- సాగునీటి ప్రొజెక్టులపై రూ.1.61 లక్షల కోట్ల ఖర్చు…యుద్ధ్ద ప్రాతిపదికన పూర్తి
- రూ.5,349 వేల కోట్లతో 27,472 చెరువులు, కుంటల పునరుద్ధరణ
- దేశానికి ఆదర్శంగా తెలంగాణ
హైదరాబాద్, ఫిబ్రవరి 09 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సాగు నీటి విధానాలు సాకారమై రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా మెరుగైంది. గడిచిన ఎనిమిదేళ్ళ వ్యవధిలో విస్తీర్ణం ఏకంగా 117 శాతం పెరిగింది. 2023 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకటించిన గణాంకాల ప్రకారం తెలంగాణలో 2014-15 నుండి 2022-23 వరకు ప్రభుత్వం సాగునీటి ప్రొజెక్టులపై రూ.1.61 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా 2014-15లో ఉన్న సాగు విస్తీర్ణం 62.48 లక్షల ఎకరాల నుండి 2021-22 వరకు 135 లక్షల ఎకరాలకు పెరిగింది. అనగా ఎనిమిదేళ్ళలో అదనంగా 72.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. ఈ విధంగా పరశీలిస్తే సాగు విస్తీర్ణం 117 శాతం పెరిగిందన్న మాట. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సాగునీటి ప్రాజెక్టుల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం వలన సాగు విస్తీర్ణం పెరగటానికి అవకాశం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం వలన 18.25 లక్షల ఎకరాలు సాగు లోకి వొచ్చాయి. అలాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వలన 3.87 లక్షల ఎకరాలు, జే. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వలన 5.58 లక్షల ఎకరాలు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2.03 లక్షల ఎకరాలు సాగు పరిధిలోకి తేవటం జరిగింది. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 4.24 లక్షల ఎకరాలకు, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాగా పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదులలిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే మరో 15.91 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇక మిషన్ కాకతీయ కింద చిన్ననీటి పారుదలకు చెందిన చెరువులు, కుంటలను పునరుద్ధరించటం జరిగింది.
దాదాపు 27,472 చెరువులు కుంటలను రూ. 5,349 కోట్లతో పునరుద్ధరించటం జరిగింది. ఫలితంగా గత ఐదు సంవత్సరాలలో 8.93 టిఎంసిల నీటిని నిలువ చేసే సామర్ధ్యంతో 15.05 లక్షల ఆయకట్టును స్థిరీకరించటం జరిగింది. అంతే కాకుండా 1200 చెక్ డ్యామ్‌లు రూ. 3,850 కోట్లతో నిర్మించాలని నిర్ణయించగా, అందులో 638 చెక్ డ్యాంలు పనులు పూర్తయినాయి. మిగిలిన 562 చెక్ డ్యామ్ పనులు ప్రగతిలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 97.57 లక్షల ఎకరాలకు సాగునీరు వినియోగంలో ఉంది. కాగా మైక్రో ఇరిగేషన్ క్రింద 20.35 లక్షల ఎకరాలు సాగవుతుంది. గత ఆరు సంవత్సరాలలో భూగర్భ జలమట్టం 4.14 మీటర్లు పైకి పెరిగింది. రానున్న రోజులలో సాగునీటి విస్తీర్ణం మరింత పెరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆశయం మేరకు తెలంగాణలో సుభిక్షం నెలకొని దేశానికి ఆదర్శం కాగలదని ఆశించవచ్చు.
– జారీ చేసిన వారు : కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్