Take a fresh look at your lifestyle.

చరిత్రపుటల్లో నిలువబోతున్న ఈద్ – ఉల్ – ఫితర్ – 2020

చరిత్రలో మెదటిసారిగా ముస్లిములు ఈ సంవత్సరం రంజాన్ వేడుకలను ఇంటికే పరిమితం చేస్తున్నారు. ప్రపంచంలోని ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగలు రెండే రెండు అవి. రంజాన్ మరియు బక్రీద్ . ఇందులో అతి పవిత్రంగా జరుపుకునే పండుగ రంజాన్. ఈ పండుగను విశ్వవ్యాప్తంగా ధనిక , బీద అనే తారతమ్యం లేకుండా ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
ముస్లింల పవిత్ర గ్రంథం ఐన దివ్యఖురాన్ ఇదే మాసం లో మొదటిసారిగా మానవాళి కోసం బహిర్గతం కాబడింది. అందుకే ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావించి ప్రతి ఒక్కరు విధిగా నెలరోజులపాటు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు .ఉపవాసం తో పాటు ప్రతి రోజు పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ను చిత్తశుద్ధితో పఠించడం జరుగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు ముస్లింలంతా రాత్రి, రోజువారీ నమాజులతోపాటు ప్రత్యేక సాముహిక నమాజు ( తరావి) చేయడం జరుగుతుంది.ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఎవరిపైనైతే జకాత్ తప్పనిసరి అవుతుందో వారు తమ వద్ద ఉన్న బంగారం, వెండి, నగదు, అవసరానికి మించి ఉన్న ఆస్తులు, మొదులగు వాటి విలువలో 2.5 % పేదవారికి దానం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ ముస్లిం అయినా అనివార్య కారణాలవల్ల ఉపవాసం ఉండలేకపోతే , వదిలిపెట్టిన ప్రతి ఉపవాసం పై నిర్దిష్ట సొమ్మును బీదవారికి హదియా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి ముస్లిం వ్యక్తి పై అంటే అప్పుడే పుట్టిన శిశువు నుంచి పెద్దవారి వరకు అందరి తరపున ఆ ఇంటి పెద్ద (ఆదాయం ఆర్జించే వ్యక్తి ) ఫిత్రా బీదవారికి పండుగ నమాజు కంటె ముందు విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ పండుగను ఈద్-ఉల్- ఫితర్ గ పరిగణించారు. అయితే ఈ ఫిత్రా అనేది ఉపవాసంలో ఉన్న సమయంలో దొర్లే చిన్న చిన్న పొరపాట్లకు పరిహారంగా ఈ దానాన్ని చేయడం జరుగుతుంది.
ఈ రంజాన్ మాసం మిగతా 11 నెలలు ఏవిదంగా జీవనాన్ని కొనసాగించాలో తెలిపే ఒక శిక్షణ కాలంగా పరిగణిస్తారు. ఈ నెలలో చేసే ప్రతి మంచి పని అది నమాజ్ నుంచి దానధర్మాల వరకు ప్రతిదానికి బదులుగా ఇహ లోకంలో గాని,పరలోకంలో గాని అనంత సుఖ శాంతులను ఆ అనంత కరుణామయుడు ప్రసాదిస్తాడని దివ్య ఖురాన్ చెబుతుంది. ఇలా ఎంతో భక్తి తో, దీక్షతో, నెలరోజులపాటు పైన చెప్పిన భాద్యతలను నిర్వర్తించిన ప్రజలకు రంజాన్ మాస చివరిరోజు కనిపించే నెలవంకను చూడగానే పండుగ వాతావరణం వారి వారి కుటుంబాలలో నెలకొంటుంది. పండుగరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తూలనూ ధరించి, సుగంధద్రవ్యాలను వాడి, ఎంతో భక్తితో మరియు ఉల్లాసంతో ఈద్ నమాజ్  కోసం తఖ్బీర్ ను చదువుతూ మరియు నెల మొత్తం పడిన శ్రమకు ప్రతిఫలంను అల్లాహ్ నుంచి ఆశించడానికి ఈద్గా వైపు కదలడం జరుగుతుంది. ఐతె ఈద్ నమాజ్ తప్పనిసరిగా సామూహికంగా మరియు బహిరంగ ప్రదేశం(ఈద్గా) లో చదువాల్సి ఉండగా ఈ సంవత్సరం కరోనా ఆంక్షలవలన సామూహిక ప్రార్థనలను నిషేధించడం జరిగింది. ఈ నమాజ్ ను కూడా రంజాన్ మాసంలో చేసిన నమాజులవలె ఇంట్లోనే చదువాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలా రంజాన్ మాసం మొత్తం మస్జీద్ లనుంచి దూరం కావడం చివరికి పండుగ నమాజ్ కూడా ఇంట్లోనే చదువాల్సి రావడం చరిత్రలో మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఒక పౌరునిగా దేశ భద్రత కూడా భాద్యత కాబట్టి ప్రతి ముస్లిం ఈ ఆంక్షలను తూచతప్పకుండా పాటించాలి.దీని పరిహారం కూడా అల్లాహ్ పరలోకం లో ఇస్తాడని భావిస్తూ, మానవాళి అంతటికి రంజాన్ పవిత్ర మాస శుభాలు కలగాలని ఆశిద్దాం.

 

డాక్టర్ ఎం డి  ఖ్వాజా మొయినొద్దీన్
ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
లైఫ్ మెంబర్ ఆఫ్ టెరా అండ్ టి సి ఏ
ఫెల్లో మెంబర్ ఎస్. ఏ .ఎస్ . ఎస్
9492791387

Leave a Reply