తెలంగాణలో కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో 57 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే శుక్రవారం రోజున మళ్లీ కొరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో 9 మంది కొరోనాతో మృతి చెందారు. మరోవైపు మర్కజ్ వెళ్లొచ్చిన 900 మందిని అధికారులు గుర్తించారు. రెండు రోజుల్లో మొత్తం 800 మందికి కొరోనా పరీక్షలు చేశారు. అయితే.. మర్కజ్ వెళ్లొచ్చిన వారికి క్వారంటైన్ ముద్ర వేశామని అధికారులు తెలిపారు. ఇందులో 14 మంది ఇప్పటికే కోలుకుని ఇంటికెళ్లిపోగా, గురువారం మరో ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో లాక్ డౌన్‌ను శుక్రవారం నుంచి మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇప్పటి వరకు రోడ్ల దికి వస్తున్న అనుమానాస్పద వాహనదారులను వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇకపై ట్రాఫిక్ చలానాతో పాటు వాహనదారులను స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. స్థానిక పోలీసులు వాళ్లపై ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపనున్నారు. పోలీసులకు చిక్కితే గరిష్టంగా రెండేళ్లు జైల్ శిక్ష పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 25 వేల లాక్ డౌన్ కేసులు నమోదవ్వగా.. 34 వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇవాల్టి నుంచి కారణం లేకుండా ఎవరైనా బయటకు వస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు పట్టుబడ్డ వ్యక్తులు నేరుగా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 188, 271, 188, ప్రాణనీతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అంశాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.