వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

16‌మంది ఎంపీలుంటే.. ఢిల్లీ జుట్టు మనచేతుల్లో

April 9, 2019

టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో తెరాస జెండాను ఎగురవేస్తే.. ఢిల్లీ జట్టు మనచేతుల్లో ఉంటుందని, అప్పుడు మనకు కావాల్సిన నిధులను శాసించి తెచ్చుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకొనేందుకు వీలుంటుందని తెరాస వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు. వివేకానంద విగ్రహం నుంచి క్లాక్‌టవర్‌ ‌వరకు భారీ ర్యాలీ నిర్వహించగా.. కేటీఆర్‌కు జనాలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి, కాంగ్రెస్‌ ‌మహామహులను మట్టికరిపించారని అన్నారు. కాంగ్రెస్‌ ఎం‌పీలు గెలిస్తే రాహుల్‌కు మాత్రమే లాభం లేదన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి మాత్రమే లాభమని, టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు గెలిస్తే తెలంగాణ మొత్తానికి లాభమన్నారు. ఐదేళ్లలో దేశానికి మోదీ చేసిందేలేదని మండిపడ్డారు. మోదీ వేడి తగ్గిందని, భాజపాకు 150 సీట్లు కూడా రావని, రాహుల్‌గాంధీకి 100 సీట్లు కూడా రావని అన్నారు. ఆలోచించి కాంగ్రెస్‌, ‌బీజేపీని దెబ్బకొట్టాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. 16 మంది టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుందని తెలిపారు. ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్‌ అని కేటీఆర్‌ అన్నారు. నాన్‌బీజేపీ..నాన్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయని, ఢిల్లీలో సంఖ్యాబలం ఉన్నోళ్లదే పెత్తనం అన్నారు. చంద్రబాబు సంఖ్యాబలంతో ఏడు మండలాలను ఏపీలో కలుపుకున్నాడని అన్నారు. రైల్వే మంత్రి ఎవరుంటే వాళ్ల రాష్ట్రాలు, ప్రాంతాలకే రైళ్లు పోతున్నాయని, కాంగ్రెస్‌, ‌బీజేపీ ఎంపీలు ఢిల్లీ దర్బార్‌లో గులాములని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎం‌పీలు రాహుల్‌ ‌కూర్చోమంటే కూర్చోవాలి..నిలబడమంటే నిలబడాలని ఎద్దేవా చేశారు. రోడ్‌షోలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌ ‌రెడ్డి, గుత్తాసుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.