Take a fresh look at your lifestyle.

‌ట్రయాంగిల్‌ ‌ఫైట్‌

ఒకవైపు కొరోనా విలయతాండవం, మరో వైపు ఎండల తీవ్రత. వీటికితోడు వివిధ జిల్లాల్లో రాజుకుంటున్న ఎన్నికల వేడి. మొత్తంమీద రాష్ట్ర ప్రజలు ఏదో విధంగా ఈ ట్రయాంగిల్‌ ‌ఫైట్‌ను ఎదుర్కోవాల్సి వొస్తున్నది. రాష్ట్రంలో రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న పాజిటివ్‌ ‌కేసులతో జనంలో ఒక విధంగా వణుకు మొదలైంది. బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. దానికి తగినట్లుగా ఎండలు కూడా ముదరడంతో ప్రజలు ఇంటికే పరిమితం కావడానికి ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న జరుగనున్న  మున్సిపల్‌ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజకీయ పార్టీలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు రెండు కార్పొరేషన్‌ ఎన్నికలతోపాటు అయిదు మిస్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ విధంగానైనా వీటిని తమ ఖాతాలో వేసుకోవాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అయితే పోటీ మాత్రం టిఆర్‌ఎస్‌, ‌బిజెపి, కాంగ్రెస్‌ ‌మధ్యనే తీవ్రంగా ఉండడంతో దాదాపు అన్ని చోట్ల ట్రయాంగిల్‌ ‌ఫైట్‌ ‌కొనసాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సంబంధిత నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు, ఛాలెంజీలు చేసిచేసి అలిసిపోయారు. అయిదు మున్సిపాలిటీలు ఒక ఎత్తు కాగా, రెండు కార్పొరేషన్‌లపైనే  ఇప్పుడన్ని పార్టీల చూపుంది. కార్పొరేషన్‌ ‌చేతికి వొస్తే ఒక విధంగా జిల్లానే చేతికివొచ్చినట్లు అవుతుందని ఆయా పార్టీలు ఉత్సాహపడుతున్నాయి. తాజాగా ప్రచారపర్వం కూడా పూర్తి కావడంతో ఇక ఆయాపార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాయి.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ మొత్తం ఎన్నికల్లో ఒక్క అధికార టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే రెండు కార్పొరేషన్‌లతో పాటు, అన్ని మున్సిపాల్టీల్లోని వార్డుల్లో తమ అభ్యర్థులను నిలిపింది. పోటీపడుతున్న ఇతర పార్టీలు ఆమేరకు అభ్యర్థులను నిలుపలేకపోయాయి. వరంగల్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌లో 66 డివిజన్‌లుండగా టిఆర్‌ఎస్‌ అన్ని డివిజన్‌లలో పోటీ చేస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్‌ 65 ‌డివిజన్లలో పోటీ చేస్తుండగా, బిజెపి 66 డివిజన్లలో నామినేషన్‌లు దాఖలుచేసినా 64మందే పోటీపడుతున్నారు. వామపక్షపార్టీలు 16 స్థానాల్లో పోటీకి నిలువగా  ఆమ్‌ ఆద్మీ, జనసేన, తెలంగాణ జనసమితి, ఆల్‌ ఇం‌డియా ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎం‌సిపిఐ, టిడిపిలాంటి రాష్ట్రంలో పెద్దగా పట్టులేని పార్టీలకు సంబంధించి దాదాపు 50కి మించి పోటీలో ఉన్నారు. వీరితోపాటు 237 మంది ఇండిపెండెట్లు రంగంలో ఉన్నారు. కాగా వీరిలో చాలావరకు టిఆర్‌ఎస్‌, ‌బిజెపి రెబల్స్ ఉన్నారు. ప్రధానపార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయడం, బి ఫాంలు  చివరి తేదీన అందజేయడం కూడా కొంత గందరగోళ పరిస్థితికి కారణమైంది. చాలామంది పార్టీ నాయకత్వంపై అలిగి అలాగే పోటీలో నిలవడంతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తాజాగా కొందరిని పార్టీనుండి సస్పెండ్‌ ‌చేసింది కూడా. అయినా ఇక్కడ త్రికోణపోటీ ఉండబోతున్నది. ఈ మూడు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు విస్తృతంగా పర్యటించిన సందర్భంలో వరంగల్‌ అభివృద్ధిని ప్రధానాంశంగా చేసుకుని మాట్లాడారు. వరంగల్‌లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న నగరంలో పెద్దఎత్తున పరిశ్రమలు రాకపోవడానికి మీరంటే మీరే కారణమని మూడు పార్టీలు ఒకరిపైన ఒకరు విరుచుకుపడ్డారు.

