ఎన్నికల ముందు సంవత్సరం కావడంతో 2022 అంతా రాజకీయ వేడి రాచుకుంది. ఒకవిధంగా రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలె. రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్తృతం చేసిందికూడా ఈ సంవత్సరమే. ఆందోళనలు, నిరసన సభలు, సవాళ్ళు, పాదయాత్రలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరిగిన ఉప ఎన్నికలు ఎవరి బలమెంతో బేరీజు వేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చాయని చెప్పవచ్చు. ఒకవిధంగా ఇవి ఆయా పార్టీలకు లిట్మస్ టెస్ట్‌గా మారాయి. ఆ అనుభావాలతో నూతన సంవత్సరంలోనైనా తమ లక్ష్యాలకు చేరుకునే దిశగా రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
పద్నాలుగు ఏళ్ళు పోరాటంచేసి రాష్ట్రాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్పాటు నుండీ అధికారంలో ఉంటూ వచ్చింది. అయితే జాతీయ రాజకీయల్లో గుణాత్మక మార్పును తీసుకువచ్చేందుకోసం టిఆర్ఎస్ బిఆర్ఎస్గా మార్పు జరిగిన ఏడాదిగా 2022కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పటికే రెండు విడుతలుగా ప్రభుత్వానికొచ్చిన బిఆర్ఎస్(టిఆర్ఎస్) ఇప్పుడు హ్యాట్రిక్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 80 స్థానాలను సాధించుకున్న బిఆర్ఎస్ ఆ తర్వాత 105 స్థానాల వరకు పెంచుకుంది. ఇప్పుడు మరో సారి సెంచరీకి ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ప్రజా ఆవసరాలకు తగినట్లుగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి తమది ప్రజా ప్రభుత్వంగా ముద్రవేయించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఆ పార్టీ చేసింది. ఇంకా చేస్తోందికూడా. దేశానికి తమ పథకాలే ఆదర్శగా నిలుస్తున్నాయన్న ప్రచారాన్ని కూడా విస్తృతం చేస్తోంది. అలాగే రాబోయే ఎన్నికలకు చాలా కాలం ముందునుండే రంగం సిద్దం చేసుకుంటున్నట్లుగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలున్నాయి. సిట్టింగ్‌లకే ఈసారి టికెట్ అని ప్రకటించడంద్వారా పార్టీలో పోటీని నివారించవచ్చని భావించింది. కాని, ఉద్యమకాలంనుండి ఎలాంటి అవకాశాలు రాక పోవడంతో చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే విచిత్రకర విషయమేమంటే స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, బిక్షమయ్య గౌడ్ లాంటి కొందరు పార్టీనుండి బయటికి వెళ్ళినా, అక్కడ ఇమడలేక తిరిగి మాత్రు సంస్థలోకి రావడం. ఇది ఒక విధంగా ఆ పార్టీకి కలిసి వస్తోందికూడా…
ఇదిలా ఉంటే రెండు సంచలనాత్మక సంఘటనలతో 2022 చరిత్రలో శాశ్వతంగా నిలబడి పోతున్నది. ఒకటి ఎంఎల్యేల కొనుగోలు వ్యవహారమైతే, మరోటి దిల్లీ లిక్కర్ స్కామ్. ఈ రెండింటిలోనూ బిఆర్ఎస్ పాత్ర ఉండడం గమనార్హం. బిఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంఎల్యేలను బిజెపి కొనుగోలు ప్రయత్నాన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసు ఇంకా ఎటూ తేలకపోయినా అది దేశరాజకీయాల్లో సంచలనాత్మకంగా మారింది. లిక్కర్ స్క్యాంకూడా అంతటి సంచలనాన్నే కలిగించింది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె ఎంఎల్సీ అయిన కల్వకుంట్ల కవిత పేరు చోటు చేసుకోవడం. ఈ రెండు కూడా ఇదే సంవత్సరంలో జరిగిన ప్రధాన సంఘటనలు కావడం. ఈ ఘటనలు ప్రతిపక్ష పార్టీలకు మంచి అవకాశంగా మారాయి. ప్రధానంగా గోలకొండపైన కాషాయ జండాను ఎగురవేస్తామని చెబుతున్న భారతీయ జనతాపార్టీకి ఈ రెండు సంఘటనలను ఎత్తి చూపడంద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తే అవకాశం కలిగింది. ఆమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
అందులో భాగంగానే టిఆర్ఎస్లోని ప్రముఖులు పలువురికి కాషాయ కండువా కప్పింది. ఇక్కడ జరిగిన రెండు ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది.కాగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రల పేరున అయిదు విడుతల పాదయాత్రలతో దాదాపు తెలంగాణను చుట్టబెట్టారు. కొత్త సంవత్సరంలో కూడా తమ విస్తృత కార్యక్రమాలకు అప్పుడే రూపకల్పనకూడా చేశారు. జనవరి 15 నుండి ప్రతీరోజు రెండు నియోజక వర్గాల్లో పర్యటించే ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు పలువురు కేంద్ర ప్రముఖులతో సభలను ఏర్పాటు చేసే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి రెండవ వారంలో ప్రధాని మోదీని కూడా మరోసారి రాష్ట్రానికి తీసుకువచ్చే ఆలోచన ఆ పార్టీ చేస్తోంది. ఇప్పటికే అధికారపార్టీని లక్ష్యంగా చేసుకుని అటు రాజకీయంగా, ఇటు న్యాయపర బిఆర్ఎస్ను ఇరుకున పెడుతోంది బిజెపి.
ఇకపోతే పార్టీలో అంతర్ఘత కలహాలు కాంగ్రెస్‌కు నిత్యకృత్యమయ్యాయి. ఏఐసిసి అద్వర్యంలో వేసిన కొత్త కమిటి రాష్ట్రంలోని ఆ పార్టీ సీనియర్, వలస నాయకుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసి, పార్టీ రెండుగా చీలే పరిస్థితికి 2022 సాక్షిగా నిలబడింది.
ఇంకా ఆ సమస్య తొలగిపోనప్పటికీ రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త సంవత్సరంలో కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడు. యాత్ర ఫర్ ది ఛేంజ్ పేరున జనవరి 26 నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టేందుకు సిద్దమయ్యాడు. ఏఐసీసీ ఇచ్చిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో బహిరంగ సభ జరుపడంద్వారా టిడిపి తిరిగి ఇక్కడ రాజకీయ రంగప్రవేశం చేసింది కూడా 2022లోనే కావడం మరో విశేషం. ఇకపోతే బిఎస్పీ, వైఎస్ఆర్టిపి పార్టీలు కూడా రికార్డు స్థాయిలో పాదయాత్రలను 2022లోనే చేపట్టినా, కొత్త ఏడాదిలో వాటి కొనసాగింపు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. మొత్తం మీద 2022లో తగిలిన రాజకీయ వేడి 2023లో దావానలంగా మారే అవకాశాలు లేకపోలేదు.