భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్య్రం సిద్ధించింది. ఫలితంగా అందివచ్చినదే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగం. భారత దేశానికి సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, సమానత్వాన్ని చేకూర్చడానికి జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ, 1950 జనవరి 26 నుంచి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం. ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్)గా ప్రకటించబడింది.
భారత రాజ్యాంగం మొదట ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా రాసిన పుస్తకం. ఇది ఇటాలిక్ శైలిలో రాయబడింది. ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఉన్న భీమ్ రావు రామ్ జీ అంబేద్కర్ ఇతర సభ్యులతో కలిసి భారత రాజ్యాంగాన్ని పూర్తి చేసేందుకు 2 సంవత్సరాల 11 నెలలు, 17 రోజులు పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది. రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ముందు, రాజ్యాంగంపై అనేక చర్చలు జరిగి, 2 వేలకు పైగా సవరణలు చేయబడ్డాయి. ప్రస్తుతం 448 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది మన భారత దేశ బృహత్ రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి.
ఇలా ఎన్నో దేశాలు,మరెన్నో గ్రంథాలు, ఎన్నో జాతుల జీవన విధానాలనూ పరిశోధించి ఏర్పరుచుకున్న భారత పరిపాలనా మార్గదర్శ గ్రంథం ఆమోదం పొందిన రోజు, స్వాతంత్య్రానంతరం భారత దేశం రాజకీయంగా తన కంటూ ఒక స్వంత అస్థిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నరోజు. గణతంత్ర దినోత్సవం. దేశ సమగ్రతని కాపాడాల్సిన భారత పౌరులమైన మనం ఇంకొక్కసారి మన విజయాన్ని గుండెలదిరేలా ‘‘మేరా భారత్ మహాన్’’ అని ప్రపంచానికి చెప్పే రోజు.
లాహోర్ వేదికగా పూర్ణస్వరాజ్ తీర్మానం
లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయ్యి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేందప్రసాద్‌ను ఎన్నుకోగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ అంబేడ్కర్ ఛైర్మన్‌ను నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది.
చరిత్రలో నిలిచిపోనున్న 2021 రిపబ్లిక్ డే,
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులైన
1.నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020).
2) ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు’ (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్)
3) ‘రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ – 2020)ల కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కేంద్రం బిల్లును రైతులకు అనుగుణంగా సవరించకపోవడంతో రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల తో ఢిల్లీ లో నిరసన వ్యక్తం చేయబోతున్నారు, వీరికి చాలా దేశాల ప్రముఖులనుంచి మద్దతు రావడం గమనార్హం .
స్వతంత్ర భారతదేశ చరిత్రలో గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున భారీఎత్తున రైతుల పరేడ్ నిర్వహించడం ఒక చరిత్ర గా చెప్పవచ్చు. ఒక రకంగా, ప్రభుత్వానికి ఇది ఒక సవాలే అనిచెప్పవచు.ఇంతకంటే పెద్ద అభిశంసన ఇంకేం ఉండదు. ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోనుంది. మరి ఇంత అపఖ్యాతి మూటగట్టుకున్న వ్యక్తిగా మోడీ నిలుస్తాడు. భారతీయ రిపబ్లిక్ మూలాలను కాపాడటానికి పోరాడుతున్న రైతులు, మరియు ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన 147 రైతు వీరులతో పాటు రైతాంగానికి ద్రోహం చేసిన వ్యక్తిగా మోడీ చరిత్రలో నిలువబోతున్నాడు. ఈ గణతంత్ర దినోత్సవం.. రైతుల గ(ర)ణతంత్ర దినోత్సవంగా చరిత్రలో నిలిచిపోనుంది. ‘దేశం మనదే.. తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే, ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ, అంటూ రైతుల పక్షాన నిలిచేందుకు మన వ్యవసాయాన్ని, మన భూమిని కాపాడుకునేందుకు చేయి చేయి కలుపుదాం.. పిడికిలి బిగించి నినదిద్దాం..!.

ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, 9492791387