Take a fresh look at your lifestyle.

‌ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌ ‌పునర్జీవం ?

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌కు పునర్జీవం కలుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రస్తుతం ప్రశాంత్‌ ‌కిశోర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పక్షాన ఎన్నికల వ్యూహకర్తగా నిలిస్తే ఆ పార్టీ చాలావరకు విజయం సాధిస్తూ రావడమన్నది ఇప్పటివరకూ జరుగుతున్నది. అందుకే ఆయన సలహాను, ఎన్నికల తంత్రాన్ని ఉపయోగించుకునేందుకు ఆయా రాష్ట్రాలు ఆయన్ను ఆహ్వానిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఆయన ఫలానా పార్టీకో, ప్రత్యేకంగా రాష్ట్రానికో పరిమితం కాకుండా వారివారి అవసరాలకు ఉపయోగపడే వ్యక్తిగానే ఉంటూ వొస్తున్నాడు. ఈ సారి ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీలోచేరి, ఆ పార్టీకి సేవలందించడంతో పాటు ఏదో హోదాలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రానున్న గుజరాత్‌ ‌శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాత 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ‌పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ ముఖ్యనేతలతో శనివారం జరిపిన ముఖ్య భేటీకి ప్రశాంత్‌కిశోర్‌ను ఆహ్వానించడం ఆయన చేరిక అంశాన్ని ధృవపరుస్తున్నది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్‌ ‌కిశోర్‌తో సోనియాగాంధీ వివరంగా మాట్లాడినట్లు సమాచారం. వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్‌కు ఆ పార్టీని గట్టెక్కించగల వ్యూహకర్తల కరువేర్పడింది. ఈ ఎనిమిది సంవత్సరాల్లో వివిధ రాష్ట్రాల్లో వేళ్ళూనుకున్న బిజెపిని ఎదుర్కునడం అంత సులభమైందేమీకాదు. గత ఎన్నికలను పరిశీలించినప్పుడు కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీనియర్‌లుగా చెలామణి అవుతున్నవారి వ్యూహలు, ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయడంలేదన్నది స్పష్టమవుతున్నది.

ఇలాంటి పరిస్థితిలో కొత్త ఆలోచనలతో పార్టీని నడిపించగలిగే వ్యక్తులు ఇప్పుడాపార్టీకి అవసరం. అందుకే ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌సేవలను పొందాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే కేవలం ఎన్నికలకే పరిమితం కాకుండా పార్టీ నాయకుడిగా ఆయనకు స్థానం కల్పించాలన్నది సోనియా ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన శిష్యుడిగా చెప్పబడుతున్న మరో వ్యూహకర్త సునీల్‌ ‌కనుగోలు(ఎస్కే) ఇటీవలనే కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇక గురు శిష్యులిద్దరు కలిస్తే కాంగ్రెస్‌ ‌మరింత మెరుగైన ఆలోచనలతో ముందుకు పోయే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మే ఆరవ తేదీలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించడం చూస్తుంటే కాంగ్రెస్‌లో చేరిక ఖాయమనే తెలుస్తున్నది.

ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌విషయానికొస్తే….దశాబ్ద కాలంగా ఆయన పేరు భారత రాజకీయ వర్గాల్లో నానుతుంది. ఎదుటిపార్టీపై దెబ్బదీసే వ్యూహరచన విషయంలో ఇంతవరకు ఆయా పార్టీల్లోని సీనియర్‌లపైనే ఆయా పార్టీలు ఆధారపడుతుండేవి. ఇప్పుడు ఆ స్థాయి దాటింది. వ్యూహాలకు ప్రతివ్యూహాలను అల్లగలిగే సమర్థుల కోసం ఇంచుమించు దేశంలోని పార్టీలన్నీ ఆర్రులు చాస్తున్నాయి. రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరున్న కెసిఆర్‌ ‌కూడా ఆయన సేవలను వినియోగించుకోవాలని ఉత్సాహపడుతున్నాడు. ఇప్పటికే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల ఒక మీడియా సమావేశంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే స్యయంగా చెప్పారు. ఆయన తనకు మంచి మిత్రుడని. ఆయన సలహా తీసుకుంటే తప్పేమిటని. దానికితోడు పీకె బృందం తెరాస పక్షాన రాష్ట్ర రాజకీయాలపై సర్వేకూడా చేపట్టిందని తెలుస్తున్నది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో తెరాసతో కాంగ్రెస్‌కు ఏమాత్రం సరిపడట్లేదు. ఈసారి ఎట్లైనా గోలకొండమీద మూడు రంగుల జండాను ఎగురవేస్తామని కాంగ్రెస్‌ ‌ధీమాను వ్యక్తం చేస్తున్నది. వొచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని వొస్తున్న ఊహాగాన వార్తలను ఆ పార్టీ అధిష్టాన వర్గం కొట్టేస్తున్నది కూడా. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయకుల బృందం దిల్లీకి వెళ్ళినప్పుడు తెరాసతో ఎలాంటి పొత్తు ఉండబోదని రాహుల్‌ ‌గాంధీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

కాని, దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్నప్పుడు బిజెపికి ప్రత్యమ్నాయంగా నిలువాలనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌సోనియా గాంధీకి వివరించినట్లు తెలుస్తున్నది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సోనియాకు సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. దీన్ని బట్టి కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీలు రెండు కూడా బిజెపిని వ్యతిరేకిస్తున్నవే కాబట్టి, ఈ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకుంటే గాని ఉమ్మడి శత్రువును దెబ్బతీయలేవన్న ఆయన స్ట్రాటజీ పనిచేస్తే, తెలంగాణలో ఈ రెండు పార్టీల పొత్తు అనివార్యమయ్యే అవకాశాలున్నాయనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌కాంగ్రెస్‌లో చేరిక తెరాసకు, కాంగ్రెస్‌ ‌పొత్తుకు మార్గమవుతుందా అన్నది కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply