Take a fresh look at your lifestyle.

‌తెలంగాణలో 16 ప్రజాసంస్థల నిషేధాన్ని ఎత్తివేయాలి..?

           డా।। చెరుకు సుధాకర్‌ ‌సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌కు బహిరంగ లేఖ

  • శ్రీ గౌరవ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నూతలపాటి వెంకటరమణ గారు!
  • మీ సామాజిక చైతన్యం రాజ్యాంగ హక్కుల్ని రక్షించాలి.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా  మీ ప్రమాణస్వీకారం తెలుగు ‘‘వాడి’’గా, తెగువ జాడగా మా అందరికి సంతోషానిచ్చింది. ఆటుపోట్లకు నిలిచి, పరీక్షల్లో గెలిచిన తెలుగు తేజం, మారుమూల తెలుగునేల కృష్ణాజిల్లా పల్లెనుండి ఎదిగిన, స్వంతం చేసుకున్న సామాజిక చైతన్యం, రాజీ పడని వ్యక్తిత్వం, భవిష్యత్తులో రాజ్యాంగ పరిరక్షణకు, వ్యవస్థల ప్రక్షాళన, సంస్కరణలకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావం ఇప్పుడు అంతటా వ్యక్తమవుతున్నది. గతంలో అనేక సంక్షోభపు మలుపుల్లో మీ తీర్పు కొత్త పుంతలు తొక్కినది. కోర్టుల్లో అందని ద్రాక్షలా న్యాయం ఉండకూడదన్న రావిశాస్త్రి మాటలు ఉటంకించిన మీ రేపు అత్యున్నత న్యాయస్థానాల్లో మీ ఈ స్వరపేటిక నుండి తీర్పుగా వెలువడుతున్నప్పుడు అట్లనే ఉండాలని కోరుకుంటున్నాము.
న్యాయశాస్త్రం, రాజనీతిజ్ఞత, భారత రాజ్యాంగం, సాహిత్యం నిత్యచదువరిగా మీ ప్రస్ధానం గొప్పది, శ్రీశ్రీ ఉత్తేజాన్ని జాషువా కఠిన వాస్తవాన్ని ఆకలింపు చేసుకున్న మీరు భారత ఇతిహాసాలు, పలు కావ్యాలు, నవలలు జీవన దివిటీలుగా పేర్కొన్నందున దేశంలో కొనసాగుతున్న లక్ష మెగావాట్ల చీకటిని, నల్ల చట్టాల పరంపరను నిలువరించగలరనే ఆశాభావంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.
మీరు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల ముందే పబ్లిక్‌ ‌సెక్యూరిటీ యాక్ట్ ‌ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యధర్శి సోమేష్‌కుమార్‌ ‌మార్చి30 నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటిస్తూ తెలంగాణలో 16 పౌర, విద్యార్ధి, రచయితల సంఘాలను ఏడాది పాటు నిషేదించారు. ఇందులో పౌర హక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, తుడుందుబ్బ, తెలంగాణ డెమాక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ఇం‌కా ఇతరులు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు  ఉమ్మడి రాష్ట్రంలో పౌర హక్కుల పునరుద్దరణకు, పోరాటానికి తనను ఎ.పి.సి.యల్‌.‌సి అధ్యక్షుడిగా చేసినా ముందుంటానని అన్నారు. పౌరహక్కుల సంఘంలో బాలగోపాల్‌, ‌కన్నాబిరాన్‌ ‌కృషి మీకు తెలియనిది కాదు. విరసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పనిచేసి, భావజాల వ్యాప్తికి కాళోజీ, ప్రొ।। జయశంకర్‌, ‌బియ్యాల జనార్ధన్‌ ‌రావుతో కలిసి పనిచేసింది. గొప్ప సాహిత్యాన్ని సృష్టించింది. శ్రీశ్రీ, రావిశాస్త్రి విరసం సభ్యులే, తెలంగాణ డెమాక్రటిక్‌ ‌ఫోరమ్‌ అసంఖ్యాక ప్రజారాశుల్ని తెలంగాణ ఉద్యమంలో తీసుకురావడంతో పాటు మైనారిటీ సోదరుల్లో తెలంగాణ పట్ల ప్రేమను పెంచింది, మద్దతు కూడగట్టింది.  తుడుం దెబ్బ 1997లో తెలంగాణ మహాసభకు ఆదివాసుల కోసం పురుడు పోసుకొని ప్రస్తుత ములుగు యం.యల్‌.ఏ ‌సీతక్కలాంటి వాళ్ళెందరినో అందించింది. మైదానం అడవి మీద దండయాత్రలు చేసినప్పుడు తుడుం దెబ్బలు, ఆదివాసి సంఘాలే నిట్టాడు అని ఇంద్రవెల్లిలాంటి సంఘటనలు తెలియజేస్తాయి.మావోయిస్టుపార్టీని నిషేధించడం అనివార్యమని, నక్సలైట్‌ ‌సంస్థల ఉనికి శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించడంలో అన్ని ప్రభుత్వాలు విజయవంతం అయినాయి. విశాల భారతదేశంలో ప్రజాస్వామిక వేదికలను తమ భావజాలానికి, కార్యక్రమాలకు అనుకూలంగా ఉపయోగించుకొనక వెనుకబడిన మావోయిస్టులు అందుకు మార్గం సుగమం చేసారనే అనుకోవాలి. నిజానికి పౌరహక్కుల పరిరక్షణ నక్సలైట్లకు పరిమితమైనది కాదు, ఎవరి ఇష్టారాజ్యం కాదు.

