Take a fresh look at your lifestyle.

తెలంగాణకు కొత్తగా 2480 కి.మీ.ల జాతీయ రహదారులు..

  • 347 కి.మీ.ల రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే
  • కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 2480 కి.మీ.ల జాతీయ రహదారులు మంజూరయ్యాయని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. గత 60 ఏళ్లుగా మంజూరు కాని రోడ్లు ఈ ఆరేళ్లలో మంజూరయ్యాయని తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రహదారుల్లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనీ, రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలలు జాతీయ రహదారులతో అనుసంధానం అయినట్లు తెలిపారు. మోదీ పాలనలో ఇప్పటికే 75 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందనీ, రాష్ట్రంలో రోడ్లపై రూ.31,624 కోట్లు ఖర్చు చేశామనీ, రూ.15,113 కోట్లకు సంబంధించిన పనులు ఇంకా జరుగుతున్నాయని చెప్పారు.

347 కి.మీ.పొడవైన రీజనల్‌ ‌రింగ్‌ ‌రోడ్డును కేంద్ర ప్రభుత్వం నిర్మించనుందన్నారు. దీని నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం కేంద్ర ప్రబుత్వమే భరిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ ‌చుట్టూ ఏర్పాటు కాబోయే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చి వేస్తుందని తెలిపారు. తెలంగాణలో గత ఆరేళ్లలో 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయన్నారు.అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలకు అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందనీ, ఇది రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రిగా మోదీ పదవీ బాధ్యతల స్వీకారం చేపట్టగానే దేశం వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే వాటికి అనుగుణంగా జాతీయ రహదారుల నిర్మాణం కావాలని పేర్కొన్నారనీ, ఇందుకు అనుగుణంగానే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ముందుకు సాగుతున్నదని ఈ సందర్బంగా కిషన్‌ ‌రెడ్డి తెలిపారు.

Leave a Reply