- సోమేశ్ తరహాలోనే వారిని వెనక్కి పంపాల్సిందే
- వీరిపై ప్రధాని మోడీకి,డివోపిటికి లేఖ రాశా: రఘునందన్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వీరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయానికి, డీఓపీటీకి కూడా లేఖ రాశామని చెప్పారు. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్ లు, ఐపీఎస్లు తెలంగాణలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్టాన్రికి కేటాయించిన అధికారులు అక్కడే పనిచేయాలని అన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలని రఘునందన్ రావు అన్నారు. డీజీపీని కూడా ఏపీ కేడర్ కు కేటాయించారని.. ఆయనను కూడా అక్కడికే పంపించాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ ల కేటాయింపు కేసుపై ఈ నెల 27న విచారణ జరుగుతుందని చెప్పారు. 13 మందిపై 13 సార్లు వేర్వేరుగా పిటిషన్లు, తీర్పులతో సమయం వృథా కాకుండా ఈ కేసు మొత్తాన్ని ఒకటిగా పరిగణించి తీర్పు ఇవ్వాలని కోరారు. వీరు ఇక్కడే తిష్ట వేయడంలో ఆంతర్యమేమిటని అన్నారు.మియాపూర్ భూ కుంభకోణంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై సీఎస్ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
సర్వే నంబర్ 78 కి సంబంధించిన భూముల కేటాయింపులో రంగారెడ్డి జిల్లా అమోయ్ కుమార్ పక్షపాత ధోరణి చూపించారని విమర్శించారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం..40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా అని ప్రశ్నించారు. కలెక్టర్ అమోయ్ కుమార్ అందరికీ ఒక న్యాయం చేయరా అని అన్నారు. తమ లేఖను ఫిర్యాదుగా పరిగణించి కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కోరారు. తమకు 10 రోజులు సమయ మిస్తే మియాపూర్ భూకుంభకోణంపై మరింత సమాచారం ఇస్తామని రఘునందన్ రావు అన్నారు. వి•డియా ముందే సీఎస్ కు ఫోన్ చేసిన రఘునందన్ రావు అపాయింట్ మెంట్ కావాలని కోరారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇచ్చినా కలుస్తామని చెప్పారు. సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉన్నప్పుడు తన ఫోన్ కాల్ అటెండ్ చేయలేదని.. ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక కాల్ చేయగానే లిప్ట్ చేశారని అన్నారు.