- కేంద్ర మార్గదర్శకాలు, లాక్‌డౌన్ పొడిగింపుపై చర్చ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 19న జరుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కొరోనా వైరస్ కట్టడికి రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే, రాష్ట్రంలో లాక్‌డౌన్ ఈనెల 30 వరకు కొనసాగుతుందని సీఎం గతంలో ప్రకటించారు. ఆ తరువాత లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అలాగే, లాక్‌డౌన్ అమలుకు సంబంధించి ఈనెల 20 నుంచి కొన్ని మినహాయింపులను సైతం కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం మేరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలా ? లేక పూర్తిగా ఎత్తి వేయాలా ? అనే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
అలాగే, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అనుగుణంగా ఏప్రిల్ 20 తరువాత అత్యవసర రంగాలకు సంబంధించి సడలింపులు ఎలా ఇవ్వాలి ? వాటిని ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై మంత్రివర్గం విస్త•తంగా చర్చించనుంది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 వరకూ లాక్‌డౌన్ యధావిధిగా కొనసాగుతుందనీ, ఆ తరువాత కేసుల నమోదు పరిస్థితిని బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే రాష్ట్రమంత్రివర్గ సమావేశం తీసుకునే నిర్ణయంపై ప్రజలు ఆసక్తిగా ఎదిరి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, కేంద్రం బుధవారం ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నది.