పలు కోర్టుల్లో ఇప్పటికే పౌరులు విప్లవ రాజకీయాలను విశ్వసించడం, ఆచరించడం తప్పు కాదు, చట్ట వ్యతిరేకం కాదని తీర్పులు ఇచ్చినా, పాలకుల వొత్తిడితో, కొత్త నల్ల చట్టాల వరదలో పలు నిషేదాలు, నిర్భందాలు, ఎడతెగని ఖైదులు సాధారణమయినాయి. భీమ్‌-‌కోరేగామ్‌ ‌సంఘటనలను సాకుగా ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ మేధావులను విచారణను గాలికి వదిలి తీవ్రవాద వ్యతిరేక చట్టాల పేరుతో జైళ్ళలో ఉంచడం మీకు తెలియనిది కాదు. మీలాంటి న్యాయమూర్తుల చొరువతో వరవరరావు  జైలు నుండి బయటపడి హాస్పిటల్‌లో వైద్యం పొందుతున్నప్పటికి, ఫ్రొఫెసర్‌ ‌సాయిబాబా, సోమాసేన్‌, ‌సుధా భరద్వాజ్‌, ఆనంద్‌ ‌తేల్‌తుంబ్డే తదితరులు కటకటాల వెనుకనే ఉన్నారు. 70 ఏళ్ళు దాటిన భారత ప్రజాస్వామిక ప్రస్ధానంలో ప్రజలు, వ్యవస్థలు ఎంతో పరిణతిని, సంయమనాలను స్వంతం చేసుకున్నారు. మీ మాటలో చెప్పాలంటే వ్యక్తులుగా ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందు ఎంత ఎదురీతతోనైనా ప్రయత్నిస్తూనే ఉండాలి. సత్వర న్యాయం అందేందుకు న్యాయ సేవల అధారిటీ చైర్మన్‌గా ఎన్నో చర్యలు తీసుకున్న మీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని తెచ్చే నిర్భందచట్టాలను నిలువరించడంలో, అవి ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని చెప్పడంలో వెనుకాడరని ఆశిస్తున్నాము.

మీరు గుర్తుచేసిన చార్లెస్‌ ‌డికెన్స్ ‌శాపగ్రస్త నగరాల తీరు వారణాసిలు, నాసిక్‌లు, ముంబాయిలు స్మశాన దివిటీలై భీతిగొల్పుతున్న తరణంలో కరోనా నేపద్యంలో ఆక్సీజన్‌, ‌వాక్సిన్లు, మందులు లేక అల్లకల్లోలం అవుతున్న సమయంలో బాధ్యత•, ప్రాధాన్యతలు మరచి రోజుకో ఎన్నికలతంతును కొనసాగిస్తూ మరింత క్లిష్టతర ఆరోగ్య ఎమర్జెన్సీలోకి దేశాన్ని నెట్టి, ఇప్పుడు ఆ 16 సంస్థలపై ఈ నిషేదాన్ని ప్రకటించడం అవసరం లేదని తీర్పు ఇస్తారని అశిస్తున్నాము. ఏ రాజకీయపార్టీ అయినా, సంస్థ అయినా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ముందుకు వెళితే ఆ సంస్థలే కాదు వ్యవస్థలే సంక్షోభంలో పడతాయని మందలించడం కూడా ప్రధాన న్యాయమూర్తిగా మీతోనే సాధ్యమవుతుందని భావిస్తున్నాము. ఏ రాష్ట్రం ఆయా ముఖ్యమంత్రుల కొత్తదేవుడి ఇష్టా రాజ్యం కాదని ఫెడరల్‌ ‌స్ఫూర్తిని ఇనుమడింపజేయాలంటే ప్రజల మద్దతును సంపూర్ణ ప్రజాస్వామ్యం ద్వారా కూడగట్టగలరు తప్ప మరో మార్గం లేదని వాళ్ళకు  నొక్కిచెప్పాలని మీకు బహిరంగం లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదములతో
ది: 25-04-2021                                                                                                                                                                                                                                                       డా।। చెరుకు సుధాకర్‌
‌                                                                                                                                                                                                                                                                      తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు

Leave a Reply