Take a fresh look at your lifestyle.

రుయా ఘటనపై సర్వత్రా నిరసనలు

తిరుపతి : తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్న ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వెల్లువెత్తాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అం‌దక నిమిషాల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రుయాకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చనిపోయింది 11 మంది కాదని.. మొత్తం 29 మంది అని తెలుస్తోంది. మృతి చెందిన 11మంది బెడ్స్‌తో పాటు తమతో వైద్యం తీసుకుంటున్న మరో 18 మంది బెడ్స్ ‌కూడా ఖాళీగా ఉండటంతో వారంతా మరణించి ఉంటారని రోగులు చెబుతున్నారు. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అం‌దక 11 మంది కోవిడ్‌ ‌బాధితులు మృతి చెందిన ఘటన పట్ల గవర్నర్‌ ‌బిశ్వ భూషణ్‌ ‌హరిచందన్‌ ‌తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను గవర్నర్‌ ఆదేశించారు. ప్రస్తుతం రుయాలో ఒకే ఒక్క జూనియర్‌ ‌డాక్టర్‌ ఉన్నారు. బాధితులందరికీ ఆయన ఒక్కరే వైద్యం అందిస్తున్నారు. ఆయనను బాధితుల బంధువులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కనీసం దూది కూడా లేదు. పేపర్‌తో రక్తం తుడుస్తున్నారు. సర్జికల్‌ ‌గ్లోవ్‌ ‌లేదు. షుగర్‌ ‌స్ట్రిలు లేవు. మందులు లేవు. లోపల పరిస్థితిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వైద్యులు సైతం వచ్చి తమకు చికిత్సను అందించాలని కోరుతున్నారు. ప్రాణాలు పట్టి నిలిపే ఆక్సిజన్‌ అం‌దక…11 మంది కొవిడ్‌ ‌బాధితులు ఆస్పత్రి పడకలపైనే ఆఖరి శ్వాస వదిలారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చునని తెలుస్తోంది. కనీసం పాతిక మంది చనిపోయి ఉంటారని వివిధ వర్గాలు ’అనధికారికంగా’ చెబుతున్నాయి.

ఉత్తమ సేవలతో ప్రాణదాతగా పేరుపొందిన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. రుయా ఆస్పత్రిలోని కొవిడ్‌ ‌వార్డుల్లో ఆక్సిజన్‌ ‌సరఫరా ఆగిపోవడంతో పరిస్థితి భయానకంగా తయారైంది. ఎటు చూసినా బెడ్లపై అచేతనంగా పడి ఉన్న బాధితులు, శ్వాసకోసం ఇబ్బందులు పడుతున్న వారే కనిపించారు. వైద్యులు, సిబ్బంది వారి చుట్టూ చేరి… ఛాతీపై నొక్కుతూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆక్సిజన్‌ అం‌దించేందుకు ప్రయత్నించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా సపర్యలు చేస్తూ కనిపించారు. సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ ‌సరఫరాలో అంతరాయం ఏర్పడగా… నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ ‌సరఫరా చేసేందుకు ప్రయత్నించారు.

7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. కానీ… ఆక్సిజన్‌ ‌సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాల వ్యవధిలోనే దారుణం జరిగిపోయింది. తమ వారు కళ్ళెదుటే ఆక్సిజన్‌ అం‌దక గిలాగిలా కొట్టుకుంటూ విగత జీవులుగా మారడంతో బాధితుల బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులను, సిబ్బందిని, ప్రభుత్వాన్ని నిందిస్తూ… వైద్య పరికరాలను ధ్వంసం చేశారు. వైద్య సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. భయాందోళనతో వైద్యులు, సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రుయాస్పత్రిలో ఆక్సిజన్‌ ‌సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్‌ ‌హరినారాయణన్‌ ‌ప్రకటించారు. ఐదు నిమిషాలు ఆక్సిజన్‌ ‌సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ‌ట్యాంకర్లు రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.

Leave a Reply