Take a fresh look at your lifestyle.

గ‌డిచిన నాలుగేండ్ల‌లో 26 ల‌క్షల రోడ్డు ప్ర‌మాదాలు

గ‌డిచిన నాలుగు సంవ‌త్స‌రాల్లో దేశ‌వ్యాప్తంగా సుమారు 26 ల‌క్షల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 2016లో 4,80,652, 2017లో 4,64,910, 2018లో 4,67,044, 2019 లో 4,49,002 రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగిన‌ట్టు కేంద్రం రోడ్డు ప్ర‌మాదాలు జాబితా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 26,41,608 రోడ్డు ప్ర‌మాదాలు ఈ నాలుగేండ్ల కాలంలో సంభవించిన‌ట్టు కేంద్రం  తెలిపింది. జాతీయ ర‌హ‌దారుల చ‌ట్టం స‌వ‌రించిన త‌ర్వాత కూడా రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గడిచిన నాలుగేండ్ల‌లో ఎన్ని రోడ్డు ప్రమాదాలు జ‌రిగాయో… వాటి త‌గ్గించేందుకు కేంద్రం తీసుకున్న చ‌ర్య‌లు, మృతుల కుటుంబాల‌కి ప్ర‌భుత్వం ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహార వివ‌రాలు వెల్ల‌డించాల‌ని సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో డీఎంకే ఎంపీ ఎం ష‌ణ్ముగం అడిగిన ప్ర‌శ్న‌కి కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ జైరాం గ‌డ్క‌రీ లిఖిత‌ స‌మాధానం ఇచ్చారు.

అయితే రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగేందుకు చాలా కార‌ణాలున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. వాహ‌నాల కండీష‌న్ స‌రిగా లేక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ మార్పులు సంభ‌వించిన‌ప్పుడు, భౌతిక ప‌రిస్థితులు, కొన్ని సార్లు వాహ‌న చోద‌కులు ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవడం కూడా కార‌ణం అవుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు. న‌ష్ట ప‌రిహారానికి సంబంధించి త‌మ వ‌ద్ద ఎటువంటి స‌మాచారం లేద‌ని అన్నారు. కాగా, సెక్ష‌న్ 149,  మోటార్ వెహికిల్ యాక్ట్-2019 ప్ర‌కారం రోడ్డు ప్ర‌మాదంలో మృతులైన కుటుంబీకుల‌కి బీమా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయ‌న్నారు.

Leave a Reply