ఎవరికివారు ప్రజలను వోట్లు అడిగే అర్హత తమకే ఉందంటే తమకే ఉందని చాటుకునే ప్రయత్నాలు చేశారు. కేంద్రంతో ముడివడిన రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్, ‌మామునూర్‌ ఏయిర్‌పోర్టుపై రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని బిజెపి, వాటిని మంజూరు చేయడంలో కేంద్రం ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని టిఆర్‌ఎస్‌ ‌విమర్షనాస్త్రాలను సంధించుకున్నాయి. ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి. అయితే ఒకప్పుడు ఖమ్మంలో ఉన్న బలం ఇప్పుడు అక్కడ కాంగ్రెస్‌కు లేదు. దీంతో ఖమ్మంలో ప్రధానపోటీ అధికార టిఆర్‌ఎస్‌, ‌బిజెపి మధ్యే ఉండే అవకాశాలున్నాయి. అందులో ప్రధానంగా పవన్‌కళ్యాణ్‌ ‌నేతృత్వంలోని జనసేన పార్టీ ఇక్కడ బిజెపితో కలిసి పోటీచేస్తుండడంతో ఇక్కడి ఎన్నికలపై పలువురికి ఆసక్తి ఏర్పడుతున్నది.  ఖమ్మంలో మొత్తం 57 డివిజన్‌లకుగాను అన్నింటిలో టిఆర్‌ఎస్‌ ‌పోటీ చేస్తుండగా కాంగ్రెస్‌ 48, ‌బిజెపి 47 స్థానాల్లో పోటీపడుతున్నాయి. సిపిఐ 3, సిపిఎం 9 స్థానాల్లో, టిడిపి 8 స్థానాల్లో, ఇతర పార్టీలన్నీ కలిపి మరో పన్నెండింటిలో పోటీ పడుతుండగా, స్వతంత్రులుగా బరిలో నిలిచినవారు 67గురున్నారు. ఖమ్మంను టూరిస్ట్ ‌సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న బిజెపి నాయకులు, స్థానిక మంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కేవలం ఆరోపణలు చేయడం కాదు, వాటిని నిరూపించాలంటూ టిఆర్‌ఎస్‌ ‌మంత్రి డిమాండ్‌ ‌చేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో ఉన్న 43 వార్డులన్నిటిలో టిఆర్‌ఎస్‌ ‌పోటీ చేస్తుండగా బిజెపి 40, కాంగ్రెస్‌ 30 ‌స్థానాల్లో, నార్కెట్‌పల్లిలో ఉన్న 20స్థానాల్లో టిఆర్‌ఎస్‌, ‌బిజెపి 14, కాంగ్రెస్‌ 16ఇం‌టిలో, జడ్చర్లలోని 27ఇంటిలో టిఆర్‌ఎస్‌, 22‌స్థానాల్లో బిజెపి, 25 స్థానాల్లో కాంగ్రెస్‌ ‌పోటీపడుతున్నాయి. కాగా అచ్చంపేటలోని 20, కొత్తూరులోని 12 స్థానాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. ఈ అయిదు మున్సిపాల్టీల్లో కూడా ఇండిపెండెంట్ల సంఖ్య బాగానే ఉంది. ఇదిలా ఉంటే ఈనెల 30న జరిగే వోటింగ్‌లో ప్రజలు ఏపార్టీని అందలం ఎక్కిస్తారో వేచి చూడాలి.

manduva ravindhar rao
మండువ రవీందర్‌రావు

 

Leave a Reply