రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్ 2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. మరి ఏప్రిల్ మొదటి రోజునే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలాగుంటుందన్న ఆందోళన కలుగుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర భయాందోళనలు రేపుతోంది. ఎందుకంటే ఏప్రిల్, మే రెండు నెలలు తీవ్రంగా ఉండనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ డేంజర్ వార్నింగ్ ఇచ్చింది. రోజు రోజుకీ తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం ఏడు గంటలకే చెంప చెళ్లుమనిపిస్తూ 8 గంటలకల్లా చుక్కలు చూపిస్తున్నాడు.
సెగలు కక్కుతోన్న సూరీడు, పది గంటలకు నడినెత్తిన మంట పెట్టినట్టు పొగలు సెగలు రేపుతున్నాడు. వారం రోజులుగా ఏపీ, తెలంగాణలో ఎక్కడచూసినా ఇదే పరిస్థితి. పలు ప్రాంతాల్లో ఉదయం 11గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయంటే సూర్యుడి విశ్వరూపం ఏ రేంజ్‌లో ఉందో అర్థంచేసుకోవచ్చు. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే, ఇంకోవైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైగా రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయంటూ వాతావరణశాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 37 మండలాలకు వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఐఎండీ చెబుతోంది. ఉష్ణోగ్రతలకు తోడు, వడగాల్పులు కూడా ఊహించని స్థాయిలో ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు శాంపిల్స్ మాత్రమేనని, ముందుముందు ఇంకా పెరుగుతాయంటోంది. ఏప్రిల్ సెకండ్ వీక్ తర్వాత నిప్పుల కుంపటేనని హెచ్చరిస్తోంది.
రాత్రుళ్లు సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. అందుకే అత్యవసరమైతే తప్ప, మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట కూడా ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇరు రాష్ట్రాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో మంగళవారం 37 మండలాల్లో వడగాల్పుల ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడిరచారు. అటు, తెలంగాణలోని 15 జిల్లాల్లో వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప పగటిపూట బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. రాబోయే 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మంచినీరు ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని.. ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ వంటివి తాగాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొంటున్నారు.



