తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వైద్యుల నిర్లక్ష్యంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ జిల్లా ఆసుపత్రి ఇన్చార్జి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు బీసీ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని బెగ్గర్స్ కాలనీకి చెందిన బీసీ సంఘం సభ్యుడు మహమ్మద్ మతిన్ (43) ను సోమవారం అర్ధరాత్రి పాము కాటుకు గురికాగా దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పాముకాటుకు మందు లేదని వైద్యులు చెప్పడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు చేతులెత్తేశారు, దీంతో పాము కాటుకు గురైన వ్యక్తిని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పాముకాటుకు మందు లేకపోవడం అత్యంత దారుణమని అన్నారు. పాము కాటుకు మందు లేదని చెప్పి, వైద్యం నిరాకరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఆస్పత్రి వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.
మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ సంతోష్, జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెన్డెంట్ డాక్టర్ మూర్తి లపై చర్యలు తీసుకోవాలంటూ తాండూర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పదూరు బీసీ సంఘం నాయకులు మృతుని స్నేహితులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.




