గడిచిన మూడేళ్లలో (2017-20) దేశ వ్యాప్తంగా 1, 91,365 పురుగుల మందుల నమూనాలను విశ్లేషిస్తే, ఇందులో 2,584 నమూనాలను నాణ్యత లేనివిగా గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. నాణ్యతాలోపంతో ఉన్న కంపెనీ నమూ నాలపై ప్రాసిక్యూషన్ ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం లోక్సభలో పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకకరణ, నకిలీ వ్యవసాయ రసాయనాల వాడకంతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను ప్రతిపాదిస్తుందా? అని ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాత పూర్వక సమాధానం ఇచ్చారు.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ద్వారా నష్టపోయిన రైతు పరిహారం పొందవచ్చని తెలిపారు. నకిలీ పురుగుమందుల అమ్మకాలను తనిఖీ చేయడానికి, పురుగుమందుల నాణ్యతను పర్యవేక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 191 మంది, కేంద్రం నుంచి 10,946 మంది ఇన్స్పెక్టర్లు పురుగుమందుల నాణ్యతను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు.