Take a fresh look at your lifestyle.

డిసెంబర్‌ ‌నాటికి 200 కోట్ల టీకాల ఉత్పత్తి

  • 13 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయన్న నడ్డా
  • తక్కువ ధరలకే ఉత్పత్తి చేయనున్న బిఇ

ఈ ఏడాది డిసెంబర్‌ ‌నాటికి 200 కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి జరగనుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతం నెలకు కోటి వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతోందని జులై, ఆగస్ట్ ‌నాటికి నెలకు 6-7 కోట్లు, సెప్టెంబర్‌ ‌నాటికి నెలకు పది కోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తి జరగబోతోందని చెప్పారు. గతంలో రెండు ఫార్మా కంపెనీలే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశాయని, ప్రస్తుతం 13 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని చెప్పారు. డిసెంబర్‌ ‌నాటికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే కంపెనీల సంఖ్య 19కి చేరుకుంటుందని అన్నారు.   ఇదిలావుంటే  కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇందులో ఒకటి భారత్‌ ‌బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ ‌కాగా, రెండోది కొవిషీల్డ్. ఆస్టాజ్రెనెకా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో సీరం ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే మరిన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో స్పుత్నిక్‌-‌వి, స్పుత్నిక్‌ ‌లైట్‌తోపాటు జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌ ‌సింగిల్‌ ‌డోస్‌ ‌టీకా, ముక్కు ద్వారా వేసే టీకాలు కూడా ఉన్నాయి. ఇదే కోవలో బయోలాజికల్‌-ఇ ‌నుంచి మరో వ్యాక్సిన్‌ ‌రాబోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకంటే అతి తక్కువ ధరకే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇటీవల ఈ సంస్థ ప్రకటించింది. రెండు డోసులను కలిపి రూ.

650లోపే అందిస్తామని పేర్కొంది. అయితే, తాజాగా ఈ వ్యాక్సిన్‌ ఒక్కో డోసు ధర రూ. 150కే అందుబాటులోకి రానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటికే 30 కోట్ల డోసుల కోసం ఆర్డర్‌ ఇచ్చిందని, ఇందులో భాగంగా రూ. 1500 కోట్లు చెల్లించిందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కొవిషీల్డ్ ఒక్కో డోసును ప్రభుత్వానికైతే రూ. 300కు, ప్రైవేటు సంస్థలకైతే రూ. 600కు విక్రయిస్తున్నారు.

కొవాగ్జిన్‌ ఒక్కో డోసును ప్రభుత్వానికి రూ. 400కు, ప్రైవేటు సంస్థలకు రూ. 1200కు అందిస్తున్నారు. స్పుత్నిక్‌ ‌టీకా ధర ఒక్కో డోసును రూ. 995కు విక్రయిస్తున్నారు. బయోలాజికల్‌-ఇ ‌టీకా కనుక అందుబాటులోకి వస్తే కొవాగ్జిన్‌ ‌తర్వాత అందుబాటులోకి వస్తున్న రెండో స్వదేశీ టీకా అదే అవుతుంది.  అమెరికాకు చెందిన బేలార్‌ ‌కాలేజ్‌ ఆఫ్‌ ‌మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్‌-ఇ ‌సంస్థ కొవిడ్‌ ‌టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు ఇప్పటి వరకు జరిగిన క్లినికల్‌ ‌ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి.

Leave a Reply