(23 జనవరి ‘పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాస్‌చంద్ర బోస్ జన్మదినం’ సందర్భంగా)
నేతాజీ జన్మదినోత్సవాలను 23 జనవరి 2021 నుంచి ‘‘పరాక్రమ్ దివస్’’గా ఘనం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ 125వ జయంతి (క్వాస్క్విసెంటానియల్ సెలబ్రేషన్స్) ఉత్సవాలను 23 జనవరి 2021 నుంచి వచ్చే ఏడాది 23 జనవరి 2022 వరకు పరాక్రమ్ దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించడం హర్షదాయకం. నేతాజీ జయంతిని ‘దేశ్ ప్రేమ్ దివస్’గా కూడా జరుపుకునే ఆనవాయితీ గతంలో ఉండేదని మనకు తెలుసు. 125న జయంతిని సంవత్సరం పాటు నిర్వహించి నేతాజీ దేశభక్తి, ధైర్యసాహసాలు, అకుంఠిత దీక్ష, నిస్వార్థ పోరాట పటిమ, వలసపాలన వ్యతిరేక ఆవేశ పోరాట పటిమను నేటి ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రేరణగా చూపాలనే ప్రయత్నాలను చేయడం ముదావహం.
ఈ ఉత్సవాలలో భాగంగా నాణెం మరియు పోస్టల్ స్టాంపులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేతాజీ 125వ జయంతి ఉత్సవ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుండగా, 85 మంది సభ్యులుగా చరిత్రకారులు, నిపుణులు, దేశభక్తిగల పౌరులు, రచయితలు, బోస్ కుటుంబ వారసులు మరియు ఆజాద్? హింద్? ఫౌజ్ అభిమానులను తీసుకోవడం జరుగుతున్నది. ఢిల్లీ, విక్టోరియా టర్మినల్ – కలకత్తా, జన్మస్థలం – కటక్, హరిపురా-గుజరాత్ మరియు నేతాజీకి సంబంధం ఉన్న ప్రదేశాలలో ఏడాది పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. బోస్ జీవితానికి సంబంధించిన రహస్య పత్రాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 133 ఫైల్‌లను 2015 – 16లో బహిరంగ పరచడం జరిగింది. 2019లో అండమాన్‌లోని 3 ద్వీపాలకు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ ద్వీపం, షహీద్? ద్వీపం మరియు స్వరాజ్య ద్వీపమని నామకరణం కూడా చేయడం జరిగింది.
23 జనవరి 1897న కటక్‌లో ప్రభావతి మరియు జానకినాథ్ బోస్‌లకు జన్మించిన సుభాస్ చంద్ర బోస్ విద్యాభ్యాసం కటక్, కలకత్తా (బి.ఏ. ఫిలాసఫీ) మరియు లండన్ – కేంబ్రీడ్జ్ (బి.ఏ. మెంటల్ అండ్ మోరల్ సైన్స్)ల్లో పూర్తి చేశారు. తండ్రి ప్రోద్బలంతో లండన్‌లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఎంపికైనారు. బ్రిటీష్ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుభాస్ చంద్ర బోస్ మనందరికీ స్పూర్తి ప్రదాతగా నిలిచారు. దేశభక్తిని ఒంటి నిండా నింపుకున్న సుఫాస్ చంద్ర బోస్ వలసపాలనకు వ్యతిరేకంగా 2వ ప్రపంచయుద్ధ సమయంలో నాజీ జర్మనీ మరియు జపాన్ల పక్షాన నిలిచి, వారి సహాయం తీసుకోవడం జరిగింది. భారత జవాన్లు ముద్దుగా ‘నేతాజీ’ అని పిలవడంతో తనకు అది బిరుదులా మారింది. కలకత్తా మేయర్‌గా (1930 – 31) సేవలు అందించిన బోస్ జాతీయ యువజన కాంగ్రేస్ అధ్యక్షుడిగా మరియు భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుడిగా (1938 – 39) పని చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉద్యమ సంస్థలతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంగా అనేక సార్లు అరెస్టులు కూడా అయ్యారు. 1920 – 34ల మధ్య జరిగిన భారత స్వాతంత్య్ర పోరాటంతో కూడిన పుస్తకం ‘ది ఇండియాస్ స్ట్రగుల్’ను రచించారు.
మహాత్మాగాంధీతో విభేదించి కాంగ్రేస్ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి దాని ప్రథమ అధ్యక్షుడిగా (1939 – 41) బాధ్యతలు నిర్వహించారు. 1940లో బ్రిటీష్ ప్రభుత్వం గృహనిర్భంధం విధించిన వేళ తప్పించుకొని 1941లో జర్మనీ చేరారు. తన సహచరి ఎమిలీని వివాహమాడి కూతురికి జన్మనిచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ సహాయంతో జపాన్‌కు చేరి 40,000 మంది భారతీయ యువకులతో కూడిన ‘భారత జాతీయ ఆర్మీ’ స్థాపించి శిక్షణను ఇచ్చారు. తన ఆర్మీతో కలిసి దేశ స్వాతంత్య్రం కోసం ‘జై హింద్?’ నినాదంతో సాయుధ పోరాటం చేయ సంకల్పించారు. 1944 – 45లో జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీతో పోరాటంలో తన ఆర్మీలో సగం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రష్యాకు వెళ్లే ప్రయత్నంలో విమానం తైవాన్/తైపీ ప్రాంతంలో కూలిపోవడంతో శరీరం 3వ డిగ్రీ బొబ్బలతో 18 ఆగష్టు 1945న అనుమానాస్పద స్థితిలో తుది శ్వాస విడిచారు. కాని నేతాజీ అలా మరణించలేదని, తన మరణవార్త వెనుక కుట్రకోణం ఉందని గట్టిగా నమ్మేవారు కూడా ఉన్నారు. గాంధీ సమకాలీనుడైన బోస్ కొన్ని సందర్భాలలో గాంధీ చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొని మరికొన్ని సందర్భాలలో విభేధించే వారు. గాంధీ చేపట్టిన అహింసాయుత పోరాటానికి విరుద్ధంగా బోస్ సాయుధ పోరుతో స్వాతంత్య్రం సాధించాలని కోరుకున్నారు.
నేటి యువశక్తిని దేశభక్తితో నింపడానికి నేతాజీ ఆదర్శ జీవితం ఉపయోగపడుతుందని నమ్ముదాం. ‘మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని నినదించిన నేతాజీ సుభాస్ చంద్ర బోస్ త్యాగాలు అనన్యసామాన్యాలు, అసాధారణాలు, అనితరసాధ్యాలు మరియు అనుసరణీయాలు. నేతాజీ జీవితం ప్రతి భారతీయ యువతకు నిత్య ప్రేరణ కావాలని కోరుకుందాం, ‘జై హింద్?’ అంటూ నినదిద్దాం.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్ – 99497 00037