‘‘మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె రికార్డ్ సృష్టించింది. ప్రపంచ నేతలతో మంచి గుర్తింపు పొందుతూ, అందరి దృష్టిని ఆకర్షించేది. సిక్కుల కోరికమేరకు హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసింది. ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల సహకారంతో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినది. కొందరు నేతలు రెండోసారి ప్రధానిగా ఒప్పుకోని సమయంలో ‘‘గరీబీ హటావో’’ నినాదంతో నలభై మూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు,36 వేల మై ళ్లు పర్యటన చేసి ప్రజల దృష్టిలో గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది.’’
నేడు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి,1966 నుండి1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, మళ్ళీ 1980లో ప్రధాన మంత్రిగా పనిచేసి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా గా పిలువబడిన ప్రజా నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ. 1917 నవంబర్ 19న జన్మించిన ఇందిరాగాంధీ, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని గాంధీ.
జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానం. ఆమె ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదులో ఆనంద్ భవన్ లో జన్మించింది. తన తాత మోతిలాల్ నెహ్రూ అలహాబాదులో పేరుపొందిన న్యాయవాది. ఇందిరాగాంధీ పుట్టేసరికి భారతదేశం ఆంగ్లేయుల పాలన లో ఉండేది. దేశం ఆర్థికంగా, సామాజికంగా అల్లకల్లోలంగా ఉండేది. ఇందిరాగాంధీ అలహాబాదులో ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం, పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణులు అయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ లో చేరి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపింది. జాతీయోద్యమంలో భాగంగా జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ తరచుగా జైలుకు వెళ్లడం వల్ల, తన తల్లి కమలా నెహ్రూ ఆరోగ్యం క్షీణించింది. చికిత్స నిమిత్తం వెళ్లిన తర్వాత అక్కడే తల్లి కి తోడుగా ఉంటూ ఒక స్కూల్లో చేరింది. ఎంత చికిత్స చేసినా తల్లి ఆరోగ్యం కుదుట పడకపోవడం వల్ల , తమ 17 వ ఏటనే కమలా నెహ్రూ మరణించడం ఇందిరాగాంధీ ఒంటరి అయింది.
తల్లి మరణం తర్వాత ఒంటరిగా ఉన్న ఇందిరకు నెహ్రూ మనోధైర్యాన్ని ఇస్తూ, నాయకత్వ లక్షణాలు నూరిపో సే వారు. పై చదువుల నిమిత్తం ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్పించాడు. ఆమె చదువుతున్న రోజుల్లో జర్నలిస్టు అయిన ఫిరోజ్ గాంధీ తో పరిచయం ఏర్పడి వివాహానికి దారి తీసింది. కానీ వారిద్దరి వివాహానికి నెహ్రూ ఇష్టపడలేదు , చివరగా మహాత్మాగాంధీ సలహా మేరకు 1942 లో ఇందిర ,ఫిరోజ్ ల వివాహం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో నెహ్రూ జైలు జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇందిరాగాంధీ దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర గురించి తన తండ్రికి ఉత్తరాల రాస్తూ దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలియజేసేది. స్వాతంత్ర పోరాటంలో సైతం పాల్గొంటూ తండ్రికి తగ్గ కూతురు గా ఉద్యమంలో ధైర్యంగా పాల్గొనేది. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో ఉండగానే మగ పిల్లవాడికి జన్మనిచ్చింది.
1943 మే 13 న విడుదలైన ఇందిరా తన కుమారుడికి రాహుల్ గాంధీ అని పేరు పెట్టింది. ఇందిరాగాంధీ ఎన్నో సంవత్సరాల పాటు నెహ్రూ వెనుకనే ఉంటూ అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఆమె సేవలకు గుర్తింపుగా 1959 లో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయింది.ఆ తర్వాత జరిగిన పరిణామంలో నెహ్రూ మరణాంతరం, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసి అందరి మన్ననలు పొందారు. తర్వాత 1962 జనవరి24 న మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె రికార్డ్ సృష్టించింది. ప్రపంచ నేతలతో మంచి గుర్తింపు పొందుతూ, అందరి దృష్టిని ఆకర్షించేది. సిక్కుల కోరికమేరకు హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసింది.
