జీఎస్టీ బకాయిలపై ప్రాంతీయ పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. తెరాసతో పాటు మరో 9 పార్టీల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తెరాస ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గాంధీ విగ్రహం సాక్షిగా ధర్నా చేశామన్నారు. కేంద్రం నుంచి ఒక్క తెలంగాణకే సుమారు రూ.9వేల కోట్ల జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు.
కొరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్టాల్రు ఆర్థికంగా నష్టపోయాయని చెప్పారు. ఈ సమయంలో కేంద్రం ఆదుకోవాల్సింది పోయి.. రావాల్సిన వాటిని కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రజల కోసం ఎవరితోనైనా పోరాడతామని చెప్పారు. జీఎస్టీ బకాయిల చెల్లింపుపై లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చామని.. చర్చ కోసం పట్టుబడతామని నామా స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేందుకు సమయం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కోరామన్నారు.