Take a fresh look at your lifestyle.

1969 ఉద్యమానికి 50 ఏళ్ళు

‘‘‌తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1969 జూన్‌ ‌నెలకు ప్రత్యేక స్థానం.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష వాడ వాడల నినదించిన నెల… వేలాది మంది జైళ్ళ పాలయినారు.. అరెస్టు అయిన వారిని పెట్టేందుకు జైలు గదులు సరిపోక విద్యాలయాలను జైళ్ళుగా మార్చారు.. రాజ్‌భవన్‌ ఎదుట పోలీసుల కాల్పులు ఉద్యమ ఉధృతికి దారితీసింది.. రాజధానిలో 33 గంటల కర్ఫ్యూ … తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల బాష్పావాయువు ప్రయోగం.. పోలీసుల కాల్పులు… రంగంలోకి దిగిన భారత సైన్యం.. సామాన్య ప్రజల బలిదానాలు… పరిస్థితి దిగజారి పోయి.. దేశ ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిర గాంధీ 1969, జూన్‌ 4 అర్ధరాత్రి హైదరాబాద్‌కు వొచ్చి పరిస్థితులను సమీక్షించారు.. అదే నెల ఆఖరున ఉద్యమ నాయకుడు మర్రి చెన్నారెడ్డి, ఇతర ఉద్యమ నాయకులను అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. ’’

తొలి, మలి ఉద్యమాల త్యాగధనులంతా చిరస్మరణీయులే
మండువ రవిందర్‌ ‌రావు (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

ఫోటో: హైదరాబాద్‌ ‌సిద్ధి అంబర్‌ ‌బజార్‌ ‌వద్ద 1969 జూన్‌, 4‌న రంగంలోకి దిగిన భారత ఆర్మీ

తెలంగాణ అంటేనే ఉద్యమాలకు నెలవు. ప్రపంచ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’ మొదలు, ఈ ప్రాంత ప్రజలు అస్థిత్వ పోరా•ంవరకు ఇక్కడి ప్రజలు తమ హక్కు) కోసం చేస్తున్న నిరంతరం పోరాటాలు ఇతర ప్రాంతాలకు మార్గదర్శకమవుతున్నాయి. వాటిల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం చెప్పుకోదగింది. అయిదేళ్ళ కిందనే ఈ ఉద్యమం ఫలవంతమైనా, ఇది ఉద్యమ రూపం దాల్చింది సరిగ్గా అర్ధ శతాబ్ధం క్రితం. భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రప్రాంతవాసులను తెలంగాణతో కలిపినప్పటి నుండి నిరసన మొదలైనప్పటికీ, 1969నాటికి ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. అందుకే తెలంగాణ ఉద్యమానికి 1969 ఉద్యమాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. నాటి ఉద్యమమే తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాష్ట్ర వాంఛను ప్రగాఢంగా ముద్రవేసిన ఫలితంగానే మలి ఉద్యమం పద్నాలుగేళ్ళు కొనసాగినా మొక్కవోని ధైర్యసహాసాలతో రాష్ట్రాన్ని సాధించేవరకు సకలజనులు నిర్విరామంగా కృషిచేసేందుకు దోహదపడింది. ఈ తొలి ఉద్యమంలో ఎందరో త్యాగధనులు.. వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవాల్సి ఉంది. పదవులు పోగొట్టుకున్నవారు, ప్రాణాలు పోగొట్టుకున్నవారు, అవమానాలు భరించినవారు ఎందరో.. ఎందరెందరో..విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయారు. నిరుద్యోగుల ఉపాధి అవకాశాలు మరింత వెనక్కు నెట్టివేయబడ్డాయి. ఏ ఇంటర్వూకు వెళ్ళినా, అడ్మిషన్‌కు వెళ్ళినా 1969 బ్యాచ్‌ అం‌టే చాలు వెనక్కి పంపించిన పరిస్థితులను ఎదుర్కోవాల్సివచ్చింది. ఈ ఉద్యమం ఉద్యమకారులకు చివరకు మిగిల్చింది రిక్త హస్తాలే.. ఈ తొలి ఉద్యమంలో మహిళలు, పురుషులు, చిన్నారులు అంతా కలిపి 360కి పైగా మృత్యువాత పడ్డారు. విచిత్రమేమంటే వీరంతా పోలీసు కాల్పుల్లో మరణించినవారే. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపిందనడానికి ఈ మరణాలే ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ గమనించదగ్గ విషయమేమంటే ఈ మృతుల సంఖ్య కూడా ఉజ్జాయింపే. నాటినుండి నేటివరకు మృతులను సంపూర్ణంగా గుర్తించింది లేదు. ఇవ్వాళ ఉన్నట్లుగా ఎలక్ట్రానిక్‌, ‌ప్రింట్‌ ‌మీడియాలు లేకపోవడం కూడా అందుకు కారణం. అయినా మలిదశ ఉద్యమానికి ఆనాటి ఉద్యమమే దిక్సూచీ. కాని నాటి ఉద్యమకారులను గుర్తించే ప్రయత్నాలు నేటివరకు జరుగలేదు. భావితరాలకు వారి చరిత్ర వెలుగు చూడకుండా అలానే మరుగనపడి పోతున్నది. మలిదశ ఉద్యమంలో కూడా ప్రాణత్యాగం చేసినవారి సంఖ్య వెయ్యికి పైగానే ఉన్నదని అంచనా వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మూడు వందల పైచిలుకు మరణాలనే ఉద్యమ నేపథ్యంలో జరిగిన మరణాలుగా గుర్తించింది. వీరిలో కొందరికి ఆర్థిక, హార్థిక సహాయాన్ని అందించినా, మరికొందరిని ప్రభుత్వం ఏదో కారణాలు చెప్పి విస్మరించిందన్న ఆరోపణ ఉంది. ఇక్కడ గమనించదగ్గ విషయమేమంటే 1969నాటి మరణాలన్నీ పోలీసు కాల్పులవల్ల జరిగినవైతే, మలిదశ ఉద్యమ మరణాలన్నీ బల్వన్‌మరణాలు, ఉద్యమం కోసం ఆత్మార్పణ చేసుకున్నవి కావడం. కాగా, ఆనాటి ఉద్యమానికి ఉద్యోగులు, విద్యార్థులే ప్రధాన భూమికను పోషిస్తే, మలిదశ ఉద్యమంలో
సకలజనులు పాల్గొనడం విశేషం. రెండు ఉద్యమాలకు మూడున్నర దశాబ్దాల వ్యవధి ఉన్నా, ఆనాటి ఉద్యమకారులు వెలుగులోకి తెచ్చిన పలు అంశాలు మలి ఉద్యమానికి ఉపకరించాయి. ఆనాడు కూడా వేలాది మంది జైళ్ళపాలైనారు. ఉద్యోగస్తులు చేపట్టిన 56రోజలు సమ్మె చరిత్రను సృష్టించింది. అరెస్టు అయినవారిని పెట్టేందుకు జైలు గదులు సరిపోక కళాశాలలను జైళ్ళుగా మార్చారు. ఉద్యమాన్ని రాజకీయ నాయకులు హైజాక్‌ ‌చేయడంతో ఉద్యమ ఉదృతం తగ్గింది. రాజకీయనాయకుల మధ్య జరిగిన ఒప్పందాలు, పథకాలు, కమిటీల పేర నాటి ఉద్యమం నీరుగారిపోయింది. ఇందులో నష్టపోయింది విద్యార్థులు, ఉద్యోగులైతే లాభపడింది రాజకీయనాయకులు. ఆ తర్వాత ఏనాడు నాటి త్యాగధనుల గురించి పట్టించుకున్నదిలేదు. ఆసక్తి గల కొందరు తయారుచేసిన జాబితానే తప్ప వారిని గుర్తించే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు. మలిదశ ఉద్యమం వచ్చేనాటికి మూడున్నర దశాబ్దాల కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో మృతుల కుటుంబాలేమైపోయాయన్నది ఎవరికీ పట్టలేదు. ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయకపోయినా వారిని ఉద్యమ యోధులుగా గుర్తించి, భావితరాలవారికి తెలిసే విధంగా వారి జాబితానైనా తయారుచేయకపోవడం విచారకరం.

