రాబోయే యాసంగి సీజన్ కోసం తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. గత యాసంగి సీజన్లో రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎరువుల కేటాయింపును పెంచింది. ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సదానంద గౌడను కలసి యూరియా విడుదల కోసం విజ్ఞప్తి చేశారు. పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా ఈ ఏడాది యాసంగి సీజన్‌కు 11 లక్షల టన్నుల యూరియా కేటాయించాల్సిందిగా కోరగా 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది.
యూరియాతో పాటు రాబోయే యాసంగి కోసం 1.2 లక్ష టన్నుల డిఎపి, 1.1 లక్షల టన్నుల పొటాష్, 50 వేల టన్నుల సూపర్ ఫాస్ఫేట్, 5.5 లక్షల టన్నుల ఎరువులు సహా మొత్తం 18.3 లక్షల టన్నుల ఎరువులు సరఫరా చేయడానికి కేంద్రం అంగీకరించింది. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ కేటాయించిన ఎరువులను షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయాల్సిందిగా కోరారు. నీటిపారుదల వనరులు పెరిగినందున సాగు విస్తీర్ణంలో 30 శాతం పెరుగుదల నమోదు అవుతుందని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు కేటాయింపులు చేయాలని మంత్రి కేంద్రాన్ని అభ్యర్థించారు. 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందన్నారు. గత యాసంగిలో సాగు లెక్కల ప్రకారం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందన్నారు. తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతులు, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కన్నా 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపిందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డీఎపీ, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 0.5 లక్షల మెట్రిక్ టన్నుల సూపర్ పాస్ఫేట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి 18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు కేంద్రం కేటాయించిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు.