ ఇస్మాయిలీ తెలిపారు.