- పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తింపు
- ఆధార్ నోటీసులతో వెలుగులోకి సంచలన విషయాలు
ఆధార్ నోటీసుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ ధృవపత్రాలతో హైదరాబాద్‌లోని పాతబస్తీలో నివసిస్తున్న రోహింగ్యాలు ఆధార్ కార్డులు పొందినట్లు వెల్లడి కావడంతో 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సంస్థ నోటీసులు జారీ చేసిన విషయం సంచలనం సృష్టించింది. నోటీసులు అందుకున్న 127 మందిలో సత్తార్ ఖాన్ అనే నిందితుడు కూడా ఉన్నాడు. 2018లో రోహింగ్య ముస్లింలకు నకిలీ పత్రాల్రు సృష్టించి.. ఆధార్ కార్డులు ఇప్పించినట్టు సత్తార్‌పై సీసీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. 2018 ఫిబ్రవరి 6న సత్తార్ ఖాన్‌పై కేసు నమోదైంది. రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇప్పించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. తన ఇంటి అడ్రస్‌తో రోహింగ్యాలకు ఆధార్ వచ్చేలా చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తార్ ఖాన్ ఇచ్చిన పత్రాలతో ముగ్గురికి ఆధార్ కార్డులు పొందారు. సత్తార్‌తో పాటు నలుగురు రోహింగ్యాలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందిన రోహింగ్యాల ఆధార్ కార్డులను రద్దు చేయాలని సీసీఎస్ పోలీసులు కోరారు. పాతబస్తీలో పలువురు బ్రోకర్లు నకిలీ పాత్రలు సృష్టించి 127 మంది రోహింగ్యాలకు ఆధార్ నమోదు చేయించినట్లు బట్టబయలయైంది. విచారణలో భాగంగా ఆధార్ సంస్థకు రాష్ట్ర పోలీసులు లేఖ రాశారు. పోలీసుల లేఖపై స్పందించిన ఆధార్ యాజమాన్యం 127 మంది రోహింగ్యా ముస్లింలకు నోటీసులు జారీ చేసింది. సరైన పత్రాలతో తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. నోటీసులు అందుకున్న వారు భారతదేశ పౌరులు అయితే కనుక సరైన పత్రాలు చూపించాలని.. లేని పక్షంలో ఇతర దేశాల నుంచి వచ్చినట్టు ఆధారాలు చూపించాలని తెలిపింది. ఏ పత్రాలు లేకుంటే ఆధార్‌ను రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, అక్రమ ధృవపత్రాలు సమర్పించి ఆధార్ కార్డు పొందిన వారు పాతబస్తీలో దాదాపు 1000 మంది దాకా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాతబస్తీలో మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి పలువురు బ్రోకర్లు రోహింగ్యాలకు ఆధార్ కార్డులు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. వీరిలో ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులే ఉండటం గమనార్హం. ర•హింగ్యాలకు నకిలీ ధృవీకరణ పత్రాలతో ఆధార్ కార్డులు ఇప్పించిన మొత్తం వ్యవహారంలో సత్తార్ ప్రధాన పాత్ర పోషించినట్లు వెల్లడైంది. తాను నివసిస్తున్న ఇంటి అడ్రస్‌తో రోహింగ్యాలకు ఆధార్ వచ్చేలా చేసినట్లు కేసు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయనతో పాటు అరెస్టు చేసిన మరో నలుగురు రోహింగ్యాలను వారంతా ఎక్కడి నుంచి వచ్చారు ? అందుకోసం ఎవరెవరు సహకరించారు ? కేవలం ఉపాధి కోసమే ఇక్కడికి వచ్చారా లేక అందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంగా లోతుగా విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం కూడా కోరే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.