21 ఏళ్లకే కేరళ రాజధాని మేయర్ పీఠం దక్కండం విశేషం..
ఇటీవల కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ముదవముంగల్ వార్డు నుంచి సీపీఎం పార్టీ పోటీ చేసి గెలుపొందిన ఆర్య రాజేంద్రన్ వయసు కేవలం 21 ఏళ్ళు కావడం భారత రాజకీయ చరిత్రలోనే సంచలనం.భారత విద్యార్థి సమాఖ్యలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె ‘‘బాలసంగం’’ అనే పిల్లల హక్కుల కోసం పనిచేసే వామపక్ష సంబంధిత సంస్థకు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. గణితంలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న ఆర్య రాజేంద్రన్ పేరును మేయరుగా తిరువనంతపురం సీపీఎం జిల్లా కార్యవర్గం ప్రతిపాదించగా రాష్ట్ర కార్యవర్గం పేరును దృవీకరించిన అనంతరం ఆమె మేయర్ పదవి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముదవముంగల్ వార్డులో ఆమెకు మొత్తం 2,872 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థిపై 549 ఓట్ల ఆధిక్యంతో తిరుగులేని విజయం సాధించారు. కొరోనా కల్లోల కాలంలో స్థానిక సంస్థల భాగస్వామ్యంతోనే వైరస్ మహమ్మారిని కట్టడి చేయగలిగారని అందుకే స్థానిక ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీ దక్కిందని విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి.
ఏది ఏమైనా 21 ఏళ్ల యువతికి నగర ప్రధమ పౌరురాలి బాధ్యత అప్పగిస్తూ యువతపై తమకున్న నిబద్ధతను చాటుకున్న కేరళ ప్రభుత్వాన్ని అభినందించాలి. దేశం మొత్తం ఇదే బాటలో నడుస్తూ యువతను విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేస్తారని ఆశిద్దాం.
– పిల్లుట్ల నాగఫణి.జర్నలిజం కాకతీయ విశ్వవిద్యాలయం.8074022846.