- బ్రిటన్ నుంచి వొచ్చిన వారిలో 18 మందికి పాజిటివ్
- ఆచూకీ లేని 184 మంది, ఆందోళనలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు
పాత కథే మళ్లీ పునరావృతం అవుతోంది. కొరోనా కొత్త రూపు సంతరించుకుని స్ట్రెయిన్‌గా మారి తెలంగాణ ప్రజలను వణికిస్తున్నది. తాజాగా ఈసారి బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల రూపంలో కొత్త ముంపు పొంచి ఉంది. గత 20 రోజులుగా బ్రిటన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1216 మంది రాగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వారికి నిర్వహించిన పరీక్షలలో ఇప్పటి వరకు 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.. వీరిలో అత్యధికంగా మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 6 గురు హైదరాబాద్ నగరానికి చెందిన 4 గురు ఉన్నారు. మిగతా 8 మంది జగిత్యాల, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు.
వీరందరినీ ప్రత్యేక వార్డులలో ఉంచిన వైద్యారోగ్య శాఖ అధికారులు వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అయితే, వీరిలో కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నాయా ? లేక కొరోనా వైరసేనా అనే విషయంపై నిర్ధారణకు వచ్చేందుకు వారి నుంచి శాంపిల్స్ సేకరించి జినోమ్ సీక్వెన్స్ కోసం సిసిఎంబికి పంపించి అక్కడి నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో 184 మంది వివరాలు సరిగా లేకపోవడం వైద్యఆరోగ్య శాఖ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. వీరి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు సరైన విధంగా లేకపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. అసలు వారంతా ఎక్కడ ఉన్నారు ? రాష్ట్రంలోనే ఉన్నారా ? లేక ఇప్పటికే రాష్ట్రం దాటి వెళ్లారా ? ఒకవేళ రాష్ట్రంలోనే ఉంటే ఎక్కడున్నారు ? వచ్చిన వారంతా క్వారంటైన్‌లోనే నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లోనే ఉన్నారా ? అనే విషయాలపై తీవ్రంగా దృష్టి సారించారు.
మరో 92 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లు గుర్తించి ఆయా రాష్ట్రాల అధికారులకు సమాచారం అందించారు. గత ఏడాది వెలుగు చూసిన కొరోనా వైరస్ కంటే స్ట్రెయిన్ వైరస్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. గత ఏడాది కొరోనా వైరస్‌పై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, వైరస్ విస్తరించకుండా తక్షణం చర్యలు చేపట్టిన కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొరోనా విస్తరణను, మరణాలను అదుపులో ఉంచడంలో విజయం సాధించగలిగారు. గత ఏడాది మర్కజ్ నుంచి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా కొరోనా కేసులు పెరిగాయి. ప్రస్తుతం కూడా ప్రతీ రోజూ సగటున వందకు పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా బ్రిటన్ పరిణామాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధికారులు ఆందోళనకు గురవుతున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారు తమ ఇరుగు పొరుగులో ఎక్కడ ఉన్నా లేదా వారి సమాచారం తెలిసినా తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు, కొత్త వైరస్ లక్షణాలు ఉన్నా, పాత కొరోనా అయినా అరికట్టాలంటే ప్రజలు వ్యక్తిగత పాటించడం, తప్పనిసరిగా మాస్కు ధరించడం, ప్రజలు గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.