Take a fresh look at your lifestyle.

వరంగల్‌లో మద్యం ప్రియుల ఘర్షణ

వరంగల్‌ ‌నగరం నడిబొడ్డులో బుధవారం సాయంత్రం మద్యం సేవించిన ముగ్గురు యువకుల మధ్యన జరిగిన ఘర్షణలో బిల్డింగ్‌ ‌పై నుంచి తోసివేయడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ బస్టాండ్‌ ‌సమీపంలోని మద్య షాపులో మద్యం కొనుగోలు చేసిన కొంత మంది యువకులు ఖాళీగా ఉన్న కుడా కాంప్లెక్స్ ‌భవనంలోని రెండో అంతస్తులో మద్యం సేవించారు. పీకలా దాకా తాగిన వారు వారి మధ్య మాట మాట పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముగ్గురిలో ఒక్కరిని బిల్డింగ్‌ ‌పై నుంచి తోసివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యువకుడు గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరిలో ఒక్కరు పారిపోగా మరోక వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. విషయం తెలిసిన వెంటనే సుబేదారి సిఐ అజయ్‌ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ ప్రారంభించారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన ఆ ముగ్గురు యువకులు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి బిల్డింగ్‌ ‌పనులు చేసుకుంటున్నారు. అయితే 42 రోజుల తరువాత లాక్‌డౌన్‌ ‌నిబంధనలు సడలించడంతో బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ఈ ముగ్గురు మద్యం కొనుగోలు చేసి కుడా కాంప్లెక్స్‌లో పీకల దాక తాగి ఘర్షణకు దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన యువకుడి పేరు నాగరాజుగా గుర్తించారు. పట్టుబడిన రమేష్‌ అనే వ్యక్తిని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజిఎంకు తరలించారు.

ఎండలో బార్లు తీరిన మద్యం ప్రియులు
లాక్‌డౌన్‌ ‌నిబంధనలకు అనుగుణంగా మద్యం షాపులను నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సక్రమంగా అమలు కావడం లేదు. భౌతిక దూరం పాటించి మద్యం అమ్మకాలు నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించారు. ఎక్కడికక్కడే షాపుల ముందు మండుటెండలో సైతం బారులు తీరి మద్యం కోసం వేలాది మంది ఎగపడ్డారు. ఎక్కడ కూడా సామాజిక దూరం పాటించిన అనవాళ్ళు కనిపించడం లేదు. షాపుల నుంచి మందు కొనుగోలు చేసిన తరువాత స్థానికులు ఇళ్ళకు వెళ్ళినప్పటికీ వలస కార్మికుల వంటి వారు ఎక్కడ తాగాలో తెలియక ఖాళీ ప్రదేశాలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హన్మకొండ బస్టాండు సమీపంలో ఖాళీగా ఉన్న కుడా కాంప్లెక్స్ ‌భవనం మందు బాబులకు అడ్డాగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply