Take a fresh look at your lifestyle.

జంట నగరాల్లో సైబర్‌ ‌తుఫాను 20 ‌సంవత్సరాల క్రితం…

ఆగస్టు  27 – సెప్టెంబర్‌ 02, 2000

రాహీ, నగరంలో వాన వచ్చిందంటే
ఊళ్లోకి పులి వచ్చినట్లే
పులికి అడవిదారి దొరకదు
నీళ్లకు నది దారీ దొరకదు
నది ఎక్కడుంది
మూసేసిన్రు
మూసీ కడుపులోని ఇమ్లీబన్‌లో
మహాత్ముడు బస్‌స్టేషన్‌ ‌కట్టుకున్నాడు
తీరం వెంబడి బస్తీలు పీకేసి
నారావారు నందనవనం కట్టుకుంటున్నారు

నిజాం రాజు గండి పడ్డ పేటలో
ఉస్మాన్‌సాగర్‌ ‌నిర్మించి
ఊరికంతా మంచినీళ్లు అందిస్తే
సినిమా సన్యాసి నీళ్లున్న చోటూ
నాచున్న చోటూ వదలకుండా
ఆశ్రమాలు నెలకొల్పిండు
ఆశ్రమాలు అంటే ఆధునిక భాషలో
ట్రస్టులని అర్థం
గీర్వాణ భాషలో నిధులూ, నిక్షేపాలు
కోస్తా భాషలో డబ్బు మూటలు
తెలుగులో లంకెబిందెలని అంటారు

నగరంలో వాన వచ్చిందంటే
వరద వచ్చినట్లే
మనుషులెక్కడికి పోతరు
భవనాలే కాని తోవలు లేవు
రోడ్లేకాని కాలువలు లేవు
మనుషులుంటే పడిపోవడానికి
మ్యాన్‌హోల్స్ ‌మాత్రం వున్నాయి

నగరంలో జనాభా ఉంటుంది కానీ
జనం ఉంటారా?
ఉండరని కాదు
పోష్‌కాలనీల్లో ‘కుక్కలున్నాయి జాగ్రత్త’ అని
బస్తీల్లో మనుషులు తలదాచుకుంటరు

బంజారాహిల్స్ ‌జుబిలీహిల్స్
‌మహేంద్ర హిల్స్
‌నగరం చుట్టూ కొండలమీంచి
నీళ్లూ పల్లానికే పారుతయి
వీళ్లూ-అదే, అలగాజనం అక్కడే ఉంటారు

నాగుమయ్య కుంట, మైలారుగడ్డ
జమాల్‌కుంట, బాలం రాయి
హైటెక్‌ ‌సిటీలో ఇంకా ఈ పేర్లు మిగిల్నయా
వేయి పడగల స్వామి ప్రొక్లైనర్‌ అవతారమెత్తి
నేలనంతా సైబరీకరిస్తున్న
నాగరికతలో…
నాలాలో కొట్టుకుపోయిన పసిపిల్లలు
అదృష్టవంతులు

మహమ్మద్‌ ‌గూడాలో చచ్చిన శవాన్ని
పారేయడానికి సందయినా దొరకలేదు
కోరంటి దవాఖానాకే జల జ్వరం వస్తే
కోటొక్క దేవుళ్లకు మొక్కడం కన్నా
పూటకెళ్లనోళ్లకు కంప్యూటర్‌లో తొవ్వ ఉన్నదా?

మురికి వాడల్లో ముసలీ ముతకా
పిల్లలూ ముస్లింలూ చస్తే
చావుకూ బతుక్కూ మధ్య
సరిహద్దు రేఖలే లేవు

బంజారాహిల్స్‌లో కూలింది
ప్రహారిగోడ అయినా
చచ్చింది మాత్రం పాలమూరి లేబరు
ఇక్రిశాట్‌లో కొట్టుక పోయిన మహిళలు
దిన భత్యానికి పనిచేసే పొట్టకూటి కూలీలు
భవానీనగర్‌లో షహినా  బేగం
రసూల్‌పూరాలో పేరులేని బిచ్చగాడు
ఒకరేమిటి అందరూ అనామకులే

కోట్ల ఆస్తుల, లక్షల జనాభాల
ప్రభుత్వ గణాంకాలలో
పదులూ వందలూ పేదల చావులు
పాయింటు జీరో ఎంత పర్సెంటు?

ప్రాణమా నీకెంత విలువ!
‘చచ్చిన వాళ్లకు లక్ష రూపాయలు
బతికిన వాళ్లకు వెయ్యి రూపాయలు
బోళ్లకు నూరు బట్టలకు నూరు
ఏమైనా చెయ్యి, ఏదైనా ఇయ్యి
ఎదురు తిరిగితే నోళ్లు ముయ్యి,

ఇరవై నాలుగు సెంటిమీటర్ల వాన
ఈ నగరంలో ఇదివరకెన్నడూ కురవలేదు
చంద్రబాబు ‘జన్మభూమి’ లోను
‘ఈనాడు’ అన్ని ఎడిషన్లలోను తవ్వించిన
ఇంకుడు గుంతల్లో ఒక్క చుక్కా నిలువలేదు
కూకట్‌పల్లి, బాలనగర్‌లపై
చెరువులు తెగి అచ్చెరువైన వార్త
మూసాపేటలో ‘ఈనాడు’ కూడ మునిగిపోయింది

సుందరయ్య పార్కు
బాగ్‌ ‌లింగంపల్లి చింతలతోపు బావిగా
తొలి రూపమెత్తి
సుందరయ్య గ్రంథాలయం అక్షరాశ్రు సంద్రమైంది

1954 కన్నా అసహాయమై పోయిన
ప్రపంచబ్యాంకు అసహాయశురుడా
ఈ మిలినియంలో ‘టైం’ మాగజైన్‌కు
చంద్రునివో ఇంద్రునివో కానీ
మా పాలిట కృష్ణాష్టమినాడే కనిపించిన
చవితి చంద్రునివయ్యావు
మమ్ములను బొందితో పాటు
విజన్‌ 2020‌లోకి తీసుకపోయేట్లున్నావు

నువ్వెట్లాగూ నేలమీదపాదం మోపకుండా
గాలిలో తిరిగేటి గడుసుదయ్యం వలె
హెలికాప్టర్‌ ‌నుంచి తిలకిస్తున్నావు
ఆ విండో విజన్‌లో
రెండు చేతులూ తెగిన మా హుస్సేన్‌సాగర్‌
‌కడుపులో గుర్రం నాడాల నట్టల సంగతికాదు
వినాయక విగ్రహాల తుప్పు పట్టిన విధ్వంస సంచయం

హుస్సేన్‌సాగర్‌కిప్పుడు
దేహం లేదు – అలంకరణేకాని
నెక్లస్‌ ‌బిగించిన కంఠం నుంచి
నీళ్లు నోట్లోకి దిగవు
సాయం చేసుకోవడానికి చేతులేవి
ఒకటి ఎయిర్‌పోర్ట్ ‌మార్గం
ఇంకొటి ఎన్టీఆర్‌ఫ్లై ఓవర్‌

‌నీళ్లన్నీ సిమెంటు కాంక్రీటవుతున్న సిటీలో
నీళ్లొస్తే నువు మాత్రం ఏంచేస్తవు
మూడు జాముల రాత్రి తూములు తెరిపించు
అశోక్‌నగర్‌ ‌నుంచి కోరంటి దాకా
అంతా కొట్టుకపోయినా
‘వైస్రాయి’ వెలుగుతుంది
ఎం.సి.హెచ్‌ ‌బతుకుతుంది
ఏ హెచ్చరికావద్దు ఏ జాగ్రత్తా వద్దు
తూము కాలువల కింద ఇళ్లన్నీ
తూతూ బతుకుల గాళ్లవే-

ఆ తర్వాత అసెంబ్లీలో అకౌంటు ఇచ్చి
ఆంగ్లంలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టు
రెండు దుర్దినాల బీభత్సానికి
నీ రెండు మలినాశ్రువులేమీవద్దు
రెండు నిమిషాల మౌనం చాలు
అసెంబ్లీ మౌనానికి ప్రజలపై పన్ను ఎన్నివేలు?

వరవరరావు vara vara rao

– వరవరరావు

(కాంగ్రెస్‌ ‌సి.పి.ఎం. శాసనసభ్యులు ఆమరణ దీక్ష చేస్తున్న శిబిరం వద్ద శనివారం నాడు కవులూ, కళాకారులూ, రచయితలు నిర్వహించిన కవి సమ్మేళనంలో చదివిన కవిత.)

Leave a Reply