ప్రపంచ బ్యాంకు, పశ్చిమ దేశాల సహకారంతో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దినది. కొందరు నేతలు రెండోసారి ప్రధానిగా ఒప్పుకోని సమయంలో ‘‘గరీబీ హటావో’’ నినాదంతో నలభై మూడు రోజులపాటు దేశమంతటా పర్యటిస్తూ 300 సభలు,36 వేల మై ళ్లు పర్యటన చేసి ప్రజల దృష్టిలో గొప్ప నాయకురాలుగా పేరు సంపాదించుకుంది. ఆమె పరిపాలన కాలంలో రైల్వే కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్థంభింప చేసినప్పుడు, వారిపై చర్యలు తీసుకుంటూ ఉద్యోగాలు తొలగించినప్పుడు వారి ఆగ్రహానికి గురికావడం, వారు కోర్టు ద్వారా మళ్లీ ఉద్యోగాలు పొందడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో, ఓటు ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. అందుకే కార్మికు లు, ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడలేదని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చును.
అలాగే 1971 లో అమేథీ లోక్ సభ నియోజకవర్గం నుండి రాజ్ నారాయణ పై గెలిచిన సందర్భంలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ప్రతిపక్షాలు కోర్టులో సవాల్ చేసిన క్రమంలో 1975 లో అలహాబాద్ కోర్టు ఆమె ఎన్నిక చెల్లదని ,6 సంవత్సరాలపాటు ఎన్నికల్లో పాల్గొనరాదని కోర్టు తీర్పునిచ్చింది. కానీ దానిపై స్టే ఆర్డర్ తెచ్చుకుంది. కానీ ప్రతిపక్షాలు ఇందిరా గాంధీ కి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ నిర్వహించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు. అప్పుడు రాజ్యాంగంలోని 352 ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25 న రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించారు.
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల తో దేశాన్ని అభివృద్ధి చేయాలని తమ తండ్రి ఆకాంక్ష మేరకు పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని చక్క పెట్టారు. రాజకీయాల్లో ఆమెకు కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ లు అండగా నిలిచారు.
ఆర్థిక దోపిడీని తగ్గించడానికి, సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 1975 , జూలై లో 20 సూత్రాల పథకాన్ని ప్రకటించారు .అవి.
1. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం.
2. ఉత్పత్తికి ప్రేరణ ఇవ్వడం
3. మిగులు భూమిని పంపిణీ చేయడం.
4. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
5. భూమి లేని కార్మికులకు కనీస వేతనాలు అందించడం.
6. బం దీలో ఉన్న కార్మికులకు పునరావాసం కల్పించడం.
7. ఎస్సీ ,ఎస్టీ తెగల అభివృద్ధికి గృహ వసతి కల్పించడం.
8. ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం
9 కుటుంబ నియంత్రణకు చర్యలు చేపట్టడం.
10. చెట్ల పెంపకం చేపట్టి అటవీ విస్తీర్ణం పెంచడం.
11. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం.
12. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం కార్యక్రమాలుచేపట్టడం
13. ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలు విస్తరించడం
14. గ్రామీణ,పట్టణ ప్రజలకు చేయూతను అందించడం.
15. నీటిపారుదల వసతులు కల్పించడం.
16. ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయడం.
17. పారిశ్రామిక విధానాలను సరళీకృతం చేయడం.
18. నల్లధనం నియంత్రించడం.
19. తాగునీటి సౌకర్యాలు కల్పించడం
20. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
మొదలైన పథకాల ద్వారా ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకుని దేశ ప్రజల కోసం స్వపరిపాలన అందించిన గొప్ప నేత. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమెను 1984 అక్టోబర్ 31 న ఆమె అంగరక్షకులే ఇందిరాగాంధీని కాల్చిచంపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇందిరాగాంధీ పరిపాలన ఆమె ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటారు. వారి ఆదర్శవంతమైన పాలనా విధానాలను ప్రస్తుత ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయనడంలో సందేహం లేదు. పరిపాలన లోని కొన్ని అంశాలు ఆచరణీయం, ఆదర్శవంతం అని చెప్పవచ్చును.
– కామిడి సతీష్ రెడ్డీ,
జడలపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా