వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

15రోజులు వాయిదా వేయండి

April 3, 2019

లోక్ సభ కు నామినేషన్ వేసిన నిజామాబాద్‌ రైతుల ఆందోళన
తెలంగాణలోని నిజామాబాద్‌ ‌లోక్‌ ‌సభ సీటు నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది రైతులే ఉన్నారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా రైతన్నలు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఓ పోలింగ్‌ అవగాహన కేంద్రం వద్ద రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. లోక్‌ ‌సభ ఎన్నికలను 15 రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. ఎన్నికల గడువు సపించినా ఇంకా తమకు గుర్తులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్‌ అవగాహన కేంద్రం ముందు బైఠాయించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతన్నలను సముదాయించారు. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలవుతుందని రైతులకు తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఆందోళనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో మెత్తబడ్డ రైతన్నలు ఆందోళనను విరమించారు. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ ‌పేపర్ల ద్వారా కాకుండా ఎం-3 రకం ఈవీఎం యంత్రాలను వినియోగిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. నిజామాబాద్‌ ‌స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ ‌తరఫున కేసీఆర్‌ ‌కుమార్తె కవిత, కాంగ్రెస్‌ ‌తరఫున మధుయాష్కీ, బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్‌ ‌పోటీ చేస్తున్నారు.