- కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించాలి
- లిఫ్ట్ఇరిగేషన్, మిషన్‌భగీరథ భారం 52 వేలకోట్లు
- కేంద్రం భరించాలి : రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు
మిషన్‌భగీరథ, కోసం నీతిఅయోగ్ సిఫారసు చేసినవిధంగా రూ.19వేలకోట్లు మంజూరు చేయాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీర్‌హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాష్ట్ర ఆర్థికమంత్రి 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎన్.కే.సింగ్‌ను కలిసి ముఖ్యమంత్రి ఇచ్చిన లేఖను అందచేశారు. రాష్ట్రానికి రుణసౌకర్యం పెంచాలని కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటాను పెంచాలని విజ్ఞప్తి చేశారు.మిషన్‌భగీరథ, వివిధప్రాపెక్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.52వేలకోట్లు అవసరమవుతాయని వీటిని మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 15 వ ఆర్థికసంఘానికి ఇచ్చిన లేఖ సారాంశాన్ని ఆర్థిక మంత్రి విలేకరులకు వివరించారు.15వ ఆర్థికసంఘం దక్షిణభారత ప్రాంతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించే ఆలోచన ఉన్నట్లు సంఘం చైర్మన్ తనతో చెప్పారని, తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా సదస్సుకు ఆతిథ్యం ఇస్తుందని తాను ఆహ్వానించానని చెప్పారు.
జీఎస్టీ బకాయిలు రూ.వేయికోట్లు, ఐజీఎస్టీ బకాయిలు రూ.2500కోట్లు తమకు రావాలని వాటిని కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగే సదుస్స సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు ఆర్థిక సంఘం చైర్మన్ ఆసక్తిని కనబరిచారని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా వచ్చిన విజ్ఞప్తులన్నింటినీ తాము కేంద్రానికి సిఫారసు చేస్తామని ఆర్థిక సంఘం చైర్మన్ హామీ ఇచ్చారని, సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ఆర్థిక మంత్రి వివరించారు.
Tags: National Status,Kaleshwaram Project,mission bhagiratha, thanniru harish rao