తెలంగాణవారి ఉపాధి అవకాశాను ఉద్దేశ్యపూర్వకంగా ఆంధ్రాపాలకులు దెబ్బతీస్తున్నారంటూ భద్రాచలంలోని పాల్వంచ థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనే 1969 ఉద్యమానికి నాంది ప్రస్తావన. ఇల్లందు ప్రాంతానికి చెందిన రామదాసు అనేవ్యక్తి థర్మల్‌ ‌పవర్‌ ‌స్టేషన్‌లో అందరూ ఆంధ్రవాళ్ళతోనే నింపుతున్నారన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురాగా అది తెలంగాణ జిల్లాల్లోకి విస్తరించింది. దీంతో ఖమ్మంలో 1969 జనవరి 9న రవీంధ్రనాథ్‌ అనే వ్యక్తి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టడంతో ఈ ఉద్యమానికి ఒకస్వరూపం ఏర్పడింది. ఆ తర్వాత క్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా అవతరించింది. అదే )క్ష్యంగా జనవరిలో అనేక కమిటీలు, సంఘాలు ఏర్పడ్డాయి. జనవరి 13 నుండి వరుసగా విద్యార్థి కార్యాచరణ కమిటి, తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ ఉద్యోగ సంఘం, తెలంగాణ స్టూడెంట్స్ ‌ఫ్రంట్‌, ‌తెలంగాణ లిబరేషన్‌ ‌స్టూడెంట్‌ ‌ఫ్రంట్‌, ‌తెలంగాణ ఇన్‌ఫర్‌మేషన్‌ ‌ట్రస్ట్, ‌తెలంగాణ జర్నలిస్టులు, రచయితల ఫోరం ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సంఘాలు, సంస్థలు, కమిటీల నేతృత్వంలో వేలాదిమంది తెలంగాణ కోసం అహర్నిషలు పరితపించిపోయారు. ఈ సంస్థలు, సంఘాలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా రాజకీయ పార్టీలను, నాయకులను ఆ దిశగా నడిపించడంలో బహుముఖ పాత్ర పోషించాయి. ఉస్మానియా విద్యార్థిలోకం ఇందులో ముందువరుసలో నిలిచారు. వైద్య విద్యార్థి మల్లిఖార్జున్‌, శ్రీ‌ధర్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతమంతా ఉప్పెనలా లేచింది. ఉద్యమ ఆరంభంలోనే పోలీసుల కాల్పులకు ముగ్గురు బలైనారు. అయినా ధైర్యంగా పోరాటంలో నిలిచారు. ఉద్యమ ఖిల్లా అయిన వరంగల్‌లో టిఎన్‌జివో నాయకుడు నెల్లుట్ల జగన్‌మోహన్‌రావులాంటి మేటి ఉద్యమకారులను ఈ ప్రాంతం ఎలా మరిచిపోగలదు. దిలీప్‌సింగ్‌, ఏకె ఖాన్‌, ‌విద్యుత్‌శాఖకు చెందిన ఎస్సీ బిటి రేవతి, రిక్షాలో తిరుగుతూ గ్రౌండ్‌ ‌వర్క్ ‌చేసిన చిట్టా రాజేశ్వర్‌రావు, సోషలిస్టు విజ్ఞాన సమితి ద్వారా ఉద్యమించిన కటంగూరు నర్సింహరెడ్డి, తెలంగాణ గాంధీగా పేరుతెచ్చుకున్న భూపతి కృష్ణమూర్తి, రామిని మృత్యుంజయలింగం, ప్రొఫెసర్‌ శ్రీ‌ధర స్వామి, తోట ఆనందరావు, పెన్నా లక్ష్మికాంతరావు, 1969 మార్చ్ 8-9 ‌తేదీల్లో రెడ్డి హాస్టల్‌ ‌సమావేశంలో తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించిన టి. పురుషోత్తమరావు(ప్రస్తుతం విశ్రాంత రాజకీయ నాయకుడు), అదే సంవత్సరం సుప్రీం కోర్టు ముల్కీ నిబంధనలను కొట్టివేసినప్పుడు తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన కొండాలక్ష్మణ్‌ ‌బాపూజీ, టి. ఆంజయ్య, మాణిక్‌రావు, హషీమ్‌, అచ్చుతరెడ్డి, తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థాపించి ఉద్యమించిన మహదేవ్‌సింగ్‌, ఈవి పద్మనాభన్‌, ‌సంతపురి రాఘవరావు, మాధవరావు, జాకీర్‌ ‌హుస్సేన్‌, ‌వరంగల్‌లో టి. హయగ్రీవాచారి, నాటి విద్యార్థినాయకుడు టి. సిద్దులు, ‘‘సంజీవరెడ్డి మామ… అయ్యయ్యో రామరామ’’ అన్న పాటలతో ఆనాడు ప్రజలను ఉత్తేజపర్చి, ఉర్రూతలూగించిన ముచ్చర్ల సత్యనారయణ, ఇవ్వాళ టిఆర్‌ఎస్‌లో ప్రముఖ వ్యక్తిగా ఉన్న కె. కేశవరావు ఇలా చెప్పుకుంటూ పోతే వేల సంఖ్యలో(వీరిలో కొంతమంది ఇంకా సజీవులుగానే ఉన్నారు) ఆనాడు ఉద్యమంలో భాగస్వాములైనవారిని నేటి తరం ఎంతవరకు గుర్తంచుకుంటున్నది. కనీసం ఈ ప్రాంతం కోసం ఎవరు ఏమేరకు త్యాగం చేశారన్నది ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వానిదే నంటాడు ప్రముఖ కవి, విమర్షకుడు నాగిళ్ళ రామశాస్త్రి. వీరి త్యాగాలను చరిత్రాంశంలో పొందుపర్చాల్సిన అవసరం ఎంత్తైనా ఉందంటున్నారు. కొందరి జయంతి, వర్ధంతి వేడుకలు కూడా మొక్కుబడిగా మారాయంటూ ఈసందర్భంగా గాంధీజీ గురించి కాళోజీ అన్న మాటలను రామశాస్త్రి గుర్తుచేస్తున్నారు. ‘‘పోరుబందరులోని పురిటికేక పేరిట రెండవ అక్టోబర్‌- ‌రాజఘాటులోని తిరుపాళము పేరిట ముప్పదవ జనవరి- మాకు మిగిలింది ఈ రెండు దినాలు.’’ అంటూ కేవలం వర్ధంతి, జయంతులకే గాంధీ సిద్దాంతాలు పరిమితం అవుతున్నాయంటూ కాళోజీ పేర్కొన్నట్లు మలివిడుత ఉద్యమంలో అసువులు బాసినవారే కాకుండా ఎన్నో ఇబ్బందులకు ఓర్చి, లాఠీల దెబ్బలు తిన్నవారికి ఇవ్వాళ రాష్ట్ర సాధనాఫలాలు ఎంతవరకు సంక్రమిస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులను తన్నితరిమేసిన చరిత్రగలవారు ఇవ్వాళ ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. ఉద్యమంలో కనిపించని వారికి బ్రాండ్‌ అం‌బాసిడర్‌లాంటి పదవులు లభిస్తున్నాయి. పద్నాలుగేళ్ళు ఉద్యమమే ఊపిరిగా పనిచేసిన వారి కళ్ళముందే ఇతర పార్టీల నుండి వలసవచ్చిన వారికి మంత్రి పదవులు, ఎంఎల్‌ఏలు, ఎంపి పదవులు లభిస్తుండడంతో త్యాగధనులు నిరాశకు లోనవుతున్నారు. నాటి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రిటైర్డ్ ‌బిఇడి కాలేజీ ప్రిన్సిపల్‌ ‌డి. సాంబమూర్తి మా•ల్లో చెప్పాలంటే నాటికి నేటికి విద్యావ్యవస్థలో ఏమాత్రం మార్పులేదు, ఇవ్వాళ పాఠశాలలు, కళాశాలల్లో టీచింగ్‌ ‌స్టాఫ్‌ ‌లేక విద్యార్థులు ఇతర ప్రాంతాలవారితో సరితూగలేకపోతున్నారు. ఆసుపత్రుల్లో సేవలు రోజురోజుకు క్షీణించిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నదని వాపోతున్నారు. ఎందరి త్యాగాలతోనో ఏర్పడిన తెలంగాణ ఇంకా ఎన్నాళ్ళకు బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తుందోనని రిటైర్డ్ ‌లెక్చరర్‌ ‌సుదర్శన్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన భౌతిక తెలంగాణ ఏర్పడింది. దాన్ని ఏ ఒక్క వ్యక్తో సాధించలేదు. అందరి సమష్టి కృషి ఫలితంగా ఆవిర్భవించిన ఈ తెలంగాణ కోసం త్యాగంచేసిన వారందరిని యాభై ఏళ్ళ ఉద్యమ నేపథ్యంలో మరోసారి స్మరించుకోవడం మన కర్తవ్యం.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!