Take a fresh look at your lifestyle.

కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలకు ‘2020’ అంకితం

  • వ్యాక్సినేషన్‌ ‌కోసం సమిష్టిగా ముందుకు..
    చివరి దశలో కొరోనా టీకా అభివృద్ధిి
  • రాజ్‌కోట్‌ ఎయిమ్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ

కొరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి చివరి దశలో ఉందని, కరోనాపై సమిష్టిగా ఎలాగైతే పోరాడామో అదే ఐక్యత వ్యాక్సినేషన్‌ ‌విషయంలో కూడా చూపాలని  ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరోగ్యం విషయంలో భారత్‌ ‌ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఈ మేరకు అవసరమైన ఆలోచనలను స్వీకరించడానికి కానీ, ఇవ్వడానికి  కానీ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  దేశం మొత్తాన్ని సురక్షితంగా ఉంచడానికి కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలందరికీ ‘2020 సంవత్సరం అంకితం చేశామని ఆయన ప్రకటించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏయిమ్స్‌కి ప్రధాని మోదీ గురువారం శంకుస్థాపన చేశారు.

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. దేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరో అడుగు పడిందని సంతోషం వ్యక్తం చేశారు. 2020 సంవత్సరానికి నూతన ఆరోగ్య మౌలిక సదుపాయాలతో వీడ్కోలు పలకాలని, ఈ సంవత్సరం మనం ఎంత ఇబ్బందిపడ్డామన్నది ఈ మౌలిక సదుపాయాలే చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల సంరక్షణార్థమై ఈమధ్య కాలంలో ఆరోగ్యపరంగా చాలా రకాలైన సౌకర్యాలు వచ్చాయని, ఆరోగ్యపరమైన ప్రభుత్వ పథకాల విషయంలోనూ చాలా చైతన్యవంతులయ్యారని ఆయన పేర్కొన్నారు.

భారీ జనాభా ఉన్న మన దేశం కరోనాతో పోరాటం చేసిందని, అన్ని దేశాలతో పోలిస్తే కరోనా కేసులు కాస్త తక్కువేనని, సంక్రమించే రేటు కూడా తక్కువేనని చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి చివరి దశలో ఉంది. అతి తొందర్లోనే వ్యాక్సినేషన్‌ ‌వైపు వెళ్తాం. కరోనాను ఎదుర్కోవడంలో ఎలాగైతే ఐక్యతను చూపించారో… వ్యాక్సినేషన్‌ ‌విషయంలో కూడా దేశ ప్రజలు అదే ఐకమత్యాన్ని చూపించాలని మోదీ పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా మోదీ.. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. 2020.. ఆరోగ్య సంపద అంటే ఏమిటో మనకు నేర్పించిందని అన్నారు. ఆరోగ్యం కంటే గొప్పది ఏదీ లేదని ఈ సంవత్సరం నిరూపించిందని, ఈ సంవత్సరం మొత్తం ప్రపంచానికి సవాలుగా మారిందని, అయితే, ఒత్తిళ్లను జయించి విజయవంతంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరడం గర్వించదగిన విషయమన్నారు. కష్టతరమైన ఈ సంవత్సరం సంఘీభావం ప్రాముఖ్యతను చూపించింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న సహచరులు, శాస్త్రవేత్తలు, ఉద్యోగులను దేశం ఎన్నటికైనా గుర్తుంచుకుంటుందని ప్రధాని అన్నారు.

పేదలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసిన వారందరికీ ప్రశంసించాల్సిన దినమని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ‌మహమ్మారిని నిలువరించేందుకు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే ఏడాదిలో వ్యాక్సినేషన్‌ ‌జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి విజయ్‌ ‌రూపాని, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ‌తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా హాజరయ్యారు. ఎయిమ్స్‌ను సెంట్రల్‌ ‌పీఎస్‌యూ హెచ్‌ఎస్సీసీ లిమిటెడ్‌ ‌నిర్మిస్తున్నది. దానిలో తొమ్మిది భవానల డ్రాయింగ్లకు తాత్కాలిక ఆమోదం లభించింది. రూ.1195 కోట్లు వెచ్చించి 750 పడకలతో నిర్మిస్తున్న ఎయిమ్స్ ‌కోసం ప్రభుత్వం 201 ఎకరాల భూమిని కేటాయించింది. 2022 నాటికి పూర్తిచేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు. 750 పడకల ఎయిమ్స్‌లో 30 పడకల ఆయుష్‌ ‌బ్లాక్‌ ‌కూడా ఉండనున్నది. ఇందులో 125 ఎంబీబీఎస్‌ ‌సీట్లు, 60 నర్సింగ్‌ ‌సీట్లు కేటాయించనున్నారు. తొలి బ్యాచ్‌ ‌తరగతులు డిసెంబర్‌ 21 ‌న పండిట్‌ ‌దీనదయాల్‌ ఉపాధ్యాయ వైద్య కళాశాలలోని తాత్కాలిక ప్రాంగణం నుంచి మొదలయ్యాయి.

Leave a Reply