Take a fresh look at your lifestyle.

ఇక వంద శాతం అక్షరాస్యత దిశగా..

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కొత్త సంవత్సరంలో ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశం చేశారు. కాళేశ్వరం జలకళతో ఆయనలో ఉత్సాహం ఉప్పొంగుతోంది. తెలంగాణ నూరు శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఆయన 2020 సంవత్సరాన్ని ఎంచుకున్నారు. ఇందుకు తగిన రీతిలో ప్రభుత్వ యంత్రాంగం తన ప్రాథమ్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఆయన పిలుపు ఇచ్చారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్న కాళేశ్వరం ఇచ్చిన స్పూర్తితో రాష్ట్ర ప్రజలంతా ఉన్న లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్రంలో విద్యా రంగం పరిస్థితి పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా రంగాన్ని క్షాళన చేసేందుకు ఆయన ప్రతి ఒక్కరు మరి ఒకరికి బోధించాలి(ఈచ్‌ ‌వన్‌-‌టీచ్‌ ‌వన్‌) అనే నినాదాన్ని ఇచ్చారు. అక్షరాస్యతలో తెలంగాణ వెనకబడి ఉండటం నిజంగా మచ్చేనని ఆయన అంగీకరించారు. అందరం సమష్టిగా పని చేస్తే ఈ మచ్చను తుడిచేయడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన అన్నారు. సంకల్పబలంతోనే ఏదైనా సాధించగలమని ఆయన రుజువు చేస్తున్నారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ఉదాహరణ. దీనిని చేపట్టినప్పడు ఇది సాధ్యమయ్యే పనేనా అని పెదవి విరిచిన వారున్నారు. తెలంగాణ అక్షరాస్యతలో ఎందుకు వెనకబడిందో ఆయనే చెప్పారు. గత పాలకులు తెలంగాణ ప్రాంతం పట్ల చిన్న చూపు చూడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అయితే, తెలంగాణ పూర్తిగా వెనకబడిందనడం వాస్తవం కాదు. కవులు, పండితులు, రచయితలు ఎంతో మంది తెలంగాణ కీర్తిని దిగంతాలకు వ్యాపింపజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు పదహారు భాషల్లో పండితుడు. జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత డా।। సి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, సురువరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు వంటి ఎందరో పండిత ప్రకండులకు నిలయం తెలంగాణ.

అయితే, దిగువ స్థాయిలో సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అక్షరాస్యత విషయంలో తెలంగాణ వెనకబడింది. పీవీ అవిభక్త రాష్ట్ర విద్యా మంత్రిగా, ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు విద్యారంగంలో మార్పులు తీసుకుని వొచ్చారు. అయితే, తర్వాత అధికారంలోకి వొచ్చిన పాలకులు విద్యా రంగం పట్ల చిన్న చూపు చూసిన సంగతి నిజమే. ఇప్పటికీ తెలంగాణకు చెందిన ఎంతో మంది కవులు, రచయితలు రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణిస్తుమన్నారు. తెలుగు భాషకు తగిన ప్రోత్సాహం ఇస్తూ కేసీఆర్‌ ‌తెలంగాణను చదవులకు పుట్టినిల్లుగా తీర్చి దిద్దాలన్న ఆకాంక్షతో కృషి చేస్తున్నారు. గత ఏడాది తెలుగు మహాసభలను నిర్వహించడంలో ముఖ్యోద్దేశ్యం అదే. మనసుంటే మార్గం ఉంటుందన్న సామెత ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలోనే రుజువైంది. అదే స్పూర్తితో నూరు శాతం అక్షరాస్యతను సాధించడం కష్టమేమీ కాదు. నూరు శాతం అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలన్న కేసీఆర్‌ ‌పిలుపు ప్రజలందరికీ మేలుకొలుపు కావాలి. తెలంగాణలో విద్యావంతుల వేదిక, తెలంగాణ సారస్వత పరిషత్‌, ‌తెలుగు అకాడమీ వంటి సంస్థలు అక్షరాస్యతను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయి. నిరక్షరాస్యత వల్ల రాష్ట్రం ప్రతిష్ఠ దెబ్బతింటుందన్న కేసీఆర్‌ ఆం‌దోళనను విద్యా శాఖ వారే కాకుండా అన్ని రంగాల వారూ అర్థం చేసుకుని అక్షరాస్యత పెంపొందిచండానికి ఉద్యమ స్థాయిలో కృషి చేయాలి. తెలుగును అధికార భాషగా అమలు చేయడంలో తెలంగాణ ఇప్పటికే ముందుంది.

Tags: 100% towards, education literacy, year target, cm kcr, telangana govt, kaleswaram

Leave a Reply