Take a fresh look at your lifestyle.

విద్యతోనే అజాది అని ఎలుగెత్తిన అజాద్‌

‌నేడు మౌలాన అబుల్‌ ‌కలాం ఆజాద్‌ ‌జయంతి, భారతీయ విద్యా దినోత్సవం
దేశ స్వాతంత్రోద్యమ సాఫల్యంలో, స్వతంత్ర భారత విద్యా, వైజ్ఞానిక, కళల వికాసానికి బహుముఖ ప్రజ్ఞతో విసుగు విరతి లేకుండా ప్రవహించే ఉత్తేజంలా శ్రమించిన దార్శనికుడు, పోరాటకారుడు, కవి, రచయిత, జర్నలిస్టు, విద్యావేత్త, పరిపాలకుడు, బహుభాషా కోవిదుడు, భారతరత్న మౌలానా అబుల్‌ ‌కలామ్‌ ఆజాద్‌. ‌బాల్యదశ నుంచే సాహిత్యం, తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు, మానవ విమోచనాల ఉద్యమ చరిత్రపై ప్రత్యేక అభినివేశం ఏర్పరచుకొని భారతీయ విద్యావికాసాన్ని గొప్ప ముందడుగు వేయించిన నవ్య మానవవాది.

1921లో సహాయ నిరాకరణ, 1930లో శాసనోల్లంఘన, 1942లో క్విట్‌ ఇం‌డియా ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించి, ఉద్యమ క్రమంలో నాయకత్వ పెఢధోరణులను, చీలికలను నివారించి, భిన్నమైన ఆకాంక్షలున్న ఉద్యమ శక్తులను ఏకతాటిపై నడిపించాడు. ఉద్యమ జీవితంలో పదకొండు సవంత్సరాల జైలు జీవితాన్ని గడిపిన ఆజాద్‌ ‌మాతృదేశ విముక్తి పోరులో చిరస్మరణీయ పాత్రను పోషించి, దేశభక్త లౌకకవాదానికి ప్రతీకగా నిలిచారు. 1947-52 వరకు విద్యాశాఖ మంత్రిగా, 1952-58 వరకు విద్యా, ప్రకృతివనరుల, శాస్త్ర సాంకేతిక మంత్రిగా, 1956 లో యునెస్కో అధ్యక్షునిగా పనిచేసిన ఆజాద్‌ అసమానమైన రీతిలో విద్యాభివృద్ధికి కృషిచేసారు.

వలసపాలకుల అవసరాలకు తోడ్పడుతూ వచ్చిన విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం కోసం, విద్య పునాదిని విప్లవీకరించడం కోసం దేశీయవనరులు, అవసరాలకు అననువైన ప్రజాతంత్ర విద్యను రూపొందించడం కోసం మౌలానా నిపుణులతో కమిటీలను వేసి వారి సిఫారసులను అమలుచేసాడు. బి.జి. ఖేర్‌ ‌కమిటీ (1947) సిఫారసుల మేరకు విద్యారంగానికి కేంద్రబడ్జెట్‌లో 10%, రాష్ట్ర బడ్జెట్‌లో 30% కేటాయింపులను అమలు చేయించారు. నళిని రంజన్‌ ‌సర్కార్‌ ‌కమిటీ(1947) సూచనల మేరకు శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం స్వాలంబన కోసం ప్రతిష్టాత్మక ఐఐటీలను స్థాపించాడు. లక్ష్మణస్వామి మొదలియార్‌ (1952) ‌కమిటీ సూచనలు స్వీకరించి పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్పు చేసి, వృత్తి విద్యను, క్రీడా విద్యను ప్రవేశపెట్టాడు. విజ్ఞాన విహారయాత్రలను తప్పనిసరిగా నిర్వహించాలని సూచించాడు.

రాధాకృష్ణన్‌(1948) ‌కమిషన్‌ ‌సిఫారసుల మేరకు యూజీసీని ఏర్పాటుచేస్తూ ఉన్నత విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను స్థాపించాడు. ఇవి దేశ నాగరికతని అభివృద్ధి పథంలో నడపగల మేధాపరమైన మార్గదర్శకుల్ని గుర్తించి, శిక్షణ ఇచ్చి, వివిధ రంగాల నిర్వహణకు అవసరమైన నిపుణులను తయారు చేయడంలో ప్రధానపాత్ర నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను ప్రారంభిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులకు స్నేహితుడుగా, మార్గదరర్శకుడిగా ఉంటూ జ్ఞాన ప్రసారాన్ని, వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్నాడు. అక్షరాస్యత పెంపు కోసం వయోజన విద్యను ప్రారంభించి, పరిశోధనాభివృద్ధి కోసం కౌన్సిల్‌ అం‌డ్‌ ‌సైంటిఫిక్‌ ఇం‌డస్ట్రీయల్‌ ‌రీసెర్చ్‌ను స్థాపించి దీని పరిధిలో దేశవ్యాప్తంగా 50కి పైగా పరిశోధనా సంస్థలను నెలకొల్పి ఆధునిక విద్యా భారత నిర్మాతగా చరిత్రలో నిలిచాడు.

బ్రిటిష్‌ ఇం‌డియాలో తీవ్ర నిర్లక్ష్యానికి లోనైన భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సాహిత్యాల వికాసానికి సాంస్కృతిక ఉద్యమ సేనానిగా పనిచేసారు. ప్రజల్లో సర్వవ్యాప్త ప్రేమను, అందం, ఆనందాల క్రియాశీలతను కలిగించే సృజనాత్మక వ్యక్తీకరణే కళ అని వాటి అభివృద్ధికి స్వయం ప్రతిపత్తి గల భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, సంగీత నాటక అకాడమి, సాహిత్య అకాడమి, ఆర్టస్ అకాడమిలను స్థాపించాడు. స్వయంగా సాహితీవేత్త ఐన మౌలానా గుబార్‌-ఎ-‌ఖాఅర్‌, ‌తర్జుమన్‌ ఉల్‌ ‌ఖురాన్‌ల ‘‘ది డాన్‌ ఆఫ్‌ ‌హోప్‌’’‌తో పాటు స్వీయచరిత్ర ‘ఇండియా విన్స్ ‌ఫ్రీడమ్‌’‌ను రాసాడు.

సామాజిక ఆర్ధిక వ్యవస్థను పునర్నిర్మించాలనే రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో ఆజాద్‌ ‌రూపాందించి అమలుచేసిన విద్యా వ్యవస్థ మార్గదర్శక సూత్రాలను పూర్తిస్థాయిలో అమలు చేయించుకోవలసిన బాధ్యత పౌర సమాజం స్వీకరించాలి. అప్పుడే విద్య ప్రజాస్వామికీకరించబడి అందరికీ సమానంగా అందించబడి సామాజిక న్యాయం జరిగి, సాంఘిక, ఆర్థిక అసమానతలు నివారింపబడి సృజనాత్మక, జ్ఞాన, లౌకిక భారతదేశం నిర్మింపబడుతుంది.

asnala srinivas
– అస్నాల శ్రీనివాస్‌
‌తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం
9652275560

 

Leave a Reply