Take a fresh look at your lifestyle.

వంద కోట్ల కొరోనా టీకా డోసుల మైలురాయి దాటుతున్న భారత్‌

“‌కొరోనాను కట్టడి చేయడానికి సామాజిక క్రమశిక్షణలు మాత్రమే సరిపోవని తెలిసింది. నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల కొరోనా కేసులు ఉండగా 46 లక్షల మరణాలు జరగ్గా, భారత్‌లో 3.41 కోట్ల కేసులు బయటపడగా 4.52 లక్షల మరణాలు నమోదైనాయి. విశ్వంలోనే 2వ అధిక జనాభా కలిగిన దేశంలో నెలకొన్న పేదరికం, నిరక్యరాస్యత, నిరుద్యోగం, వైద్య ఆరోగ్య వసతుల కొరతల వల్ల వైరస్‌ ‌కట్టడి కష్టం అయ్యింది. దీనికి తోడుగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు భౌతిక దూరాలు, మాస్కుల ధారణలు, సానిటైజర్‌ ‌వాడకాలతో కూడా పూర్తి జనాభాను పరిక్షించడం సాధ్యపడదని తెలిసింది.”

ప్రపంచ జనాభాలో 17.7 శాతంతో 139 కోట్ల భారతీయులు మార్చి 2020 నుంచి నేటి వరకు కొరోనా కల్లోలంలో చిక్కుకొనిపోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 30 జనవరి 2020న కేరళలో ప్రథమ కొరోనా కేసు నమోదైంది. ఇండియాలో 2వ అల విరిసిన సంక్షోభ తీవ్రత మిగిల్చిన విషాదాన్ని మనం ఇంకా మరువనేలేదు. కొరోనాను కట్టడి చేయడానికి సామాజిక క్రమశిక్షణలు మాత్రమే సరిపోవని తెలిసింది. నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల కొరోనా కేసులు ఉండగా 46 లక్షల మరణాలు జరగ్గా, భారత్‌లో 3.41 కోట్ల కేసులు బయటపడగా 4.52 లక్షల మరణాలు నమోదైనాయి. విశ్వంలోనే 2వ అధిక జనాభా కలిగిన దేశంలో నెలకొన్న పేదరికం, నిరక్యరాస్యత, నిరుద్యోగం, వైద్య ఆరోగ్య వసతుల కొరతల వల్ల వైరస్‌ ‌కట్టడి కష్టం అయ్యింది. దీనికి తోడుగా లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు భౌతిక దూరాలు, మాస్కుల ధారణలు, సానిటైజర్‌ ‌వాడకాలతో కూడా పూర్తి జనాభాను పరిక్షించడం సాధ్యపడదని తెలిసింది. కోవిడ్‌-19 ‌కట్టడికి అతి ప్రధానమైన అంశంగా కొరోనా టీకాల ఉద్యమం గుర్తించబడింది. కోవిడ్‌-19 ‌టీకాల ఉద్యమం భారత్‌లో 16 జనవరి 2021న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. భారత్‌లో అత్యవసర ప్రాతిపదికన మూడు రకాలైన టీకాలు వినియోగించారు. ఆక్స్‌ఫర్డ్-ఆ‌స్ట్రజెనెకా రూపొందించి సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ ‌టీకా మరియు రష్యా రూపొందించి రెడ్డి లాబ్స్ ‌తయారు చేస్తున్న స్పుత్నిక్‌-‌వి టీకాలు భారత ప్రజలకు యుద్ధప్రాతిపదికన ఇవ్వడం కొనసాగుతోంది. ఐరాస అనుమతించిన మాడెర్నా, జాన్సన్‌ అం‌డ్‌ ‌జాన్సన్‌, ‌జైకోవ్‌-‌డి, ఫైజర్‌, ‌సైనోఫాం, సైనోవాక్‌ ‌డబ్ల్యూహెచ్‌ఓ అమోదించిన టీకాలు అందుబాటులోకి వచ్చాయి/వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్త టీకా ఉద్యమం:
ప్రపంచవ్యాప్తంగా 217 దేశాల్లో 6 బిలియన్ల టీకా డోసులు ఇవ్వడం జరిగింది. చైనాలో 2.2 బిలియన్ల డోసులు దాటగా, ఇండియా 1 బిలియన్‌ ‌డోసులు కొన్ని గంటల్లో పూర్తి చేసిన చరిత్ర సృష్టించనున్నది. నేటికి విశ్వదేశాల్లో దాదాపు 290 కోట్ల ప్రజలు (37 శాతం) రెండు డోసులు తీసుకోగా, ఒక్క డోసు అందిన ప్రజలు (49 శాతం) 380 కోట్ల ఉన్నారు. ప్రపంచ దేశాల్లో యుఏఈలో 96 శాతం ప్రజలకు కనీసం ఒక్క డోసు అయినా అందడం విశేషం. భారత దేశవ్యాప్తంగా గత 270 రోజుల్లో (18 అక్టోబర్‌ ‌నాటికి) 98 కోట్ల టీకా మార్కును దాటి 100 కోట్లకు చేరడానికి పరుగులిడుతున్నది. నేటికి ఇండియాలో రెండు డోసులు తీసుకున్న జనులు దాదాపు 29 కోట్లు, ఒక్క డోసు అందిన ప్రజలు 70 కోట్లకు చేరింది. భారత ప్రభుత్వం కోవిడ్‌-19 ‌టీకా ఉద్యమానికి రూ: 35,000 కోట్లు వెచ్చిస్తున్నది. భారత వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ అత్యంత వేగంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం, ఐసియఆర్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చురుకైన పాత్రలు నిర్వహిస్తున్నాయి. నేటికి 80 శాతం ప్రజలు ఒక డోసును, 20 శాతం జనాభా రెండు డోసులు తీసుకున్నారు. తొలి రోజుల్లో రోజుకు 5-8 మిలియన్ల టీకాలు, తరువాత రోజుల్లో రోజుకు 50 మిలియన్ల టీకాలు అందించారు. 27 ఆగష్టు 2021 రోజున 1.02 కోట్ల డోసులు, 18 సెప్టెంబర్‌ 2021 ‌రోజున 24 గంటల్లో అత్యధికంగా 2.16 కోట్ల డోసులు అందించడం రికార్డుగా పరిగణించడం విశేషం.

భారతం ఎదుర్కొన్న సవాళ్ళు:
దేశ జనాభాకు టీకాల కొరత ఏర్పడితే ఇతర దేశాల నుంచి టీకాలను దిగుమతి చేసుకోవడానికి కూడా సన్నద్దంగా ఉండడం హర్షదాయకం. ఇండియా జనాభాకు టీకాలను అర్హులందరికీ అందించిన అనంతరం ఇతర దేశాలకు కూడా టీకాలను ఎగుమతులు చేస్తామని భారత్‌ ‌సగర్వంగా తెలుపుతున్నది. ఇతర దేశాలతో పోల్చితే సువిశాల భారతంలోని 65.5 శాతం గ్రామీణులకు టీకాలు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాలకు పెద్ద సవాలే అయినప్పటికీ భారతం టీకాల విషయంలో సఫలమైందనే చెప్పాలి. తొలి దశలో కొరోనా వారియర్స్, 2‌వ దశలో 60 ఏండ్లు దాటిన ప్రజలు, 3వ దశలో 18 ఏండ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వడం చూశాం. జూలై 20,2021 వరకు దేశంలో 32.64 కోట్ల ప్రజలు తొలి డోసును తీసుకోగా, 8.54 కోట్ల ప్రజలు రెండవ డోసు కూడా తీసుకోవడం జరిగింది. తొలి దశ టీకా ఉద్యమంలో ప్రజలు పలు అపోహలతో టీకా తీసుకోవడానికి ఉత్సాహం చూపకపోవడం గమనించాం. గత కొన్ని వారాలుగా దేశంలో టీకాల ఉద్యమం వేగం పుంజుకొని రోజుకు కోటి మార్కు వరకు తాకుతున్నది. మారుమూల ప్రాంతాలకు టీకాలను చేర్చడానికి అత్యాధునిక డ్రోన్‌ ‌టెక్నాలజీని కూడా భారత్‌ ‌వినియోగించడం విశేషంగా పేర్కొనబడింది. మనం తీసుకున్న రెండు డోసుల టీకాలు కొత్త కొరోనా వేరియంట్లు, స్టేయిన్లను కట్టడి చేయక పోవచ్చని, 3వ బూస్టర్‌ ‌డోసు ఇవ్వాల్సి రావచ్చని అంటున్నారు. కనీసం కొరోనా వారియర్స్‌గా సేవలందిస్తున్న వారికి 3వ బూస్టర్‌ ‌డోసు కూడా ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అగ్ర దేశాలు బూస్టర్‌ ‌డోసు కోసం తమ వద్ద టీకా నిల్వలను పెంచుకుంటున్నాయి.

పిల్లలకు కొరోనా టీకాలు:
ఇప్పటి వరకు మన దేశంలో కొరోనా టీకా ఉద్యమం 18 ఏండ్ల దాటిన జనాభాకు మాత్రమే అందుబాటులో ఉంచారు. మన దేశంలో జనాభాలో 41 శాతానికి పైగా 18 ఏండ్ల లోపు పిల్లలు/యువత ఉన్నదని అంచనా. 3వ అల రావచ్చన్న హెచ్చరికల నడుమ పిల్లలకు పెను ప్రమాదం రావచ్చని నిపుణులు అంచనా వేశారు. ఇటీవలే 2-18 ఏండ్ల వయస్సు వారికి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ ‌బయోటెక్‌ ‌రూపొందించిన ‘కొవాక్జీన్‌’ ‌టీకాకు సంబంధించిన 3వ దశ క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌పూర్తి చేసిన ఫలితాలను ‘డ్రగ్స్ అం‌డ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా, డిసిజిఐ’కి సమర్పించింది. ఏ క్షణంలోనైనా భారత్‌ ‌బయోటెక్‌ ‌పిల్లల కోవాక్జీన్‌ ‌టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు రావచ్చని ఎదురు చూస్తున్నారు. పిల్లలకు వినియోగించనున్న కోవాక్జిన్‌ ‌టీకాను 20 రోజుల వ్యవధితో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇటీవల ఆగష్టు 2021లోనే 12-18 ఏండ్ల వయస్సుగల యువతకు జైడస్‌ ‌రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి డిసిజిఐ అనుమతులు కూడా లభించడం, త్వరలోనే పిల్లలకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి కంపెనీ ఉత్పత్తులు ప్రారంభించిందని మనకు తెలుసు.

– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply